SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

నాడు రాజీవ్ ప్రధాని కావడం ఇష్టం లేదు.. నేడు రాహుల్‌కు చేతకాదు: సోనియా గాంధీ బుక్‌పై ఎన్‌వీ సుభాష్ కామెంట్స్

NV Subhash on Sonia Gandhi Autobiography: సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ నవంబర్ 10న విడుదల కానున్న వేళ బీజేపీ తెలంగాణ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్ కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అప్పట్లో రాజీవ్ గాంధీ ప్రధాని కావడం సోనియాకు ఇష్టం లేదని, నేడు ఆ పీఠం అధిష్టించే సామర్థ్యం రాహుల్ గాంధీకి లేదని ఆయన విమర్శించారు.

Written By Ashok Krindinti
Published: Oct 28, 2026, 03:30 PM IST | Updated: Oct 28, 2026, 03:41 PM IST
Join

NV Subhash on Sonia Gandhi Autobiography: ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన ఆత్మకథ బుక్‌పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌ఛార్జ్ ఎన్‌వీ సుభాష్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ స్వయంగా రాసిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love) పుస్తకం నవంబర్ 10న విడుదల కానున్న నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఈ ఆత్మకథకు సంబంధించి విడుదల చేసిన ప్రమోషనల్ వీడియోలో.. రాజీవ్ గాంధీ ప్రధాని కావడం తనకు ఇష్టం లేదని సోనియా గాంధీ స్వయంగా అంగీకరించారని పేర్కొన్నారు. నాడు రాజీవ్ గాంధీ ప్రధాని కావడం సోనియాకు ఇష్టం లేదని.. నేడు ప్రధాని అయ్యే సామర్థ్యం, ప్రజల కోసం పనిచేయాలనే తపన రాహుల్ గాంధీకి లేవని విమర్శించారు. పనిచేసే ప్రధానులను పని చేసుకోనివ్వకుండా అడ్డుకోవడమే గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరి అని ఆయన ఆరోపించారు.

ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని వికసిత్ భారత్ దిశగా నడిపిస్తూ ప్రపంచంలో అగ్రగామిగా నిలబెడుతున్నారని ఎన్‌వీ సుభాష్ అన్నారు. మోదీకి లభిస్తున్న ప్రజాదరణను గాంధీ కుటుంబం జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. రాహుల్ గాంధీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలనే తాపత్రయంతో కాంగ్రెస్ పార్టీ దేశ ప్రయోజనాలను, గౌరవాన్ని తాకట్టు పెడుతోందని ఆరోపించారు. అధికారం కోసం కాంగ్రెస్ నేతలు రాజ్యాంగం పేరుతో నాటకాలు ఆడుతున్నారని, వారికి రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రధాని మోదీని ఎదుర్కోలేక ఈవీఎంలు, సర్, ఓట్ చోరీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

"ఈవీఎంలపై నిందలు వేసే కాంగ్రెస్ పార్టీకి తాజా కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చాయి. అక్కడ తమ ప్రభుత్వమే అధికారంలో ఉండి, పూర్తిగా బ్యాలెట్ బాక్స్ పద్ధతిలో ఎన్నికలు జరిగినా 4 స్థానాల్లోనూ కాంగ్రెస్ సున్నాకే పరిమితమై ఘోరంగా ఓడిపోయింది. ఒక్క కర్ణాటకలోనే కాదు.. ఇటీవల బీహార్, యూపీ, మహారాష్ట్రల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బ్యాలెట్ ఓటింగ్‌లో కాంగ్రెస్‌ను ప్రజలు పూర్తిగా తిరస్కరించి బీజేపీ కూటమికే పట్టం కట్టారు. బ్యాలెట్ పేపర్లతో జరిగే ఎన్నికల్లోనూ ప్రజలు వరుసగా తిరస్కరిస్తున్నా సిగ్గుపడకుండా.. తప్పుడు ప్రచారాలతో దేశంలో అస్థిరత సృష్టించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ప్రజలు రాబోయే రోజుల్లో శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టడం ఖాయం." అని ఆయన అన్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES