టీచర్ల విశ్వసనీయతకే సవాల్.. ఎక్స్‌టర్నల్ వాల్యుయేషన్ తో విద్యార్థులపై మళ్లీ పాతకాలపు ఒత్తిడి..!!
External Valuation in School Education Telangana: రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ (RTE) స్ఫూర్తితో అమల్లోకి వచ్చిన కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ (CCE) విధానం ప్రస్తుతం తన అసలు ఉద్దేశాన్ని కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది.
External Valuation in School Education Telangana: రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ (RTE) స్ఫూర్తితో అమల్లోకి వచ్చిన కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ (CCE) విధానం ప్రస్తుతం తన అసలు ఉద్దేశాన్ని కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని, పరీక్షల పేరుతో వారిపై మానసిక ఒత్తిడి పెరగకుండా ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. అయితే పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ నుంచి ఎవరితోనూ చర్చించకుండా తీసుకున్న నిర్ణయాలు విద్యావేత్తల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా సమ్మేటివ్ అసెస్‌మెంట్ (SA-1, SA-2) పరీక్షలకు కొత్తగా ఎక్స్‌టర్నల్ ఎవాల్యుయేషన్ విధానాన్ని తీసుకురావడం CCE ప్రాథమిక లక్ష్యాలపై ప్రభావం చూపే అంశంగా మారింది.
ఉపాధ్యాయుల విశ్వసనీయతపై సందేహాలా?
తరగతి గదిలో విద్యార్థులతో నిరంతరం గడిపే ఉపాధ్యాయుడికే వారి అభ్యసన సామర్థ్యాలు, వ్యక్తిగత లోటుపాట్లపై స్పష్టమైన అవగాహన ఉంటుంది. విద్యార్థుల పురోగతిని ఎప్పటికప్పుడు గమనిస్తూ.. అవసరమైన చోట అదనపు సహాయం అందించడమే కంటిన్యూయస్ ఎవాల్యుయేషన్‌లోని ప్రధాన ఉద్దేశం. అలాంటి పరిస్థితుల్లో సొంత పాఠశాల ఉపాధ్యాయులతో కాకుండా బయటి వ్యక్తులతో ఎక్స్‌టర్నల్ ఎవాల్యుయేషన్ నిర్వహించడం ఉపాధ్యాయులపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యగా విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీని వల్ల విద్యార్థుల్లో గతంలో ఉన్న పరీక్షల భయం తిరిగి పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులను ఫెయిల్ చేయకూడదనే నిబంధన అమల్లో ఉన్నప్పుడు, ఎక్స్‌టర్నల్ ఎవాల్యుయేషన్ పేరుతో ఇంతటి ప్రక్రియ అవసరమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఈ విధానం వల్ల సుమారు రూ.10 కోట్ల వరకు ప్రజాధనం ఖర్చయ్యే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం ఉపాధ్యాయులు వెచ్చించాల్సిన బోధనా సమయం కూడా తగ్గిపోతుందనే అభిప్రాయాలు ఉన్నాయి.
అధికారుల ఏకపక్ష నిర్ణయాలకు ఎంతవరకు అవకాశం?
పాలసీ డెసిషన్స్ తీసుకోవడం సాధారణంగా ప్రభుత్వ పరిధిలోని అంశం. ప్రభుత్వం ఆమోదించిన CCE వంటి విద్యా విధానంలో కీలకమైన మార్పులు చేయాలంటే సంబంధిత ఉన్నతస్థాయి ఆమోదాలు అవసరమనే వాదన ఉంది. అయితే ఒక విధానాన్ని అమలు చేసే బాధ్యత ఉన్న అధికారులే దాని మౌలిక స్వరూపంలో గణనీయమైన మార్పులు చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విధానాన్ని అమలు చేయడం ఒక అంశమైతే, దాని ప్రాథమిక నిర్మాణాన్ని మార్చడం మరో అంశమని విద్యావేత్తలు చెబుతున్నారు. విద్యా విధానాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు హడావుడిగా కాకుండా అన్ని వర్గాలతో చర్చించిన తర్వాత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాల్లో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఎక్స్‌టర్నల్ ఎవాల్యుయేషన్‌పై పునరాలోచన అవసరం:
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డైరెక్టరేట్ తీసుకున్న ఎక్స్‌టర్నల్ ఎవాల్యుయేషన్ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. CCE విధానం అసలు లక్ష్యాలను కోల్పోకుండా దాని ఉద్దేశాలను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని విద్యా రంగానికి చెందిన పలువురు కోరుతున్నారు.విద్యా విధానాల్లో మార్పులు అవసరమని ప్రభుత్వం భావిస్తే, ముందుగా విద్యావేత్తలు, విద్యా నిపుణులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయవచ్చు. ఆ కమిటీ సిఫార్సులను పరిశీలించిన తర్వాత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల ప్రతినిధులు వంటి స్టేక్‌హోల్డర్లతో విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉంది.