SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Tanuja Ranjan Ray Death: సంరక్షకురాలే హతురాలు.. మాజీ డీజీపీ భార్య హత్య కేసులో కీలక పురోగతి

Big Update In Former DGP Vinay Ranjan Ray Wife Death Case: తెలంగాణలో తీవ్ర సంచలనం రేపిన మాజీ డీజీపీ వినయ్‌ రంజన్‌ రే భార్య హత్య కేసులో కీలక పురోగతి వచ్చింది. సంరక్షకురాలిగా వచ్చిన మహిళనే హత్యకు పాల్పడిందని నిర్ధారించిన పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 19, 2026, 03:13 PM IST | Updated: Oct 19, 2026, 03:16 PM IST
Image Credit: Tanjuja Ray Death Case
Join

Tanuja Ranjan Case: తెలంగాణలో తీవ్ర సంచలనం రేపిన మాజీ డీజీపీ వినయ్‌ రంజన్‌ రే భార్య హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. సంరక్షకురాలిగా వచ్చిన మహిళే హంతకురాలు అని నిర్ధారించిన తెలంగాణ పోలీసులు ఎట్టకేలకు ఆమెను అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. కేర్‌ టేకర్‌ మాజీ డీజీపీ భార్యను కొంత మందితో కలిసి హత్యకు పాల్పడిందని గతంలో పోలీసులు నిర్ధారించారు. తాజాగా ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ ప్రశాసన్‌నగర్‌లో విశ్రాంత ఐపీఎస్‌ అధికారి వినయ్‌రంజన్‌రే భార్య తనూజ రంజన్‌ (60) హత్య కేసులో కీలక పురోగతి సాధించినట్లు పోలీసులు తెలిపారు. ఆరు నెలలుగా నిందితుల కోసం గాలిస్తున్న హైదరాబాద్‌ పోలీసులు తాజాగా ప్రధాన నిందితురాలు కల్పన ఆచూకీని గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక పోలీసు బృందాలు దేశంలోని పలు ప్రధాన నగరాలతో పాటు నేపాల్‌లోనూ నిఘా కొనసాగిస్తున్నాయి. కల్పనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంరక్షకురాలిగా వచ్చి..
రిటైర్డ్ ఐపీఎస్‌ అధికారి వినయ్‌ రంజన్‌ రే కుటుంబానికి పరిచయమైన నేపాల్‌కు చెందిన కల్పనను.. వృద్ధురాలైన తనూజ రంజన్‌ సంరక్షణ కోసం పనిలోకి తీసుకున్నారు. అయితే ఇంట్లోని నగదు, నగలను దోచుకోవాలనే పథకంలో భాగంగా నిందితులు ఆమెను ఉపయోగించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇంటి పరిస్థితులు, కుటుంబసభ్యుల కదలికలపై అవగాహన పెంచుకున్న నిందితులు అదును చూసి ఘాతుకానికి పాల్పడింది.

వినయ్‌రంజన్‌రే బెంగళూరుకు వెళ్లిన సమయంలో ఈ ఏడాది మే 7వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత తనూజ రంజన్‌పై దాడి జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ముఖంపై దిండు ఉంచి ఊపిరాడకుండా చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు కేసు దర్యాప్తు వివరాలు వెల్లడిస్తున్నాయి. అనంతరం ఇంట్లోని నగలను తీసుకుని నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

నేపాల్ లో గాలింపు
ఈ హత్య కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేయగా వారిలో సునీల్‌ బహదూర్‌ ఔజీ (29)పై నగర పోలీసులు పీడీ యాక్ట్‌ ప్రయోగించి జైలుకు తరలించారు. మరోవైపు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించిన కొందరు సిబ్బందికి పోలీసుల ఉన్నతాధికారులు ఛార్జి మెమోలు జారీ చేశారు. నేరానికి పాల్పడిన తర్వాత నేపాలీ ముఠా పోలీసులకు చిక్కకుండా బీహార్‌ సరిహద్దుల మీదుగా నేపాల్‌కు చేరుకున్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. కల్పన నేపాల్‌లో ఉన్నట్లు ఆధారాలు లభించడంతో ప్రత్యేక పోలీసు బృందాన్ని అక్కడికి పంపించారు. సుమారు రెండు నెలలుగా అక్కడే మకాం వేసిన బృందాలు ఆమె ఆచూకీని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతికూల వాతావరణం, స్థానిక పరిస్థితుల కారణంగా ఆమెను అదుపులోకి తీసుకోవడం సవాలుగా మారింది. కల్పన అరెస్టుపై అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో ఈ కేసులో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. ప్రధాన నిందితురాలిని పట్టుకుంటే హత్య వెనుక ఉన్న పూర్తి కుట్ర, ఇతరుల పాత్రపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES