SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Auto Charges Hike: ఆటో ఛార్జీల పెంపుపై కార్మికుల ఆగ్రహం.. 3 రోజుల నిరసనలు

Auto Workers Association Condemns And Called Three Days Protest In Telangana: ప్రయాణికులపై మోపలేని భారం విధిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆటో కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంపై ఆటో కార్మిక సంఘాలు ఖండిస్తున్నాయి. ఆటో ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా మూడు రోజుల నిరసనలకు పిలుపునిచ్చారు.

Written By Ravi Kumar Sargam
Published: Oct 02, 2026, 11:41 PM IST | Updated: Oct 02, 2026, 11:45 PM IST
Image Credit: Auto Charges Hike
Join

Auto Workers Association: ప్రజా రవాణాలో కీలక భాగమైన ఆటోల ఛార్జీలు పెంచుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనూహ్యంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆటో కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమను సంప్రదించకుండా ఆకస్మికంగా ప్రకటించిన ఈ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నట్లు ఆటో కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఈ సందర్భంగా మూడు రోజుల పాటు నిరసనలు చేపడతామని ఆటో కార్మిక సంఘాలు ప్రకటన చేశాయి.

ఆటో మీటర్ ఛార్జీల విషయంలో ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్‌) ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో ఆటో మీటర్ ఛార్జీల విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని తాము ఖండిస్తున్నట్లు ప్రకటన చేసింది. ఆటో డ్రైవర్ల సమస్యలు, మీటర్ ఛార్జీల పెంపు తదితర అంశాలపై ఆటో సంఘాల నాయకులతో ప్రభుత్వం చర్చలు చేసిన అనంతరం తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆరోపించారు. కార్మికుల అభిప్రాయాలను బేఖాతరు చేయడం సమంజసం కాదని బీఎంఎస్‌ నాయకులు స్పష్టం చేశారు.

ఆటో డ్రైవర్లకు సంబంధించిన కీలకమైన ఛార్జీల విషయంలో సంఘాల ప్రతినిధులతో సమగ్రంగా చర్చించి.. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని బీఎంఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి గుర్తుచేశారు. అయితే దీనికి భిన్నంగా వ్యవహరించడంతో రాష్ట్రంలోని వేలాది మంది ఆటో డ్రైవర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొందని తెలిపారు. 'ప్రభుత్వం ప్రతిపాదించిన ఛార్జీల ప్రకారం మొదటి 1.6 కిలోమీటర్లకు రూ.30, ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ.14గా నిర్ణయించే అంశం ముందుకు వచ్చింది. ఈ రేట్లు ఆటో డ్రైవర్ల ప్రస్తుత జీవన వ్యయాలు, ఇంధనం, వాహన నిర్వహణ, బీమా, మరమ్మతులు తదితర ఖర్చులకు తగిన విధంగా లేవు' అని వెల్లడించారు.

ఆటో సంఘాల నాయకులను చర్చలకు పిలిచి వారి అభిప్రాయాలను తీసుకున్నట్లు చూపించి.. చివరకు వారి సమ్మతి లేకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాల్సిన రవాణా శాఖ, వారి జీవనోపాధికి సంబంధించిన కీలకమైన ఛార్జీల విషయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి' అని బీఎంఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి సూచించారు. ఆటో డ్రైవర్లకు న్యాయమైన మీటర్ ఛార్జీలను నిర్ణయించడంతో పాటు, ఆటో కార్మికుల సంక్షేమానికి సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం వెంటనే సంఘాలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఆటో డ్రైవర్ కనీస ఛార్జీగా రూ.50 వసూలు చేయాలని ఆటో డ్రైవర్లకు రవిశంకర్ అల్లూరి పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏకపక్ష ఆటో ఛార్జీల ఉత్తర్వులకు నిరసనగా రేపటి నుంచి మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిస్తూ ప్రకటన చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి, సమగ్ర చర్చలు చేయాలని బీఎంఎస్‌ ఆటో కార్మిక సంఘాల నాయకులు రవిశంకర్ అల్లూరి, సీహెచ్ నంద కిషోర్, బీ పెంటయ్య గౌడ్, కె. శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES