SA 1 Exams Telangana: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో SA-1 పరీక్షలు అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే.. ఈ పరీక్షలకు అతి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ చేపడుతున్న వరుస నిర్ణయాలు, ప్రణాళికారాహిత్యం క్షేత్రస్థాయిలో గందరగోళానికి దారితీస్తున్నాయి. పరీక్షల ముందు రోజుల్లో సిలబస్ పూర్తి చేసి, విద్యార్థులతో రివిజన్ చేయించాల్సిన కీలక సమయంలో ఉపాధ్యాయులకు వరుస ట్రైనింగ్స్..సమావేశాలు ఏర్పాటు చేయడంపై టీచర్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఈ విద్యా సంవత్సరంలో సెప్టెంబర్ నెల ప్రారంభం నుంచే బోధనా సమయం తీవ్రంగా దెబ్బతింది. గ్రామీణ ప్రాంతాల్లో సెప్టెంబర్ 14న వినాయక చవితి పండుగ వల్ల పాఠశాలలకు విద్యార్థుల హాజరు బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా గ్రామీణ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పండుగ వాతావరణం, ఇంట్లోని పనుల కారణాల వల్ల బడులకు సక్రమంగా హాజరు కాలేదు. విద్యార్థులు లేకపోవడంతో తరగతి గదుల్లో ఉపాధ్యాయులు అనుకున్న సమయానికి పాఠాలు పూర్తి చేయలేకపోయారు. దీనికితోడు.. సెప్టెంబర్ 25 తర్వాత వినాయక నిమజ్జనాలు, స్థానిక వేడుకల కారణంగా మరో రెండు రోజుల పాటు విద్యార్థుల హాజరు జీరో స్థాయికి చేరుకుంది. ఈ విధంగా పండుగల సీజన్‌లో తరగతులు నిరంతరాయంగా సాగకపోవడం సిలబస్‌ను వెనుకకు నెట్టింది.
ఇప్పటికే తగ్గిన హాజరు వల్ల విద్యాబోధన ఆలస్యమైన పరిస్థితుల్లో.. సెప్టెంబర్ 24వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు వరుస శిక్షణా కార్యక్రమాలను ప్రకటించింది. డిజిటల్ బోధన పేరిట సెప్టెంబర్ 25 నుంచి ఉపాధ్యాయులకు రెండు రోజుల పాటు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. దీంతోపాటుగా డిజిటల్ ట్రైనింగ్ ముగిసిన వెంటనే స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల పేరిట మరో రోజు ఉపాధ్యాయులు పాఠశాలలకు దూరమయ్యారు. ఈ వరుస శిక్షణలు, సమావేశాల వల్ల పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన పూర్తిగా స్తంభించిపోయింది. అక్టోబర్ 1 నుంచి పరీక్షలు ఆరంభమవుతుండగా.. సెప్టెంబర్ చివరి వారంలో ఉపాధ్యాయులు తరగతి గదుల్లో అందుబాటులో లేకపోవడం విద్యార్థుల అభ్యసనంపై తీవ్ర ప్రభావం చూపింది.
అక్టోబర్ 1 నుంచి ఎగ్జామ్స్ ఉన్నందున, ప్రస్తుతం ఈ శిక్షణలను వాయిదా వేసి, పరీక్షలు ముగిసిన తర్వాత నిర్వహించాలని పలు జిల్లాల్లోని హైస్కూల్ ఉపాధ్యాయులు సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయితే.. ఇవి రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల నుంచి వచ్చిన కచ్చితమైన ఆదేశాలు అని పేర్కొంటూ క్షేత్రస్థాయి అధికారులు ఈ విజ్ఞప్తులను పట్టించుకోలేదు. దీంతో ఉపాధ్యాయులు తప్పనిసరి పరిస్థితిలో బోధనను పక్కనబెట్టి శిక్షణలకు హాజరుకావాల్సి వచ్చింది.
సమగ్రంగా సిలబస్ పూర్తికాక, మరోవైపు రివిజన్ చేయించేందుకు సమయం దొరక్క విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారంటూ ఉపాధ్యాయులు మనోవేదనకు గురవుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలు ఇప్పటికే సిలబస్ పూర్తి చేసి..రెండు మూడు సార్లు రివిజన్ నిర్వహించి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేశాయి. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాశాఖ అనాలోచిత నిర్ణయాల వల్ల పరీక్షల ముందు రోజుల్లో కూడా ఉపాధ్యాయులను బడికి దూరం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎలా పోటీ పడగలరంటూ పలువురు హైస్కూల్ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడం, ప్రైవేట్‌కు పోటీగా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలోని పాఠశాలల క్యాలెండర్‌ను, పరీక్షల సమయాలను పరిగణనలోకి తీసుకోకుండా శిక్షణలు కేటాయించడం వల్ల అసలు లక్ష్యం దెబ్బతింటోందని అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి వాస్తవాలను గుర్తించి, పరీక్షల సమయంలో బోధనేతర ఒత్తిళ్లు.. అనాలోచిత శిక్షణలకు స్వస్తి పలకాలని ఉపాధ్యాయ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.