Cyclone Murasu: మురసు తుఫాను ప్రభావం తెలంగాణలో కూడా ప్రభావం చూపింది. తుఫాను ప్రభావంతో ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురవగా కొన్ని చెరువుల కట్టలు తెగాయి. కట్టలు తెగి వరద ప్రవాహం ముంచెత్తడంతో మత్య్సకారులు వరదలో చిక్కుకున్నారు. అయితే వారిని కాపాడేందుకు వెళ్లిన ఎస్‌డీఆర్‌ఎఫ్ సహాయక బృందం కూడా వరదలో కొట్టుకుపోవడం తీవ్ర సంచలనం రేపింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తుఫాను ప్రభావంతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో బేతుపల్లి చెరువుకు భారీ ప్రవాహం వచ్చింది. దీంతో చెరువు ప్రవాహంలో 8 మంది మత్సకారులు చిక్కుకున్నారు. మత్య్సకారులను స్థానిక అధికార యంత్రాంగంతో కలిసి కాపాడేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగింది. మొదట ముగ్గురు మత్య్సకారులను ఎస్‌డీఆర్‌ఎఫ్ సురక్షితంగా కాపాడింది. మిగిలిన 5 మంది మత్య్సకారులను కాపాడే ప్రయత్నంలో ఎస్డీఆర్‌ఎఫ్‌కు చెందిన బోట్లు వరదలో కొట్టుకుపోయాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో మురసు తుఫాన్ బీభత్సం సృష్టించింది. గత 36 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పోర్లయి. వరద ఉధృతికి పలు ప్రాంతాల్లో చెరువుకట్టలు దెబ్బతినగా, పంట పొలాలు నీట మునిగాయి. మరోవైపు వరదల్లో చిక్కుకున్న పది మందిని ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సాహసోపేతంగా రక్షించారు. దమ్మపేట మండలం శ్రీరాంపురం వద్ద మల్లెపూల వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఓ మహిళ వరద నీటిలో చిక్కుకుపోయి చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకుంది. సమాచారం అందుకున్న ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి మహిళను సురక్షితంగా కాపాడారు.
ముసళ్లబంధం వద్ద చెరువుకట్ట తెగిపోవడంతో వరదనీరు మల్లెపూల వాగులోకి భారీగా చేరింది. ఈ క్రమంలో తొట్టిపంపు గ్రామానికి చెందిన తొమ్మిది మంది పొలం పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా వరద నీటిలో చిక్కుకుపోయారు.. వెంటనే స్పందించిన ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది బోటు సహాయంతో తొమ్మిది మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మొత్తంగా వరదల్లో చిక్కుకున్న పది మందిని కాపాడటంతో బాధితులు, గ్రామస్థులు రెస్క్యూ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశాలు
ప్రమాద సమయంలో రెండు బోట్లలో 13 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఉన్నట్టు సమాచారం. సత్తుపల్లిలోని బేతుపల్లి చెరువులో ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్ల గల్లంతుపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చారు. అధికార యంత్రాంగానికి వీలైనంత సహాయ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఆదేశాలు ఇచ్చారు.