Bhatti Vikramarka Dussehra Wishes: తెలంగాణలో చేసుకునే అతి పెద్ద పండుగ దసరాను పురస్కరించుకుని ప్రజలకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన గెలుపుగా భావించి చేసుకునే దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు శుభాకాంక్షలు చెబుతూ ప్రకటన విడుదల చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో పండుగ చేసుకోవాలని.. అందరి కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటన
'చెడుపై మంచి సాధించిన గెలుపు, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా చేసుకునే విజయదశమి పండుగ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో దసరాకు ప్రత్యేక స్థానం ఉంది. దసరా పండుగ మనకు ధైర్యం, ధర్మం, సత్యం, ఐకమత్యం, ఆత్మవిశ్వాసం వంటి గొప్ప విలువలను బోధిస్తుంది. మనలోని అహంకారం, అసూయ, ద్వేషం, అన్యాయం వంటి చెడు లక్షణాలను తొలగించుకుని ప్రేమ, కరుణ, సోదరభావం, మానవత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ పండుగ సందేశమిస్తోంది' అని తెలంగాణ ముఖ్యమంత్రి ఓ ప్రకటనలో తెలిపారు.
'ఈ విజయదశమి ప్రతి ఇంటా ఆనందాల పూలు పూయించాలని.. ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రతి ఒక్కరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, విజయాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అని తెలంగాణ సీఎం ఆకాంక్షించారు. 'మహిషాసురుడిని సంహరించి దుష్టశక్తులపై విజయం సాధించిన అమ్మవారి శక్తిని, శ్రీరాముడు రావణాసురుడిపై సాధించిన విజయాన్ని ఈ పర్వదినం మనకు గుర్తుచేస్తుంది. తెలంగాణలో దసరా సందర్భంగా జమ్మిచెట్టుకు పూజలు చేయడం, జమ్మి ఆకులను బంగారంగా భావించి పెద్దలకు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోవడం ప్రత్యేక సంప్రదాయం' అని గుర్తు చేశారు. ఈ ఆచారం ప్రకృతిని ప్రేమించాలని, పెద్దలను గౌరవించాలని చాటిచెబుతుందని తెలంగాణ సీఎం పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎం శుభాకాంక్షలు
'తెలంగాణ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు. మహిళా సంక్షేమం, ఆర్థిక స్వావలంబనకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పండుగ ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు నింపాలి' అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.
'దసరా పండుగ ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం, పరస్పర సహకార స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని ఆయన పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రతి కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలి. మహిళల సంక్షేమం, ఆర్థిక స్వయం స్వావలంబన, ఆత్మగౌరవానికి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ వంటి పథకాలు కుటుంబాలకు తోడ్పాటునందిస్తున్నాయి. మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడం, ఉపాధి అవకాశాలను విస్తరించడం, మహిళలకు ఆర్థికంగా ఎదిగేందుకు మరిన్ని అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం' అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రతి కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు. విజయదశమి పండుగ ప్రజలందరిలో ఐక్యత, సోదరభావం, సేవా స్ఫూర్తిని పెంపొందించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని, ప్రతి కుటుంబం ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని కోరుకున్నారు.