SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

School Holiday Tomorrow: రేపు సోమవారం స్కూళ్లకు సెలవు..తెలంగాణలో ఈ స్కూళ్లకు ప్రభుత్వం ఆదేశాలు!

School Holiday Tomorrow: ఆదివాసీల హక్కుల పోరాట యోధుడు కొమురం భీం వర్ధంతిని పురస్కరించుకుని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని (ఆసిఫాబాద్, ఆదిలాబాద్) అన్ని పాఠశాలలు, కళాశాలలకు రేపు సెలవు ప్రకటించారు. అక్టోబర్ 26న అన్నీ ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించగా.. రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు మాత్రం ఈ సెలవు వర్తించదని ఆదేశాలు జారీ చేశారు.

Written By Harish Darla
Published: Oct 25, 2026, 08:16 PM IST | Updated: Oct 25, 2026, 08:26 PM IST
Join

School Holiday Tomorrow: గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవ ప్రతీక కొమురం భీం వర్ధంతి సందర్భంగా రేపు స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని అనగా ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు ఈ సెలవు వర్తించనుంది. దీంతో ఆయా జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు అక్టోబర్ 26న అధికారికంగా సెలవు మంజూరయ్యింది.

అయితే రెసిడెన్షియల్ పాఠశాలలకు మాత్రం ఈ సెలవు ఉత్తర్వులు వర్తించవని అధికారులు స్పష్టం చేశారు. ఈ సెలవు దినానికి ప్రత్యామ్నాయంగా రాబోయే నవంబర్ 14వ తేదీ(రెండో శనివారం) ని పూర్తి పనిదినంగా పరిగణించాలని పాఠశాలలకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు.

కొమురం భీం పోరాట నేపథ్యం..
గోండు ఆదివాసీ తెగకు చెందిన విప్లవ వీరుడు కొమురం భీం నిజాం పాలకుల అణచివేత ధోరణికి వ్యతిరేకంగా వీరోచిత పోరాటం సాగించారు. అప్పట్లో గిరిజనులు తీవ్రంగా ఎదుర్కొన్న భూముల ఆక్రమణలు, అటవీ సంపద వినియోగంపై నిజాం సర్కారు విధించిన ఆంక్షలను ఆయన గట్టిగా ప్రతిఘటించారు. అడవుల్లో జీవించే స్థానిక ప్రజలకు వారి నేలలపై పూర్తి హక్కులు ఉండాలని, సహజ వనరులను స్వేచ్ఛగా అనుభవించే వీలుండాలని ఉద్యమించారు.

ఈ క్రమంలో ఆయన అందించిన 'జల్, జంగల్, జమీన్' (నీరు, అడవి, భూమి) అనే నినాదం ఆదివాసీల ఆత్మగౌరవ పోరాటానికి జీవనాడిగా మారింది.

నిజాం సైన్యాల దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు ఆదివాసీలను ఏకతాటిపైకి తెచ్చిన భీం, ప్రస్తుతం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని జోడేఘాట్ అటవీ ప్రాంతాన్ని తన పోరాట కేంద్రంగా ఎంచుకున్నారు. 1940లో జోడేఘాట్ వద్ద నిజాం సైన్యంతో జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఆయన అమరుడయ్యారు. ఆయన ప్రాణత్యాగం గిరిజన హక్కుల ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది. నేటికీ గిరిజన సమాజం ఆయనను తమ హక్కుల పోరాట వీరుడిగా ఘనంగా స్మరించుకుంటోంది.

ప్రభుత్వ గుర్తింపు, స్మారక ఉత్సవాలు..
కొమురం భీం చేసిన మహోన్నత సేవలకు గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం 2016 అక్టోబర్ 11న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచి విడివడిన ప్రాంతానికి 'కొమురం భీం ఆసిఫాబాద్' అని నామకరణం చేసింది. ఈ జిల్లాకు ఆసిఫాబాద్ పట్టణం ప్రధాన కేంద్రంగా కొనసాగుతోంది.

జోడేఘాట్‌లో ఏర్పాటు చేసిన కొమురం భీం స్మారక స్థలం ఆదివాసీ సంస్కృతి, చరిత్రలకు ప్రతీకగా నిలుస్తోంది. ఆయన వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా అక్కడ అధికారిక స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వయం పాలన, అటవీ హక్కుల సాధన కోసం భీం చేసిన పోరాటం యావత్ తెలంగాణ చరిత్రలో సామాజిక న్యాయానికి శాశ్వత ప్రతీకగా నిలిచింది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES