Bhukya Yashwanth Summits Nagalands Highest Peak: ప్రముఖ పర్వతారోహకుడైన భూక్యా యశ్వంత్ అరుదైన గుర్తింపు పొందారు. మహబూబాబాద్ జిల్లాలోని భూక్యా తండాకు చెందిన ఈయన, 'హర్ శిఖర్ పర్ తిరంగా' సెవెన్ సిస్టర్స్ మిషన్ లో భాగంగా నాగాలాండ్ లోని అత్యంత ఎత్తైన సారామతి పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించి అరుదైన రికార్డు సాధించారు. భారత దేశంలోని 28 రాష్ట్రాల్లోని అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహించడమే ఆయన లక్ష్యం. ఈ క్రమంలో ఆయన ఇప్పటికే అనేక శిఖరాలను అధిరోహించారు.
ఈ నాగాలాండ్ యాత్ర పర్వత ప్రవేశ ద్వారమైన తానా మీర్ వైపు నుండి ప్రారంభమైంది. ఇది అత్యంత సుదీర్ఘ ప్రయాణం. మొత్తం మూడు రోజులు పట్టింది. అయినా కానీ యశ్వంత్ పట్టు వదల్లేదు. నిటారుగా, జారుడుగా ఉండే మార్గాల్లో ఎంతో శ్రమించి ఆయన ఈ పర్వతారోహణ చేశారు. సుమారు మూడు రోజుల పాటు కొనసాగిన ఈ యాత్రలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఈ మార్గంలో దట్టమైన అడవులు, లోయలు, ప్రకృతి దృశ్యాలు ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి.
పర్వతారోహణలో భాగంగా జారుడుగా ఉండే ప్రాంతాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అక్కడ సమయస్ఫూర్తి, శారీరక దృఢత్వం చాలా అవసరం. ఈ నెల సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం యశ్వంత్ విజయవంతంగా సారామతి శిఖరాన్ని చేరుకున్నారు. అక్కడ భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, సెవెన్ సిస్టర్స్ యాత్రలో భాగంగా నాగాలాండ్ లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఈ యాత్రకు నిరంతరం ప్రోత్సహించి, మార్గదర్శకత్వం వహించిన అసోం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్ వికాస్ లఖేరా, AVSM, SM గారికి యశ్వంత్ ధన్యవాదాలు తెలిపారు.
మహబూబాబాద్ జిల్లాలోని ఒక చిన్న తండా నుండి వచ్చిన యశ్వంత్, తన పట్టుదలతో అనుకున్నది సాధించారు. క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఎలాంటి సవాళ్లనైనా అధిగమించవచ్చని ఆయన నిరూపించారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువత క్రీడలు, సాహస కృత్యాల ద్వారా కొత్త అవకాశాలను అన్వేషించాలని ఆయన కోరుకుంటున్నారు.
తన ప్రయాణం గురించి యశ్వంత్ మాట్లాడుతూ.. "నా ప్రయాణం కేవలం శిఖరాలను చేరుకోవడం మాత్రమే కాదు, ప్రతి పర్వతం నాకు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పింది. కృషి చేయడానికి సిద్ధంగా ఉంటే సాధించలేనిది ఏదీ లేదు" అని అన్నారు. సరైన ధైర్యం, పట్టుదల ఉంటే ఎలాంటి పరిమితులను అయినా అధిగమించవచ్చని యువతకు చూపించడమే తన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
'హర్ శిఖర్ పర్ తిరంగా'..
'హర్ శిఖర్ పర్ తిరంగా' అంటే భారతదేశంలోని 28 రాష్ట్రాల్లోని అత్యున్నత శిఖరాలను అధిరోహించి, అక్కడ జాతీయ జెండాను పాతడం ద్వారా మన దేశంలోని విభిన్న పర్వతాలు, సంస్కృతుల ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటాలని యశ్వంత్ ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఇప్పటికే నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, రాజస్థాన్, అస్సాం, ఒడిశా, గోవా వంటి రాష్ట్రాల శిఖరాలను అధిరోహించారు.
అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని అర్మకొండ, ఒడిశాలోని దేవమాలి, గోవాలోని సాంసోగర్, రాజస్థాన్ లోని గురు శిఖర్లను కూడా అధిరోహించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మౌంట్ రియో పుర్గ్యిల్, లడక్‌లోని కాంగ్ యట్సే II, రష్యాలోని మౌంట్ ఎల్‌బ్రస్, టాంజానియాలోని మౌంట్ కిలిమంజారో వంటి ప్రపంచ ప్రసిద్ధ శిఖరాలను కూడా ఆయన అధిరోహించిన ఘనత ఉంది.