Rice Prices: దేశ వ్యాప్తంగా ఎల్‌నినో ఎఫెక్ట్, వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో అన్ని వస్తువుల ధరల పెరుగుదలకు కారణంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే బహిరంగ మార్కెట్‌లో సూపర్ ఫైన్ రకం బియ్యం కిలో ధర రూ. 90 నుంచి సెంచరీ చేరువలో ఉన్నాయి. సూపర్ ఫైన్ మీడియం రకం రూ. 85 నుంచి రూ. 90 మధ్య ఉంది. ఫైన్ రకం రూ. 78 నుంచి రూ. 80 రూపాయల మధ్య ఊగిసలాడుతుంది. మొత్తంగా చూసుకుంటే సన్న బియ్యం కిలో సెంచరీకి చేరంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతికూల వాతావరణం..
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రభావం.. ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులు, వరి సాగు 15లక్షల ఎకరాలకు పైగా తగ్గిందనేది శాస్త్రవేత్తలు చెబుతున్నమాట. దిగుబడి గణనీయంగా తగ్గుతుందనే అంచనాల నేపథ్యంలో దీన్ని వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్‌లో బియ్యం నిల్వలు తగ్గుతున్నాయనే ప్రచారం ధరల పెరుగుదలకు కారణంగా నిలుస్తుంది. ఇదే అదునుగా ఎల్‌నినో అంటూ ఇష్టారాజ్యంగా ధరల పెంచుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త బియ్యం వచ్చే వరకు ఈ సమస్య తప్పదని వ్యాపారులు చెబుతున్న మాట.
జూలై నుంచి పై పైకి బియ్యం ధరలు..
సన్న బియ్యం ధరలు గత జూలై నుంచి క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. జూన్‌లో క్వింటాల్ ధర రూ. 5వేల 600 నుంచి రూ. 6వేల 300 మధ్య ఉండగా.. ఆగస్టు నాటికి రూ. 6వేల 300కు చేరింది. అక్టోబర్‌లో నాణ్యత, బ్రాండ్‌ను బట్టి రూ. 8,400 నుంచి 9వేల 200 రూపాయల వరకు పలుకుతోంది. అంటే మూడు నెలల్లోనే క్వింటాల్‌పై దాదాపు రూ. 3 వేల వరకు పెరిగింది. హెచ్ఎంటీ, బీపీటీ, ఆర్ఎన్ఆర్ వంటి రకాల ధరలు భారీగా పెరిగాయి. జూన్‌లో క్వింటాల్ 4వేల 600 నుంచి 5వేల 500 మధ్య ఉన్న కొన్ని రకాల ధరలు ప్రస్తుతం 7 వేల నుంచి 8 వేల వరకు పలుకుతున్నాయి. కొన్ని ప్రీమియం రకాల ధరలు 9 వేల మార్కును దాటాయి.
రిటైల్ మార్కెట్‌లో కిలో బియ్యం రూ. 80..
రిటైల్ మార్కెట్లో ప్రస్తుతం ఫైన్ రకం బియ్యం కిలో రూ.80కి పైగా ధరలు వరకు అమ్ముతున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. నాణ్యత, బ్రాండ్, పాలిషింగ్, ప్యాకింగ్ను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటున్నది. జై శ్రీరామ్ వంటి ప్రీమియం రకాల ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయట. మొత్తంగా సామాన్య మధ్య తరగతి, మిడిల్ క్లాస్ వాళ్ల బడ్జెట్ తలకిందలవుతుంది.
నగరాలు, పట్టణాల్లో సన్నగా ఉండి, వండినప్పుడు గింజ నాణ్యతగా కనిపించే బియ్యానికి ఎక్కువ డిమాండ్ ఉంది.బహిరంగ మార్కెట్‌లో ధరల ఎక్కువ మొత్తంలో బియ్యం వినియోగించే కుటుంబాలు, హాస్టళ్లు, చిన్న హోటళ్లు, మెస్‌లపై అధిక భారం పడుతుంది. కొందరు హోటల్ నిర్వాహకులు.., మెస్ ల నిర్వాహకులు రేట్లు పెంచడం ద్వారా ఈ అదనపు భారాన్ని వినియోగదారులపై మోపే అవకాశాలున్నాయి. మార్కెట్‌లో సరఫరాలను సమీక్షించి అక్రమ నిల్వలపై తనిఖీలు చేపట్టాలని, ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు.