హైదరాబాద్ బిర్యానీ తింటున్నారా.. ఏకంగా నరకానికి టికెట్ కన్ఫామ్..
Hyderabad Food Adulteration: మీరు బిర్యానీ ప్రియులా? హైదరాబాద్ ఫేమస్ హోటళ్లలో ఫుడ్ లాగించేస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి.. మీరు ఆశగా తింటున్న ఆ ఆహారం.. మీ ప్రాణాలకే ప్రమాదంగా మారుతోంది. గత నెలలోనే 11 హోటల్స్‌లను సీజ్ చేసిన అధికారులు కొన్ని హోటల్స్‌ను తనిఖి చేయడంతో భయంకర నిజాలు బయట పడ్డాయి.
Hotels Adulteration: మీ చేతి మాత్ర.. వైకుంఠ యాత్ర అన్నట్టుగా ఉంది హైదరాబాద్‌లోని కొన్ని రెస్టారెంట్ల పరిస్థితి. పైనా హంగు ఆర్భాటాలు.. లోపల మాత్రం వెగటు, కుళ్లిన అపరిశుభ్ర వాతావరణం. హైదరాబాద్ ఫేమస్ హోటళ్లలో 'TG SAFE' అధికారులు నిర్వహించిన మెరుపు దాడులు ఇప్పుడు ప్రజల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న కొన్ని రెస్టారెంట్ల గుట్టు రట్టయింది. ఏకంగా 22 ప్రముఖ హోటళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టిన అధికారులు.. అక్కడ ఉన్న అపరిశుభ్రతను చూసి అవాక్కవ్వడం వీరి వంతు అయింది.
నగరంలో బ్రాండెడ్ హోటళ్లుగా చలామణీ అవుతున్న 14 హోటళ్ల లైసెన్సులను అధికారులు అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. ఈ లిస్టులో సామాన్య హోటళ్లే కాదు.. ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న తాజ్ ఫలక్‌నుమా, నగరంలో ఫేమస్ అయిన పిస్తా హౌస్ సహా 8 అగ్రశ్రేణి సంస్థలకు అధికారులు అక్కడ కిచెన్ పరిసరాలు చూసి షాకింగ్ కు గురయ్యారు. అంతేకాదు ఆయా హోటల్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ముఖ్యంగా అధికారులు చేపట్టిన తనిఖిల్లోని అన్ని హోటళ్లలోని వంటశాలల్లో బొద్దింకలు, ఈగలు, ఎలుకల బెడద యథేచ్ఛగా సాగుతోంది. ఎక్కడ చూసినా పేరుకుపోయిన అపరిశుభ్రత కనిపిస్తోంది. అధికారులు ఈ దాడుల్లో ఏకంగా 544 కిలోల కుళ్లిన కూరగాయలు, పాడైన ఆహారం, గడువు ముగిసిన నిల్వ పదార్థాలను స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. విషతుల్యంగా మారిన, పదేపదే వాడిన 13 కిలోల వంట నూనెను మురికి కాలువల్లో పారబోశారు.
వెజ్, నాన్-వెజ్ పదార్థాలను విడివిడిగా ఉంచాలనే కనీస నియమం లేకుండా.. అన్నింటినీ ఒకే ఫ్రిజ్‌లో కుక్కేసి ఉంచారు. ఇక సిద్ధిఖీ కిచెన్ లోనైతే పిల్లులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ఆహార పదార్థాల పక్కనే చెప్పులు, చీపుర్లు పడేసి ఉంచిన దారుణమైన దృశ్యాలు కనిపించాయి. అజీబో రెస్టారెంట్‌లో ప్రజలు తాగే నీటి ట్యాంకులోనే బొద్దింకలు ఈత కొడుతుండగా.. వండే కూరగాయల్లో ఫంగస్ పేరుకుపోయి దర్శనమిచ్చింది. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే ఎంతటి వారినైనా సరే ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.