Hyderabad Old City: హైదరాబాద్‌లో ఓల్డ్ సిటీకి పూర్వ వైభవం తీసుకొస్తాం: రేవంత్ రెడ్డి
Revanth Reddy Announces We Will Glory To Hyderabad Old City: హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీని అభివృద్ధి చేస్తామని.. పూర్వ వైభవం తీసుకువస్తామని తెలంగాణ సీఎం ప్రకటించారు. మెట్రో పనులను వేగవంతం చేశామని.. మూసీ పునరుజ్జీవంతో ఓల్డ్ సిటీకి పూర్వ వైభవం తీసుకువస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. మైనార్టీలకు కాంగ్రెస్ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని చెప్పుకొచ్చారు.
Hyderabad Metro Rail: 'హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ. సిటీని కాపాడుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఓల్డ్ సిటీలో మెట్రో పనులను వేగవంతం చేశాం. మూసీ పునరుజ్జీవంతో ఓల్డ్ సిటీకి పూర్వ వైభవం తీసుకొస్తాం' అని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించారు. మూసీ నదీ పరీవాహకంలో నైట్ ఏకానమీ అభివృద్ధి చేస్తామని తెలిపారు. చదువు ఒక్కటే జీవితాలను మారుస్తుందని.. పిల్లలను చదివించండి.. నైపుణ్యాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. నిఖత్ జరీన్, సిరాజుద్దీన్ తరహాలో పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాని కోరారు. నైపుణ్యం, క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని.. దీనికోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్‌లో బుధవారం జరిగిన జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవం కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రసంగించారు. 'దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ విద్య, వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యమిచ్చారు. దేశంలో విద్యాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు తొలి విద్యా శాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు బాధ్యతలు అప్పగించారు. దేశంలో ఐఐటీలను ఏర్పాటు చేసి ఎంతో మంది ఇంజనీర్లుగా తయారయ్యేందుకు అబుల్ కలాం ఆజాద్ పునాది వేశారు. దేశంలో విద్యాభివృద్ధికి ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించిన ఘనత అబుల్ కలాం ఆజాద్ సొంతం' అని రేవంత్ రెడ్డి వివరించారు.
'అబుల్ కలాం హయాంలోనే ఐటీఐలకు పునాది పడింది. ఆ ఐటీఐలను మనం ఇప్పుడు ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేసుకున్నాం. నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. సాఫ్ట్‌వేర్ రంగంతో పాటు పలు విభాగాల్లో ఏఐతో ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంది. కానీ బ్లూ కాలర్ జాబ్స్‌ను ఏఐతో చేయలేం. నైపుణ్యం పెంచుకుంటే భవిష్యత్‌లో బ్లూ కాలర్ ఉద్యోగ అవకాశాలకు కొదవ లేదు.
'గులాంనబీ ఆజాద్ నుంచి షబ్బీర్ అలీ వరకు కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు ఎన్నో అవకాశాలను ఇచ్చింది. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చి గౌరవించాం. షబ్బీర్ అలీని సలహాదారులుగా నియమించాం. ప్రజా ప్రభుత్వంలో మైనారిటీలకు ఎన్నో అవకాశాలు కల్పించాం. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మైనారిటీ రిజర్వేషన్‌ను తొలగిస్తామని బీజేపీ చేవెళ్ల సభలో ప్రకటించింది. ముందు గుజరాత్‌లో తొలగించి చూపించాలని మేం సవాల్ విసిరాం. మైనారిటీల సంక్షేమం మా బాధ్యత. దేశంలో ఏ రాజకీయ పార్టీకి స్వాతంత్ర్యం కోసం పోరాడిన చరిత్ర లేదు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతం' అని రేవంత్ రెడ్డి తెలిపారు.
'పేదలకు, మైనారిటీలకు కాంగ్రెస్ ఓటు హక్కు కల్పిస్తే బీజేపీ ఆ ఓట్లను తొలగించాలని చూస్తోంది. 12 ఏళ్లు గడిచినా బీజేపీ మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ హామీ నిలబెట్టుకోలేదు' అని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీతో పోరాడే శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని ప్రకటించారు. తెలంగాణ గల్లీ నుంచి వెళ్లిన కారు ఢిల్లీకి చేరగానే మోదీ కమలంగా మారిపోతోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి మాత్రమే బీజేపీని ఎదుర్కొనే సత్తా ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. క్రీడల్లో దేశ ప్రతిష్టను పెంచిన మైనారిటీ క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం నగదు బహుమతితో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి గౌరవించిందని చెప్పారు.