దసరా సెలవులపై ఉపాధ్యాయులకు విద్యాశాఖ కీలక హెచ్చరిక.. ఆ 2 రోజులు డుమ్మా కొడితే 13 రోజులూ లీవ్ పడినట్లే..!!
Telangana Teachers Dasara Holidays: తెలంగాణలో అక్టోబర్ 10వ తేదీ నుంచి పాఠశాలలకు దసరా పండగ సెలవులు రాబోతున్నాయి. అక్టోబర్ 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మొత్తం 13 రోజులు ప్రభుత్వం అధికారికంగా ఈ సెలవులను ప్రకటించింది.
Telangana Teachers Dasara Holidays: తెలంగాణలో అక్టోబర్ 10వ తేదీ నుంచి పాఠశాలలకు దసరా పండగ సెలవులు రాబోతున్నాయి. అక్టోబర్ 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మొత్తం 13 రోజులు ప్రభుత్వం అధికారికంగా ఈ సెలవులను ప్రకటించింది. అయితే ఈ 13 రోజుల దసరా సెలవుల వినియోగం విషయంలో టీచర్లు పాటించాల్సిన సెలవుల నిబంధనలను గుర్తు చేస్తూ పాఠశాల విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలను విస్మరించినట్లయితే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కొవల్సి వస్తుందని అధికారులు హోచ్చరించారు.
ప్రభుత్వ సెలవుల నియమావళి ప్రకారం.. స్కూల్లకు ఇచ్చే సుదీర్ఘమైన వెకేషన్ సెలవులు ప్రారంభం అయ్యే ముందు రోజు.. అలాగే సెలవులు ముగిసిన పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే మొదటి రోజున టీచర్లు విధుల్లో ఉండటం అనివార్యం.
విద్యాశాఖ విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం:
సెలవులకు ముందు రోజు (మొదటి పనిదినం): అక్టోబర్ 09
సెలవుల అనంతరం (పాఠశాలల పునఃప్రారంభ రోజు): అక్టోబర్ 23
ఒకవేళ ఏ ఉపాధ్యాయుడైనా సరే ముందస్తు అనుమతి లేకుండా లేదా అనధికారికంగా అక్టోబర్ 09న గానీ లేదా పండుగ సెలవులు పూర్తయిన తర్వాత పాఠశాల తెరిచే అక్టోబర్ 23న గానీ విధులకు గైర్హాజరైతే లీవ్ నిబంధనల ప్రకారం తీవ్ర చర్యలు ఉంటాయి. అలా గైర్హాజరైన పక్షంలో.. మధ్యలో ఉన్న మొత్తం 13 రోజుల దసరా సెలవుల కాలాన్ని కూడా విధి గైర్హాజరు (Unauthorized Absence) లేదా సొంత సెలవు (Casual Leave / Loss of Pay) కిందకే పరిగణిస్తారు. దీనివల్ల సదరు ఉపాధ్యాయుల సెలవుల ఖాతా నుంచి ఏకంగా 13 రోజులు కోల్పోవడమో లేదా జీతంలో కోత పడటమో జరుగుతుందని విద్యాశాఖ స్పష్టం చేసింది.
దసరా సెలవులకు ముందూ, వెనుకా వచ్చే అక్టోబర్ 9.. అక్టోబర్ 23వ తేదీలలో ఉపాధ్యాయులందరూ విధిగా పాఠశాలలకు హాజరై ఎఫ్‌ఆర్‌ఎస్ లేదా బయోమెట్రిక్ హాజరును నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్పనిసరిగా ముందస్తుగానే ఉన్నతాధికారుల నుండి సరైన అనుమతితో లీవ్ మంజూరు చేయించుకోవాలని.. లేనిపక్షంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు.