Polytechnic students: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను కార్మిక శాఖ పరిధిలోకి మారుస్తూ తీసుకున్న ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఉపసంహరించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, అధ్యాపకుల నుంచి తీవ్ర వ్యతిరేకత.. నిరసనలు వ్యక్తమవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గింది. ఈ మేరకు గతంలో జారీ చేసిన జీవో 97ను సవరిస్తూ తాజాగా జీవో 157ను విడుదల చేసింది. పాలిటెక్నిక్ కళాశాలలన్నీ ఇకపై కూడా యథావిధిగా ఉన్నత విద్యాశాఖ పరిధిలోనే కొనసాగుతాయని ప్రభుత్వం తన తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
పాలిటెక్నిక్ కాలేజీలతోపాటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కూడా ఉన్నత విద్యాశాఖ పరిపాలనా నియంత్రణలోనే పనిచేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు.. తన విద్య కార్యక్రమాలను విస్తరించుకునేందుకు ఏఐసీటీఈ, ఇతర సమర్థ అధికార సంస్థల నుంచి అవసరమైన అనుమతులు పొందాలని యూనివర్సిటినీ ప్రభుత్వం ఆదేశించింది.
ఇక మరోవైపు ఐటీఐలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు మాత్రం కార్మిక శాఖ పరిధిలోనే కొనసాగుతాయి. అయితే వీటి పాఠ్య ప్రణాళికను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నియంత్రిస్తుందని జీవోలో ప్రభుత్వం పేర్కొంది.
అంతకుముందు జారీ చేసిన జీవో 97 ద్వారా అప్పటి కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ పేరును ‘శక్తి’గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీని కింద ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు, ఐటీఐలు, ఏటీసీలను శక్తి విభాగం పరిధిలోకి తెచ్చి, పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానం చేయాలని నిర్ణయించింది.
కేశవరావు కమిటీ సిఫార్సులతో ముగిసిన ఉత్కంఠ:
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తమ మూడేళ్ల డిప్లొమా కోర్సు విలువ తగ్గిపోతుందని, అలాగే ఈసెట్ (ECET) ద్వారా ఇంజినీరింగ్‌లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు ఆటంకాలు ఏర్పడతాయని పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపకులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో వారు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నెల రోజులకు పైగా నిరసనలు చేపట్టారు.
విద్యార్థుల ఆందోళనలపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం, ఈ సమస్య పరిష్కారానికి సీనియర్ నేత కె. కేశవరావు నేతృత్వంలో ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. తాజాగా ఆ కమిటీ అందించిన సిఫార్సుల మేరకు, పాలిటెక్నిక్ కాలేజీలను యథావిధిగా విద్యాశాఖ పరిధిలోనే కొనసాగిస్తూ ప్రభుత్వం జీవో 157 జారీ చేసింది. దీంతో నెల రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడటంతో విద్యార్థులు, అధ్యాపకులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: