పెళ్లికి పిలవకపోయినా భోజనాలకు వెళ్తున్నారా? ఇక జైలుకే.. తెలంగాణలో వైరల్ అవుతున్న బోర్డు!
Viral Wedding Board: పెళ్లిల సీజన్ ప్రారంభమైంది.. దీంతో కొన్ని ఫంక్షన్ హాల్స్ ముందు ప్రత్యేకమైన బోర్డులు దర్శనమిచ్చాయి. ముఖ్యంగా పిలవని పేరంటానికి రావద్దంటూ ఫ్లెక్సీలు బోర్డులు వెలిసాయి.. ఒకవేళ వస్తే చట్టపరమైన చర్యలు తప్పవని క్లుప్తంగా పేర్కొన్నారు. ఇటీవల దీనికి సంబంధించిన ఒక బోర్డు విపరీతంగా వైరల్ అవుతుంది..
Viral Wedding Board: తెలంగాణలో పెళ్లిళ్ల సీజన్ మొదలైన నేపథ్యంలో శుభకార్యాల సందడి మొదలయ్యింది.. అయితే ఈ వేడుకల సమయంలో ఆహ్వానం లేకపోయినప్పటికీ భోజనాల కోసం ఫంక్షన్ హాల్ లోకి వెళ్లి తినేవారి బెడదను అరికట్టేందుకు నిర్వాహకులు కఠిన చర్యలకు దిగుతున్నారు.. తాజాగా హనుమకొండ లోని ఓ ఫంక్షన్ హాల్ ఎదుట ఏర్పాటు చేసిన నోట్ బోర్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ బోర్డులో ఏముంది? దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
శుభకార్యానికి సంబంధంలేని వ్యక్తులు లేదా ఆహ్వానం లేని వారు ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో పట్టుపడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆ బోర్డులో స్పష్టంగా రాశారు. ఓల్డ్ ఐపిసి సెక్షన్ 441 కింద అనుమతి లేకుండా ఇతరుల ఆస్తిలోకి ప్రవేశించిన నేరంపై మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా ఐదు వేల వరకు జరిమానా.. కొన్ని సందర్భాల్లో ఈ రెండు విధించే అవకాశం ఉందని నిర్వాహకులు హెచ్చరిస్తూ వస్తున్నారు..
సాధారణంగా పెళ్లిళ్లు.. ఇతర వేడుకల సమయంలో వధువు, వరుడు తరుపున బంధువుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.. ఇదే మంచి సమయంగా భావించి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆహ్వానం లేకపోయినప్పటికీ లోపలికి ప్రవేశించి భోజనాలు.. కొన్నిసార్లు విలువైన వస్తువులతో పాటు, బహుమతులను దొంగతనానికి పాల్పడడం వంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి.. దీనివల్ల అసలైన అతిథులకు భోజనం సరిపోక ఫంక్షన్ నిర్వాహకులు అనేక రకాల ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ తరహా సమస్యలకు చెక్ పెట్టేందుకు ఫంక్షన్ హాల్స్ యాజమాన్యం ముందస్తు జాగ్రత్తగా ఇలాంటి హెచ్చరిక ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు..
ఫంక్షన్ హాల్ ల వద్ద ఇలాంటి కఠిన హెచ్చరిక బోర్డులు కనిపించడం ఇదే మొదటిసారి కాదు.. గత మార్చి నెలలో జరిగిన పెళ్లిళ్ల సీజన్లోనూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇదే తరహా ఫ్లెక్సీలు వెలసి సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీ అంశానికి దారి తీసిన సంగతి అందరికీ తెలిసిందే. సరదాగా ఫ్రీ ఫుడ్ కోసం వెళ్లే వారికి చట్టపరమైన చిక్కులు ఎదురవుతాయని ఈ బోర్డ్ స్పష్టం చేస్తుంది. దీనిపై నేటిజన్లు భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కొందరు నిర్వాహకుల నిర్ణయాన్ని సమర్థిస్తూ ఉండగా.. మరికొందరు సరదాగా కామెంట్లు పెడుతూ ఈ పోస్టులను షేర్ చేస్తూ వస్తున్నారు..