Uttam Kumar Reddy: సాగర్‌పై ఏపీ చేపట్టిన ప్రాజెక్టును తీవ్ర అభ్యంతరం చెప్పాం: మంత్రి ఉత్తమ్ ప్రకటన
Uttam Kumar Reddy Announces We Objects AP Project On Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ప్రాజెక్టు అవతల నిర్మిస్తున్న ప్రాజెక్టు పనులపై తీవ్ర అభ్యంతరం చెప్పినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ నీటి ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో పూర్తి వాటా కోసం పోరాడుతున్నట్లు చెప్పుకొచ్చారు.
Nagarjuna Sagar: కృష్ణా, గోదావరి నది జలాలపై ప్రతి చుక్క కోసం పోరాటం చేస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడివైపు ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న పనులపై అభ్యంతరం తెలిపామని.. తెలంగాణ నీటి ప్రయోజనాలపై రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టే ప్రాజెక్టులను వ్యతిరేకిస్తామని తెలిపారు. కృష్ణా జలాల్లో 550 టీఎంసీలు కావాలని పోరాడుతున్నామని చెప్పారు.
'పదేళ్లలో ఏపీ 4,466 టీఎంసీలు, తెలంగాణ 1,993 టీఎంసీలు వాడుకుంది. ఈ ఏడాది అక్టోబర్ 30వ తేదీ వరకు కృష్ణా నదిలో వినియోగించుకున్నది. ఆంధ్రప్రదేశ్ 98.16 టీఎంసీలు, తెలంగాణ 122.74 టీఎంసీలు వినియోగించుకుంది' అని సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. 'పోతిరెడ్డి పాడు సామర్థ్యం 80 వేల క్యూసెక్కులకు పెంచుకున్నారు. పాలమూరు- రంగారెడ్డి జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి వివాదాలకు తెరలేపారు. పాలమూరు- రంగారెడ్డిలో ఒక్క ఎకరం కూడా ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేదు. కృష్ణా, గోదావరిలో ఒక్క చుక్క నీటిని కూడా ఒదులుకోం' మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎందుకు కక్ష సాధింపు అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
'మేము వచ్చాక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపించాం. ఏపీ పనుల గురించి తెలియగానే కేఆర్‌ఎంబీలో అభ్యంతరం తెలిపాం. అక్కడి నుంచి ఒక్క చుక్కను కూడా పోనివ్వం' అని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. కాళేశ్వరానికి సమానంగా కృష్ణా ప్రాజెక్టులకు ఎందుకు నిధులివ్వలేదు. పాలమూరు-రంగారెడ్డి పూర్తి చేస్తే 10 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి' అని తెలిపారు. ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ వచ్చినా.. ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, డిండి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులు పెండింగ్‌లోనే ఉన్నాయని వెల్లడించారు. ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలకు నీళ్లు వచ్చేవని పేర్కొన్నారు.
'సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదు. ఆత్మకథలో లేకున్నా సోనియా గుండెల్లో తెలంగాణ ఉంది' మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు కట్టించింది కాంగ్రెస్సేనని.. తాను సైన్యంలో పనిచేశానని.. దేశం, సమాజం ప్రజలపై చిత్తశుద్ధితో ఉంటామని ప్రకటించారు. 'కృష్ణా నీటి అత్యధిక వినియోగం మా ప్రభుత్వంలోనే జరిగింది. రూ.90 వేల కోట్ల విలువైన వరి పంట కొనుగోలు చేశాం. మేము క్రాప్ హాలిడే ఎక్కడా ప్రకటించలేదు' మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. నీటి ఎద్దడి కారణంగా వరి పంట వేయొద్దని మాత్రమే చెప్పామని వివరణ ఇచ్చారు. ఆరుతడి పంటలు వేయాలని రైతులకు సూచించామని తెలిపారు.