Gig Workers Policy: 'తెలంగాణ ప్రభుత్వం గిగ్‌వర్కర్ల కోసం పని చేస్తుంది. ప్రతి డెలివరీపై మీకు వచ్చే దానిని మీకు తెలియజేస్తోంది. తెలంగాణలో నగరాల్లో ఎండల్లో మీరు మోటార్ సైకిళ్లపై వెళుతుంటారు. మీకు విశ్రాంతి కోసం ఎటువంటి రెస్ట్ హౌజ్‌లు లేవు. ఇప్పుడు మీరు రెస్ట్ తీసుకునేందుకు హైదరాబాద్‌లో, తెలంగాణలోని ఇతర నగరాల్లో తెలంగాణ ప్రభుత్వం రెస్ట్ హౌజ్‌లు నిర్మించింది. గిగ్ వర్కర్లకు అనారోగ్యం వచ్చినప్పుడు రూ.5 లక్షల ప్రమాద బీమా, రూ.పది లక్షల ప్రమాద బీమాను తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది' అని రాహుల్ గాంధీ తెలిపారు.
హైదరాబాద్‌లో గిగ్ వర్కర్లతో కలిసి శనివారం ర్యాలీ నిర్వహించిన అనంతరం జరిగిన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కీలక ప్రసంగం చేశారు. గిగ్ వర్కర్ల బాధ, నొప్పి తనకు తెలుసని చెప్పిన రాహుల్ గాంధీ.. గిగ్ వర్కర్ల కష్టం గుర్తించే తాను.. కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తామని నాడు హామీ ఇచ్చాం, వాగ్దానం చేశామని గుర్తుచేశారు. ఆ వాగ్దానాన్ని తాము నెరవేర్చినట్లు ప్రకటించారు. 'గిగ్ వర్కర్లకు సంబంధించిన డేటా ఇప్పటి వరకు భారతదేశంలో లేదు. డెలివరీకి సంబంధించి ఎంత సమయం పడుతుంది? ఎంత ఇస్తారనే సమాచారం కూడా లేదు. కష్టం మీది కానీ మీ సమాచారం మీ దగ్గర లేదు' అని తెలిపారు.
'గిగ్ వర్కర్లకు పింఛన్, ఇతర సౌకర్యాలు అందుతాయి. ప్రతి డెలివరీ, ప్రతి రవాణాకు సంబంధించిన 1 శాతం మీ గిగ్ వర్కర్ల ఖాతాలో చేరుతుంది. ఆ డబ్బు గిగ్ వర్కర్ల బోర్డుకు చేరుతుంది. అక్కడి నుంచి మీ ఖాతాకు చేరుతుంది' అని రాహుల్ గాంధీ ప్రకటించారు. 'దేశంలో రెండు ఆలోచన విధానాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్, బీజేపీ విధానం. అది కట్టు బానిసత్వాన్ని కోరుతుంది. 24 గంటలు పని చేయాలి. శ్రమను దోచుకునేవి. మీ శ్రమను అదానీకి, అంబానీకి దోచిపెట్టేవి. గిగ్ వర్కర్.. దేశానికి పునాది, దేశ భాగస్వామి అని కాంగ్రెస్ ఆలోచన విధానం. గిగ్ వర్కర్‌కు రక్షణ కల్పించాలనేది కాంగ్రెస్ ఆలోచన' అని ఎంపీ రాహుల్ గాంధీ తెలిపారు. 'మీకు ప్రతి డెలివరిలో వాటా రావాలని.. మీకు విశ్రాంతి దొరకాలని కాంగ్రెస్ భావిస్తోంది. నరేంద్ర మోదీ ఆలోచన విధానం మీకు ఏం దక్కవద్దంటోంది. రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీ పిల్లలకు చదువు, మీ ఆరోగ్యానికి అండగా ఉంటుంది' అని భరోసా ఇచ్చారు. మీరు భయపడవద్దు.. మీకు మేం అండగా ఉంటామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. '2023లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి పేదల కష్టాలను రాహుల్ గాంధీ తెలుసుకున్నారు. పాదయాత్రలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో రాహుల్ గాంధీని గిగ్ వర్కర్స్ కలిసి తమ సమస్యలను వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, గిగ్ వర్కర్స్ రక్షణ కోసం చట్టం తీసుకువస్తామని రాహుల్ గాంధీ ఆనాడు మాట ఇచ్చారు' అని గుర్తుచేశారు. 'గాంధీ కుటుంబం మాట ఇస్తే నిలబెట్టుకుంటుంది. ఎన్నో త్యాగాలు చేసిన గాంధీ కుటుంబ వారసుడిగా రాహుల్ గాంధీ చేతుల మీదుగా గిగ్ వర్కర్స్ చట్టం అమలవుతుంది. గిగ్ వర్కర్స్‌కు లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించాం. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం. గిగ్ వర్కర్స్ బోర్డును ఏర్పాటు చేశాం' అని వెల్లడించారు. 'రాహుల్ గాంధీ మాట ఇస్తే సువర్ణాక్షరాలతో లిఖించినట్లే. రాహుల్ గాంధీ మాట మాకు ఆదేశం. ఈ చట్టం అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తుంది. ఈ ప్రభుత్వం గిగ్ వర్కర్స్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటుంది' అని రేవంత్ రెడ్డి తెలిపారు.