SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

​CPS రద్దు చేయాల్సిందే.. OPS కోసం కదం తొక్కిన 1,72,000 మంది ఉద్యోగులు

Telangana CPS Protest: పాత పెన్షన్ విధానం (OPS) కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు రోడెక్కారు.కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS)ను రద్దు చేయాలని కోరుతూ TSCPSEU ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. మేనిఫెస్టో డే సందర్భంగా 33 జిల్లాల్లో ధర్మదీక్షలు నిర్వహించగా, సుమారు 1.72 లక్షల మంది సామూహిక సెలవులో పాల్గొన్నట్లు సంఘం నాయకులు వెల్లడించారు.

Written By Ashok Krindinti
Published: Nov 17, 2026, 18:36 IST | Updated: Nov 17, 2026, 18:37 IST
Image Credit: ​Telangana CPS Protest
Join

​Telangana CPS Protest: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) విధానాన్ని రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ 'తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU)' ఆధ్వర్యంలో మంగళవారం 'మేనిఫెస్టో డే' సందర్భంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రంలోని సుమారు 2.60 లక్షల మంది CPS ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో అత్యవసర సేవల్లో ఉన్నవారు మినహా.. దాదాపు 1,72,,000 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు సామూహిక సెలవు పెట్టి రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో పూర్తి శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్మదీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా TSCPSEU రాష్ట్ర అధ్యక్షులు జి.స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. 2004 నుంచి సాగుతున్న ఈ సుదీర్ఘ పోరాటంలో ప్రస్తుత సమయం పరీక్షకు ముందు పది రోజులంత అత్యంత కీలకమైనదని అన్నారు. గతలో పీసీసీ అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి.. వరంగల్ సభలో CPS రద్దు చేసి OPS పునరుద్ధరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పాత పెన్షన్ ఇచ్చే పార్టీకే మా ఓటు అనే లక్ష్యంతో రాష్ట్రంలోని 2.60 లక్షల మంది CPS ఉద్యోగ, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు పనిచేయడం వల్లే నేడు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. గత ఎన్నికల్లో 15 నియోజకవర్గాల్లో CPS ఉద్యోగ, ఉపాధ్యాయుల ఓట్లు గెలుపోటములను ప్రభావితం చేశాయని పేర్కొన్నారు.

"​కానీ మూడేళ్లు గడుస్తున్నా.. నేటికీ హామీ కార్యరూపం దాల్చకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక అభద్రతకు లోనవుతున్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా, పాత పెన్షన్ వల్ల ఆర్థిక భారం పడుతుందంటూ కొందరు అధికారులు ఇచ్చే తప్పుడు నివేదికలను పక్కనపెట్టి ప్రభుత్వం నేరుగా నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రంలో రిటైర్మెంట్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. సర్వీసులో లక్ష రూపాయల జీతం తీసుకుని పదవీ విరమణ పొందిన వారికి నెలకు కేవలం రూ.1,500 నుంచి రూ.5,218 వరకు మాత్రమే అరకొర పెన్షన్ వస్తోంది. హెల్త్ కార్డులు వర్తించక, డీఏ ఏరియర్స్ అందక, కనీస వైద్య ఖర్చులకు కూడా డబ్బుల్లేక కొందరు రిటైర్డ్ ఉపాధ్యాయులు కూరగాయల దుకాణాల్లో, వాచ్‌మెన్‌లుగా పనిచేయాల్సిన అత్యంత దుర్భర పరిస్థితి నెలకొంది. నేటి సామూహిక సెలవులో పాల్గొనవద్దని.. సెలవు పెడితే సర్వీస్ బ్రేక్ అవుతుందని, వేతనాలు నిలిపివేస్తామని, బదిలీల్లో ఇబ్బందులు ఎదురవుతాయని కొందరు అధికారులు భయపెట్టే ప్రయత్నాలు చేసినా.. యూనిఫామ్ సర్వీసెస్ (45 నుంచి 50 వేల మంది) మినహా రాష్ట్రవ్యాప్తంగా 70 నుంచి 80 శాతం మంది 1,75,000 లకు పైగా ఉద్యోగ, ఉపాధ్యాయులు వెరవకుండా ఐక్యతను చాటడం అభినందనీయం.  

కేవలం ఉద్యోగ, ఉపాధ్యాయుల పదవీ విరమణ అనంతర జీవిత భద్రత కోసమే ఈ పోరాటం చేస్తున్నాము. ఆగస్టు 23న ఎల్బీ స్టేడియం సభలో కోరిన విధంగా ఉద్యోగుల పాలిట గొడ్డలిపెట్టుగా మారిన జీవో ఎంఎస్ నెం. 28 (GO Ms No. 28) ను వెంటనే రద్దు చేయాలి. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు సంకీర్ణ ప్రభుత్వంలోని జార్ఖండ్ రాష్ట్రాలు CPS విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే బాటలో తక్షణ నిర్ణయం తీసుకోవాలి" అని కోరారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. CPS విధానంతో ప్రభుత్వ వాటా 10 శాతం, ఇటు ఉద్యోగుల వాటా 10 శాతం కలిపి ప్రతినెలా దాదాపు రూ.200 కోట్ల ప్రజాధనం షేర్ మార్కెట్‌లోకి తరలిపోతూ వృథా అవుతోందన్నారు. 2004 నుంచి 2026 వరకు తెలంగాణ CPS ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన దాదాపు రూ.19 వేల కోట్ల నిధులు NPS ట్రస్ట్ ద్వారా షేర్ మార్కెట్‌లో నిలిచి ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం CPS విధానాన్ని రద్దు చేస్తే.. దాదాపు రూ.19,000 కోట్ల నిధులు తిరిగి రాష్ట్రానికి అందుబాటులోకి వస్తాయన్నారు. "తద్వారా రాష్ట్ర ఖజానాపై భారం పడకపోగా, ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయి. కావున ఈ విధానం రద్దు పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలి" అని విజ్ఞప్తి చేశారు. గత 12 ఏళ్లుగా CPS ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేస్తున్న TSCPSEU, సభ్యులకు రూ.లక్ష వెల్ఫేర్ ఇన్సూరెన్స్, ఈ ఏడాది రూ.3 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కూడా అందిస్తోంది" అని ఆయన గుర్తుచేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES