SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Revanth Reddy: బీఆర్‌ఎస్‌, బీజేపీపై రేవంత్ రెడ్డి ఆగ్రహం.. భారత్‌ సమ్మిట్‌కు రాహుల్ గాంధీ వస్తే విమర్శిస్తారా?

Revanth Reddy Slams To Bharat Summit Dispute: హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్‌ సమ్మిట్‌పై తీవ్ర వివాదం ఏర్పడడంతో రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ వెంటనే బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్‌ గాంధీ భారత్‌ సమ్మిట్‌కు వస్తే విమర్శిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ రెడ్డి ప్రెస్‌మీట్‌ వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Nov 13, 2026, 07:02 PM IST | Updated: Nov 13, 2026, 07:05 PM IST
Image Credit: Bharat Summit 2026
Join

Bharat Summit Dispute: ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీని బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తోందని.. బీజేపీ నియంతృత్వ వైఖరి అవలంభిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో అందరి అభిప్రాయాలు తీసుకుంటామని తెలిపారు. 'సుపరిపాలన కోసం రాజ్యాంగాన్ని  106 సార్లు మనం సవరించుకున్నాం. ప్రపంచ శాంతి కోసం చర్చ జరగాల్సిన అవసరం ఉంది. భారత్ సమ్మిట్ కోసం ఇక్కడికి వచ్చిన ప్రతీ అతిథి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతారు' అని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'భారత్ సమ్మిట్ ద్వారా తెలంగాణ పెట్టుబడులకు అనుకూలమని ప్రపంచానికి చాటడమే ప్రభుత్వ ఉద్దేశం. డిసెంబర్ 7,8,9 తేదీల్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. హైదరాబాద్ వాతావరణం పెట్టుబడులకు అనుకూలం' అని తెలంగాణ సీఎం ప్రకటించారు.

'భారత్‌ సమ్మిట్‌లో భాగంగా కర్టెన్ రైజర్ ఢిల్లీతో పాటు వివిధ ప్రాంతాల్లో కర్టెన్ రైజర్ కార్యక్రమాలు నిర్వహించాం. ముంబై, అహ్మదాబాద్ లోనూ కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. నవంబర్ 13, 14 తేదీల్లో భారత్ సమ్మిట్  కు 70 దేశాల నుంచివెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతున్నారు' అని రేవంత్‌ రెడ్డి వివరించారు. 'భారత్ సమ్మిట్‌కు ఆహ్వానించిన కొంతమందికి మొదట అనుమతులు ఇచ్చిన కేంద్రం.. ఇప్పుడు నిరాకరించింది. తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్నాయి' అని తెలిపారు. 'వివిధ రంగాల్లో వివిధ హోదాలలో ఉన్న వ్యక్తులను భారత్ సమ్మిట్‌కు ఆహ్వానించామని.. నగరాన్ని ప్రత్యక్షంగా చూసి పారిశ్రామిక విధానాలను తెలుసుకుంటారని భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. కిషన్ రెడ్డి, రాంచందర్ రావు, కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు' అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

పెట్టుబడులను ఆహ్వానించి 2034 నాటికి 1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ సీఎం ప్రకటించారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డును, తుమ్మిడిహట్టిని, ఇలా ప్రభుత్వం  ఏ నిర్ణయం తీసుకున్నా బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. వారు వ్యతిరేకించేది కాంగ్రెస్‌ను కాదు. తెలంగాణ ప్రజలను' అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

'కేంద్ర ప్రభుత్వానికి గిగ్ వర్కర్స్‌ను ఆదుకునే ఆలోచన లేదు. గిగ్ వర్కర్స్ చట్టాన్ని రేపటి నుంచి అమలు చేయబోతున్నాం. రాహుల్ గాంధీతో గిగ్ వర్కర్స్ చట్టం అమలును ప్రారంభించబోతున్నాం. భారత్ సమ్మిట్‌లో ముగింపు సందేశాన్ని ఇచ్చేందుకు రాహుల్ గాంధీ హైదరాబాద్ వస్తున్నారు' అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. 'ప్రధాని మోదీ ఇతర దేశాలకు వెళ్లి ఉపన్యాసాలు ఇస్తారు, విదేశాలలో సదస్సులు నిర్వహిస్తారు. మోదీ ఏది చేసినా కరెక్టు రాహుల్ గాంధీ చేస్తే తప్పు అన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తుంది' అని విమర్శించారు.

బీజేపీ నాయకుల కడుపులో విషం ఉండొచ్చు. అది తెలంగాణ ప్రజలపై ప్రదర్శించరాదని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 'రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అవుతారని బీజేపీ భయపడుతోంది. మీ రాజకీయాల కోసం రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనను వ్యతిరేకించొద్దు. ఢిల్లీల్లో గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి పీయూష్ గోయల్ వస్తే స్వాగతించిన బీజేపీ.. కానీ రాహుల్ గాంధీ వస్తే విమర్శిస్తారా? బీజేపీని వ్యతిరేకిస్తే భారతదేశాన్ని వ్యతిరేకించినట్లు కాదు' అని రేవంత్ రెడ్డి తెలిపారు.

'కాంగ్రెస్ పార్టీ భారత దేశం ఆత్మ. స్వాతంత్ర్య పోరాటం నుంచి దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒకరు విమర్శించినంత మాత్రాన రాహుల్ గాంధీ ప్రతిష్ట తగ్గదు. ఎల్ నినోపై అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించినా రాలేదు. అందుకే కిషన్ రెడ్డి, బండి సంజయ్ ను తెలంగాణ లెక్కల్లో లేరని భావిస్తున్నాం' అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ZEENEWS TRENDING STORIES