SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

అధికారుల నిర్లక్ష్యానికి ఉపాధ్యాయురాలు బలికావాలా? సంచలన తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు..!!

Telangana High Court: అధికారుల పొరపాట్ల వల్ల ఎలాంటి తప్పు చేయని ఉపాధ్యాయురాలి ఉద్యోగాన్ని తొలగించడం ఏమాత్రం చెల్లదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

Written By Bhoomi
Published: Oct 25, 2026, 10:00 AM IST | Updated: Oct 25, 2026, 10:02 AM IST
Image Credit: Telangana High Court
Join

Telangana High Court: అధికారుల పొరపాట్ల వల్ల ఎలాంటి తప్పు చేయని ఉపాధ్యాయురాలి ఉద్యోగాన్ని తొలగించడం ఏమాత్రం చెల్లదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అభ్యర్థి వైపు నుంచి ఎలాంటి మోసం లేదా పొరపాటు లేనప్పుడు.. నియామకం పూర్తయిన తర్వాత వారికి లభించే ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకోకుండా.. కనీసం నోటీసు ఇవ్వకుండా లేదా వివరణ కోరకుండా ఉద్యోగం నుంచి తీసివేయడం తీవ్ర చట్టవిరుద్ధమని న్యాయస్థానం తేల్చిచెప్పింది.

కేసు పూర్తి వివరాలు:
ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సబావత్ వీణ అనే అభ్యర్థి డీఎస్సీ-2024 (DSC-2024) పరీక్షల్లో 67.37 మార్కులతో రాష్ట్రస్థాయిలో 226వ ర్యాంకు సాధించారు. ఎస్జీటీ (SGT) పోస్టుకు ఎంపికైన ఆమె, మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలంలోని మొరంబావి తండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 2024, అక్టోబర్ 16న ఉపాధ్యాయురాలిగా బాధ్యతలు స్వీకరించి విధుల్లో చేరారు.

అయితే, అదే సామాజిక వర్గానికి చెందిన డి. వినోద్ కుమార్ అనే మరొక అభ్యర్థికి తన కంటే ఎక్కువ మార్కులు, మెరుగైన ర్యాంకు ఉన్నాయనే సాంకేతిక కారణాన్ని చూపుతూ విద్యాశాఖ అధికారులు జులై 10న అనూహ్యంగా సబావత్ వీణ సర్వీసును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారుల నిర్ణయంతో తీవ్ర అన్యాయానికి గురైన వీణ, తన ఉద్యోగ తొలగింపును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు కీలక తీర్పు:
ఈ పిటిషన్‌పై లోతుగా విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్, విద్యాశాఖ అధికారుల వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం లేదా పొరపాటుకు బాధితురాలైన ఉపాధ్యాయురాలిని బాధ్యురాలిని చేయడం తగదని స్పష్టం చేస్తూ ఆమె తొలగింపు ఉత్తర్వులను పూర్తిగా రద్దు చేశారు.

మరొక అభ్యర్థి నియామకంపై స్పష్టత: ఎంపిక ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత వేరొక అభ్యర్థి ఇచ్చిన వినతిపత్రాన్ని ఆధారంగా చేసుకుని, నియామక ప్రక్రియను తిరిగి ప్రారంభించి అప్పటికే విధుల్లో ఉన్న అభ్యర్థిని తొలగించడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఒకవేళ అర్హత ఉన్న మరో అభ్యర్థిని నియమించాల్సి వస్తే, అందుబాటులో ఉన్న ఇతర ఖాళీల్లో అతనికి అవకాశం ఇవ్వాలని సూచించింది.

సూపర్ న్యూమరరీ పోస్టు: 
ఒకవేళ ప్రస్తుతం ఎలాంటి ఖాళీలు లేకపోతే, కొత్తగా ఖాళీ ఏర్పడేంత వరకు సదరు అభ్యర్థి కోసం ప్రత్యేకంగా 'సూపర్ న్యూమరరీ' పోస్టును సృష్టించి కొనసాగించవచ్చని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అందుకోసం అప్పటికే పనిచేస్తున్న వీణను ఉద్యోగం నుంచి తీసివేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.

అయితే వీణ వేసిన పిటిషన్ను అనుమతించిన కోర్టు.. రానున్న 8 వారాల్లోగా ఆమెను అన్ని రకాల సర్వీసు, అనుబంధ ప్రయోజనాలతో తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ.. తుది తీర్పును వెలువరించింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES