మందు బాబులకు షాక్.. రేపటి నుంచి తెలంగాణలో లిక్కర్ షాప్స్ బంద్..?
Telangana Liquor Shops Closed: తెలంగాణలో రేపటి నుంచి బార్‌ల వ్యాపారులు ఆందోళన బాట పట్టనున్నారు. బార్ల లైసెన్స్ నిబంధనలు, ఫీజుల పెంపు విషయంలో ప్రభుత్వ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది.
Telangana Bars Closed: తెలంగాణలో లిక్కర్ షాపులు నిర్వహించే వారికి ప్రభుత్వం భారీగా ఫీజులు మోపడంతో బార్ లైసెన్స్ పొందిన వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బార్ లైసెన్స్.. ఇతరత్రా ప్రభుత్వ విభాగాలు, మున్సిపల్, పోలీసులు, ఎక్సైజ్ వాళ్లకు చేతులు తడపందే తమ పని కావడం లేదంటున్నారు. పైగా బార్ లైసెన్స్ పొందాలంటే ఎన్నో అగచాట్లు పడి ఎన్నో లక్షలు నీళ్లలా ఖర్చు పెడితే కానీ బార్ లెసెన్స్ లు మంజూరు కావడం లేదు.
బార్ లైసెన్స్ మంజూరైనా.. ఆయా బార్లు ఉన్న రోడ్ల పై టాక్స్ పేయర్స్ (మందుబాబులు ) ఎక్కడ పడితే అక్కడ తమ బండ్లను పార్క్ చేస్తున్నారు. ఇవి ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. సామాన్య ప్రజలు వీటి వల్ల తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. అయితే బారు యజమానులు నెలకు ఇంత అని మున్సిపల్ అధికారులకు ముడుపులు ఇవ్వడం మూలానే వాళ్లు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. మరోవైపు పోలీసుల మాముళ్లు సరేసరి. మరోవైపు ఎక్సైజ్ సహా కొన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన వాళ్లు.. బారు యజమానులను పట్టి పీడిస్తున్నారు. అయితే ఇందులో ఎక్కువ రాజకీయ నాయకులు ఉండటంతో కొన్ని బార్ల జోలికి ఆయా ప్రభుత్వ విభాగాల అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.
ఇవన్నీ కాదంటూ బార్ లైనసెన్స్ ఫీజులు పెంచడం వలన తాము వ్యాపారాన్ని నడపలేమంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి బార్లను మూసేస్తామని హెచ్చరించింది. గతంలో రూ. 40 లక్షలుగా ఉన్న లైసెన్స్ ఫీజును ప్రస్తుతం రూ. 44 లక్షలకు పెంచి భారం మోపుతున్నారని మండిపడింది. ప్రివిలేజ్ సెస్‌ను స్లాబ్ పద్ధతిలో 8 శాతం నుంచి 20 శాతానికి పెంచారంటోంది. దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసింది.లేకపోతే నిరవధిక సమ్మె చేపడతామంటోంది. కానీ బార్ యజమానులు రోజు వచ్చే ఆదాయాన్ని ఒదులుకొని ఈ ధర్నాకు దిగుతారా లేదా అనేది చూడాలి.