SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Praja Balam Yatra: సంక్రాంతి పండుగ తర్వాత 'ప్రజాబలం'తో తెలంగాణ ప్రజల్లోకి వెళ్తా: రేవంత్‌ రెడ్డి

Revanth Reddy Announces Praja Balam Yatra After Sankranthi: తెలంగాణ ముఖ్యమంత్రి మరోసారి ప్రజల్లోకి వస్తామని ప్రకటించారు. ప్రజాబలం పేరుతో సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వస్తామని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ప్రజాబలంతో సునామీని సృష్టిస్తామని.. ఆ సునామీలో మోడీ, కేడీ కొట్టుకుపోతారని తెలిపారు. కొడంగల్‌ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో కీలక ప్రకటన చేశారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 09, 2026, 09:51 PM IST | Updated: Nov 09, 2026, 09:54 PM IST
Image Credit: Revanth Reddy Speech
Join

Kodangal: 'సంక్రాంతి తరువాత ప్రజాబలం పేరుతో ప్రజల్లోకి వస్తాం. అందరం కలసికట్టుగా ఎల్‌నినోను ఎదుర్కొందాం. ప్రజాబలంతో సునామీ సృష్టిస్తాం. ఆ సునామీలో మోడీ, కేడీ కొట్టుకుపోతారు' అని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. డిసెంబర్ నాటికి కృష్ణా జలాలు తెచ్చి కొడంగల్ బీడు భూములను తడుపుతామని ప్రకటించారు. ఈ సందర్భంగా పోలేపల్లి ఎల్లమ్మ తల్లిపై ఒట్టు వేశారు. కొడంగల్ ప్రజలు అండగా ఉంటే ఢిల్లీలో మోదీనైనా, కేడీనైనా ఎదిరిస్తానని తెలంగాణ సీఎం స్పష్టం చేశారు.

కొడంగల్‌ నియోజకవర్గంలోని లగచర్లలో సోమవారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'బూర్గుల రామకృష్ణారావు నుంచి ఇప్పటివరకు ఎంతో మంది పాలమూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినా ఈ ప్రాంతంలో వలసలు ఆగలేదు. మన ప్రాజెక్టులు పూర్తి కాలేదు.. మన పొలాలకు నీళ్లు అందించలేదు. ఈ 75 ఏళ్లలో ఒకరిని అడిగే పరిస్థితే తప్ప కావాల్సింది చేసే సమయం రాలేదు. ఆనాడు పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించిన కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తారని నమ్మాం. తెలంగాణ రావాలని కష్టాలు తీరాలని కనిపించిన దేవుడికల్లా దండం పెట్టాం' అని రేవంత్ రెడ్డి వివరించారు.

'తెలంగాణ వచ్చినా.. ముఖ్యమంత్రిగా బాధ్యత ఇచ్చినా పాలమూరు జిల్లా గుండెలపై తన్ని గజ్వేల్‌కు పోయాడు. భుజాలపై మోసిన పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పదేళ్లు పడావు పెట్టాడు. కక్షగట్టి పాలమూరు అభివృద్ధిని అడ్డుకున్నాడు. ఇన్నేండ్లు ఏ దేవుడు మన కష్టాలు వినలేదు. 2023లో ముక్కోటి దేవతల ఆశీస్సులతో కొడంగల్ బిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే అవకాశం దక్కింది' అని తెలంగాణ సీఎం తెలిపారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి ఏ ఒక్కరోజైనా సెలవు తీసుకోలేదని పేర్కొన్నారు.

'పదేళ్లలో కేసీఆర్ రూ.8 లక్షల 11 వేల కోట్లు అప్పు పెట్టి ఫామ్‌హౌస్‌లో పడుకున్నాడు. నాకు అప్పు చేసే అలవాటు లేదు. అబద్ధాలు చెప్పే అలవాటు అసలే లేదు. ప్రభుత్వం ఉద్యోగుల కష్టాలు చూసి 11 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు ఇవ్వాలని ఆలోచన చేశాం. జనవరి 1, 2024 నుంచి ప్రతీ నెల మొదటి తారీఖున జీతాలు పడుతున్నాయి. ప్రతీ సంవత్సరం కేసీఆర్ అప్పులకు తప్పులకు రూ.80 వేల కోట్లు చెల్లిస్తున్నాం' అని రేవంత్‌ రెడ్డి వివరించారు. కేసీఆర్ అప్పులకు తప్పులకు ఈ 34 నెలల్లో రూ.2 లక్షల కోట్లకుపైగా చెల్లించామని చెప్పారు' అని విమర్శించారు.

'మాట్లాడాలి రమ్మంటే కేసీఆర్ రాడు. ఆయన తింటే కుంభకర్ణుడు పంటే బకాసురుడు. మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పనులు మేం మొదలు పెడితే కేసీఆర్, కేటీఆర్ అడ్డుకుంటామంటున్నారు. కేటీఆర్‌కు గడ్డం రావడానికి 50 ఏళ్లు పట్టింది. బుద్ధి రావడానికి ఎన్నేళ్లు పడుతుందో. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఎన్నటికీ నక్క పులి కాదు. కేటీఆర్ నువ్వు గడ్డం పెంచుకున్నా.. గడ్డం మోకాళ్ల వరకు పెంచుకున్నా ఎన్నటికీ రేవంత్ కాలేవు' అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

'రేవంత్ రెడ్డి కావాలంటే గుండె ధైర్యం ఉండాలి.. నమ్ముకున్న వారి కోసం నిలబడే తెగువ కావాలి. పది జన్మలు ఎత్తినా నువ్వు రేవంత్ రెడ్డి కాలేవు. మేం లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేసుకుంటే మీకు కడుపుమంట ఎందుకు?' అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. డిసెంబర్ నాటికి కృష్ణా జలాలు తెచ్చి కొడంగల్ బీడు భూములను తడుపుతామని తెలిపారు. కొడంగల్ భూముల్లో పచ్చని పంటలు పండేలా చేసే బాధ్యత తనదని స్పష్టం చేశారు. ఇది పోలేపల్లి ఎల్లమ్మతల్లిపై ఆన. ఎవరూ అడ్డమొచ్చినా.. అడ్డు వచ్చినా వారిని  తొక్కుకుంటూ కొడంగల్‌కు కృష్ణా జలాలు తీసుకొస్తామని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

'ఆనాడు కొడంగల్ బిడ్డలు చదువుకోవాలంటే పక్క జిల్లాలకు.. పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి ఉండేది. ఇవాళ కొడంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా చేసి ఉన్నత చదువులకు కొడంగల్ వచ్చేలా చేసుకుంటున్నాం' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. కొడంగల్ అభివృద్ధి జరుగుతుంటే కొందరు ఏడుపులు మొదలుపెట్టారని.. ఇవాళ రూ.9 వేల కోట్లతో కొడంగల్‌లో అభివృద్ధి పనులు ప్రారంభించుకున్నట్లు వెల్లడించారు. 'రాబోయే రోజుల్లో వేల కోట్ల పెట్టుబడులు తెచ్చి అభివృద్ధి పథంలో నడిపిస్తాం. కొడంగల్ ప్రజలు అండగా ఉంటే ఢిల్లీలో మోదీనైనా, కేడీనైనా ఎదిరిస్తా' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిరంతరం పనిచేసి తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దే బాధ్యత తనదని తెలంగాణ సీఎం స్పష్టం చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES