Telangana New Pensions Update: తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన అర్హులైన వారికి 4.75 లక్షల కొత్త సామాజిక భద్రతా పెన్షన్లు మంజూరు చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అర్హులైన వారికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
కొత్తగా ఎంపికైన పెన్షన్ లబ్ధిదారులకు నవంబర్ 26న, రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆర్థిక సాయం అందించనున్నట్లు మంత్రి తెలిపారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాల వారీగా పెన్షన్ల మంజూరులో రంగారెడ్డి జిల్లాకు గణనీయమైన సంఖ్య కేటాయించారు. ఆ జిల్లాలో 60 వేలకు పైగా కొత్త పెన్షన్లు మంజూరు కాగా, మహేశ్వరం నియోజకవర్గంలో 4,822 మందికి ప్రయోజనం చేకూరనున్నట్లు వెల్లడించారు.
ఇప్పటికే పెన్షన్లు మంజూరు చేసినప్పటికీ, అర్హత ఉండి వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకోలేని వారు కూడా ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది. అలాంటి వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదని మంత్రి సీతక్క సూచించారు. అర్హులైన వారు వెంటనే సంబంధిత గ్రామ, పట్టణ అధికారులను లేదా ప్రజాపాలన కేంద్రాలను సంప్రదించి తమ దరఖాస్తులను సమర్పించాలని పిలుపునిచ్చారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు.
తెలంగాణలో అమలవుతున్న చేయూత సామాజిక భద్రతా పెన్షన్ పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, డయాలసిస్, ఫైలేరియా బాధితులకు ఆర్థిక సహాయం అందుతోంది. సాధారణ లబ్ధిదారులకు నెలకు రూ. 2,016, దివ్యాంగులకు రూ. 4,016 చొప్పున పెన్షన్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వయస్సు ధ్రువీకరణ పత్రం, బ్యాంకు పాస్‌బుక్, సంబంధిత అర్హత పత్రాలను సిద్ధం చేసుకోవాలి. వీటిని గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ కార్యాలయంలో సమర్పించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హత కలిగిన వారికి పెన్షన్ మంజూరు చేస్తారు.