New Education Policy: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యను రద్దుచేసి పాఠశాల విద్యలో విలీనం చేయబోతున్నారు. సీనియర్ సెకండరీ విద్యావిధానాన్ని 2027-2028 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న ఇంటర్మీడియట్ విద్యా మండలి స్థానంలో 11, 12 తరగతులను సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ పరిధిలోకి తీసుకువస్తారు. 9వ తరగతి నుంచే విద్యార్థులకు ఆధునిక కాలపు అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సబ్జెక్టులు , నైపుణ్య శిక్షణ అందించబోతున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
తెలంగాణ విద్యాకమిషన్ నివేదికతో విద్య సంస్కరణలు..
జాతీయ విద్యావిధానంలో భాగంగా మెజారిటీ రాష్ట్రాల్లో అమలుచేస్తున్న సీనియర్ సెకండరీ విద్య విధానం అమలు చేసేందుకు కసరత్తు చేయాలని భావిస్తున్నారు. ఆకునూరి మురళి ఆధ్వర్యంలో తెలంగాణ విద్య కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా విద్య సంస్కరణలు అమలు చేయబోతున్నారు. పబ్లిక్ పరీక్షల పేరుతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడం, కార్పొరేట్ కాలేజీల ఏకస్వామ్యాన్ని నియంత్రించడం ప్రధాన ఉద్దేశంగా విద్య సంస్కరణలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాత విద్యా విధానంలో ఉన్న ప్రత్యేక ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీల వ్యవస్థను రద్దు చేసి, పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయనున్నారు. జాతీయ బోర్డులైన CBSE, ICSE తరహాలో విద్యార్థులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ మార్పులు చేస్తున్నారు.
కొత్తగా విద్యా సంస్కరణలను అమలుచేయాల్సిన ప్రభుత్వం ముందస్తుగా విద్యావంతులు, మేధావులు, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలతో చర్చించి సముచిత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు వ్యవస్థను రద్దు చేయడంపై విద్యావేత్తలు, తెలంగాణ విద్యా కమిషన్, ఉద్యోగ సంఘాల మధ్య భిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో కొత్త విద్యా విధానం తెలంగాణ విద్యా ప్రమాణాలను జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఎంతో దోహదపడుతుంది. అయితే, దీనిని క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో బడ్జెట్ కేటాయింపులు, ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేయాల్సి ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
డ్రాపౌట్స్ తగ్గించేందుకు ప్రభుత్వ చర్యలు..
పదోతరగతిలో పబ్లిక్ పరీక్షలు, ఆ తర్వాత ఇంటర్మీడియట్ లో పబ్లిక్ పరీక్షలతో విద్యార్థులు చాలా మంది ఉన్నత విద్యకు దూరమవుతున్నారని తెలంగాణ విద్య కమిషన్ ప్రతినిధుల బృందం అభిప్రాయపడింది. డ్రాపౌట్ల సంఖ్యనానాటికీ పెరిగిపోతోందని, చదువు కొనసాగించకుండా విద్యార్థులు రోడ్డుపాలవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో ఈ సమస్యను అధిగమించాలంటే.. పదోతరగతి, ఇంటర్మీడియట్ కోర్సులను రద్దుచేయడమే ఉత్తమ మార్గమని విద్యాకమిషన్ నివేదిక సూచించింది.
పదో తరగతి పూర్తయిన తర్వాత వేరే జూనియర్ కాలేజీలకు వెళ్లాల్సి రావడంతో గ్రామీణ, పేద విద్యార్థులు మధ్యలోనే చదువు మానేస్తున్నారని, పాఠశాలల్లోనే 11, 12 తరగతులు ఉండటం వల్ల డ్రాపౌట్లు గణనీయంగా తగ్గుతాయని తెలంగాణ విద్యా కమిషన్ అభిప్రాయపడింది. తెలంగాణ వ్యాప్తంగా డ్రాపౌట్ల సంఖ్యను తగ్గించేందుకు ఇంటర్మీడియట్ విద్యను రద్దుచేసి పాఠశాల విద్యలో విలీనం చేయాలని విద్యాకమిషన్ సూచనతో సంస్కరణలు చేపట్టారు. పాఠశాల విద్యావిధానాన్ని మూడు రకాలుగా విభజించి అమలుచేసే ప్రతిపాదన కార్యాచరణకు నోచుకోబోతోంది.
9 నుంచి 12వ తరగతి వరకు సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్..
పాఠశాల విద్యను మూడు దశలుగా పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించింది. ఈ కొత్త విధానం ప్రకారం నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు ప్రైమరీ ఎడ్యుకేషన్, 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు సెకండరీ ఎడ్యుకేషన్, 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ గా పరిగణిస్తారు. జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్పు. దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు, CBSE , ICSE బోర్డుల తరహాలోనే తెలంగాణలో కూడా 9 నుంచి 12వ తరగతి వరకు సీనియర్ సెకండరీ విద్యగా ఒకే గొడుగు కిందకు తీసుకురావడం వల్ల నాణ్యత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 12వ తరగతి పూర్తికాగానే విద్యార్థులకు ఉన్నత విద్యతో పాటు ఉపాధి అవకాశాలు దక్కేలా స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను అనుసంధానం చేయవచ్చని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తంచేశారు.
వచ్చే విద్యాసంవత్సరంలో పాఠశాల విద్యా విధానం..
నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక విద్యలో అక్షరాస్యత పునాది వేసి, సంఖ్యా జ్ఞానం , బాల్య దశ విద్యపై ప్రత్యేక దృష్టి పెడతారు. 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రాథమిక విద్య తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్ లో విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలను పెంపొందించే మధ్యంతర దశగా ఇది పనిచేస్తుంది. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రస్తుత ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్లను 11, 12 తరగతులుగా మారుస్తారు. సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ కింద ఉన్నత విద్యకు అవసరమైన స్పెషలైజ్డ్ కోర్సులు, నైపుణ్య శిక్షణ అందిస్తారు. దీనివల్ల పదో తరగతి తర్వాత విద్యార్థులు వేర్వేరు కాలేజీలలో అడ్మిషన్ల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం తప్పుతుంది.
ప్రభుత్వ నిర్ణయంపై లెక్చరర్ల సంఘం వ్యతిరేకత..
తెలంగాణలో అమలు చేయాలనుకున్న విద్య సంస్కరణపై ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపక సంఘాల జేఏసీ, గెజిటెడ్ లెక్చరర్ల సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ అధికార యంత్రాంగం విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, అధ్యాపక సంఘాలతో ఎలాంటి చర్చలు జరపకుండా, పూర్తిస్థాయి కసరత్తు లేకుండానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి విమర్శించారు. ఇంటర్మీడియట్ ప్రత్యేక వ్యవస్థగా ఉండటం వల్ల JEE , NEET వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారననే అభిప్రాయం వ్యక్తంచేశారు. పాఠశాల విద్యలో విలీనం చేస్తే ఆ ప్రత్యేకత దెబ్బతింటుందని లెక్చరర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 11, 12 తరగతుల బోధనకు సరిపడా ల్యాబ్‌లు, తరగతి గదులు లేవని సంఘాలు పేర్కొంటున్నాయి. అలాగే జూనియర్ లెక్చరర్లు, స్కూల్ అసిస్టెంట్ల మధ్య పదోన్నతులు, సీనియారిటీ వంటి పరిపాలనాపరమైన చిక్కులు ఎదురవుతాయని లెక్చరర్ల సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
కార్పోరేట్ కాలేజీల ఫీజుల దోపిడికి కట్టడి..
ప్రస్తుతం 10వ తరగతి పూర్తి కాగానే జూనియర్ కాలేజీలలో అడ్మిషన్ల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త విధానంతో ఒకే పాఠశాలలో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు చదువుకునే అవకాశం లభిస్తుంది.ఇంటర్మీడియట్ పేరుతో సాగే కార్పొరేట్ కాలేజీల ఫీజుల దోపిడీ, విద్యార్థులపై ఉండే తీవ్రమైన మానసిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. పాఠశాల వాతావరణంలో ఆటపాటలు, క్రీడలతో కూడిన సమగ్ర విద్య అందుతుంది. జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సిలబస్. CBSE, ICSE బోర్డుల తరహాలో రాష్ట్ర సిలబస్ మారడం వల్ల పోటీ పరీక్షలకు JEE, NEET, CUET విద్యార్థులు మరింత సులభంగా సిద్ధమవుతారు. 9వ తరగతి నుంచే స్పెషలైజ్డ్ సబ్జెక్టులు మరియు వృత్తి విద్యా కోర్సులు ఉండటం వల్ల విద్యార్థులకు తమ ఆసక్తికి తగిన రంగాన్ని ఎంచుకునే వెసులుబాటు కలుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో 10వ తరగతి తర్వాత కాలేజీలు దూరంగా ఉన్నాయనే కారణంతో చదువు మానేసే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది.
ఉపాధ్యాయుల సర్దుబాటు, విద్యా అర్హతలను బట్టి ప్రస్తుత పాఠశాల ఉపాధ్యాయులు 11, 12 తరగతులకు బోధించడానికి అర్హతలు, శిక్షణ సరిపోకపోవచ్చు. జూనియర్ లెక్చరర్ల సర్వీసు నిబంధనలను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయడం న్యాయపరమైన, పరిపాలనా పరమైన చిక్కులకు దారితీసే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రైవేట్ జూనియర్ కాలేజీల మనుగడ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే నిర్వహించే వందలాది ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. కొత్త నిబంధనల ప్రకారం అవి 1 నుంచి 10 తరగతులను ప్రారంభించాలి లేదా ఆ విద్య సంస్థలను మూసివేసే పరిస్థితులు తలెత్తుతాయి. దీనివల్ల వేలాది మంది ప్రైవేట్ లెక్చరర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. సిలబస్ మార్పుతో గందరగోళ పరిస్థితి తలెత్తబోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక్కసారిగా పరీక్షా విధానం, పాఠ్యపుస్తకాలు మార్చడం వల్ల 2027-28 బ్యాచ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు కొత్త విధానానికి అలవాటు పడటానికి ఇబ్బందిపడుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
(రచయత.. మునిరాజ్ జీ న్యూస్ డెస్క్ సౌజన్యంతో.. )