Bethupally Cheruvu: ఎస్డీఆర్‌ఎఫ్ బోట్లు గల్లంతు.. తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రి అలర్ట్
Telangana CM And Deputy CM High Alert On SDRF Boats Washed Away Incident: భారీ వర్షాలతో చెరువులో ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్లు గల్లంతు కావడంపై తెలంగాణ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంతోపాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు అప్రమత్తమయ్యారు. సంఘటనపై వివరాలు ఆరా తీయడమే కాకుండా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
SDRF Boats Washed Away: మురసు తుఫాను ప్రభావంతో తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఆకస్మిక వరదతో చెరువు అలుగు పారడంతో అందులో మత్య్సకారులు చిక్కుకోగా.. వారిని కాపాడేందుకు వెళ్లిన ఎస్‌డీఆర్ఎఫ్ బోట్లు గల్లంతయ్యాయి. ఆ బోట్లలో ఎస్డీఆర్‌ఎఫ్‌కు చెందిన 13 మంది ఉన్నట్లు తెలియడంతో తీవ్ర సంచలనం రేపింది. ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది వరదలో కొట్టుకుపోవడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే సహాయక చర్యలకు ఆదేశించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంతోపాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు స్పందించి స్థానిక అధికార యంత్రాంగానికి సహాయ చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ముఖ్యమంత్రి ఆదేశాలు
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని బేతుపల్లి చెరువులో ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్ల గల్లంతుపై తెలంగాణ ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు.
డిప్యూటీ సీఎం ఆరా
సత్తుపల్లిలోని బేతుపల్లి చెరువులో ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్ల గల్లంతుపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించి సంఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు ముమ్మరం చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్‌కు డిప్యూటీ సీఎం ఆదేశాలు ఇచ్చారు. అధికార యంత్రాంగానికి వీలైనంత సహాయ చర్యలు చేపట్టాలని భట్టి విక్రమార్క ఆదేశాలు ఇచ్చారు.
రంగంలోకి బండి సంజయ్
ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వరదలో గల్లంతు కావడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వెంటనే రంగంలోకి దిగారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎస్డీఆర్ఎఫ్ బోట్ల గల్లంతుపై కలెక్టర్ దివాకర్‌తో ఫోన్‌లో మాట్లాడి కేంద్ర మంత్రి బండి సంజయ్ వివరాలు తెలుసుకున్నారు. చెరువులో కొట్టుకుపోయిన ఎస్డీఆర్ఎఫ్ బోట్ల ఆచూకీ కనిపెట్టాలని ఎన్డీఆర్ఎఫ్ ఉన్నతాధికారులను కోరారు. దీంతో యుద్ద ప్రాతిపదికన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగింది.
పొంగులేటి సమీక్ష
బేతుపల్లి చెరువులో ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్ల గల్లంతు ఘటనపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్లు గల్లంతైన ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన వెంటనే రంగంలోకి దిగారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన అన్ని సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, అవసరమైన అన్ని రకాల రక్షణ పరికరాలు, బోట్లను అందుబాటులో ఉంచాలని అధికారులకు మంత్రి సూచించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఆచూకీ తెలుసుకునేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌తో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని, సహాయక చర్యల పురోగతిని నిరంతరం సమీక్షిస్తున్నామని మంత్రి శ్రీనివాస రెడ్డి తెలిపారు. పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు రేపు ఉదయం సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని క్షేమంగా బయటకు తీసుకురావడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని మంత్రి స్పష్టం చేశారు.