SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Telangana Inter Education Policy: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 11వ తరగతి బోర్డు పరీక్ష రద్దు? 9 నుంచి 12వ తరగతి వరకు!

Telangana Inter Education Policy 2027: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రతిపాదనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2027-28 విద్యా సంవత్సరం నుంచి 9 నుంచి 12వ తరగతి వరకు ఒకేచోట చదివే అవకాశం కల్పించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా 11వ తరగతి బోర్డు పరీక్షను తొలగించి, 12వ తరగతిలో మాత్రమే బోర్డు పరీక్ష నిర్వహించే ప్రతిపాదన ఉంది.

Written By Harish Darla
Published: Nov 13, 2026, 08:30 AM IST | Updated: Nov 13, 2026, 08:35 AM IST
Join

Telangana Inter Education Policy 2027: తెలంగాణ విద్యావ్యవస్థలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. పదో తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్‌లో చేరకుండా ఏటా వేలాది మంది విద్యార్థులు చదువుకు దూరమవుతున్న నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం చూపాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇందులో భాగంగా ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసి, 9 నుంచి 12వ తరగతి వరకు ఒకే విద్యాసంస్థలో చదువుకునే విధానాన్ని తీసుకురావాలని యోచిస్తోంది.

2027-28 విద్యా సంవత్సరం నుంచి ఈ సీనియర్ సెకండరీ విధానాన్ని అమలు చేయాలన్నది లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పదో తరగతి తర్వాత ఇంటర్ ఫస్టియర్‌లో చేరుతున్న విద్యార్థుల శాతం సుమారు 88 శాతంగా ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. అంటే ప్రతి సంవత్సరం దాదాపు 40 నుంచి 45 వేల మంది విద్యార్థులు తదుపరి చదువులకు దూరమవుతున్నట్లు అంచనా. వీరిలో బాలికల సంఖ్య ఎక్కువగా ఉండటం విద్యాశాఖను ఆందోళనకు గురిచేస్తోంది.

కొత్త విధానంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలను వినియోగించుకోవాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 411 కాలేజీలను సమీపంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో అనుసంధానించి 9 నుంచి 12వ తరగతి వరకు బోధన అందించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైన చోట అదనపు తరగతి గదులు నిర్మించే ప్రణాళిక కూడా ఉంది.

ప్రైవేటు విద్యాసంస్థలకూ కొత్త అవకాశాలు కల్పించే అంశం పరిశీలనలో ఉంది. పదో తరగతి వరకు బోధించే పాఠశాలలు ఇంటర్మీడియట్ తరగతులకు, జూనియర్ కాలేజీలు 9, 10వ తరగతులకు అనుమతులు పొందే విధంగా నిబంధనలు రూపొందించాలని అధికారులు యోచిస్తున్నారు.

మరోవైపు 11వ తరగతికి బోర్డు పరీక్షను రద్దు చేయాలన్న ప్రతిపాదన కూడా చర్చలో ఉంది. విద్యార్థులు వరుసగా మూడు సంవత్సరాలు బోర్డు పరీక్షలు రాయాల్సిన పరిస్థితిని తగ్గించి, 12వ తరగతిలో మాత్రమే బోర్డు పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే ఈ మార్పులపై ప్రభుత్వం తుది మార్గదర్శకాలు విడుదల చేయాల్సి ఉంది. ఈ విధానం అమల్లోకి వస్తే పాఠశాల నుంచి ఇంటర్మీడియట్‌కు మారే సమయంలో విద్యార్థులు ఎదుర్కొనే ఇబ్బందులు తగ్గవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, బాలికలు చదువు కొనసాగించేందుకు మెరుగైన అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

ZEENEWS TRENDING STORIES