SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Sadar Utsav: సదర్‌ ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రమంతా నిర్వహిస్తాం: భట్టి విక్రమార్క

Deputy CM Bhatti Vikramarka Speech In Hyderabad Sadar Utsav: దీపావళి పర్వదినం సందర్భంగా యాదవ సామాజిక వర్గం చేసుకునే సదర్‌ పండుగను తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ‎సదర్ ఉత్సవాలు మరింత వైభవంగా జరగాలని ఆకాంక్షించారు. సదర్‌ ఉత్సవాల్లో భట్టి ప్రసంగం ఇలా ఉంది.

Written By Ravi Kumar Sargam
Published: Nov 04, 2026, 03:02 PM IST | Updated: Nov 04, 2026, 03:14 PM IST
Image Credit: Source: Bhatti Vikramarka X (Twitter)
Join

Hyderabad Sadar Utsav: యాదవ సామాజికవర్గం అత్యంత వైభవంగా చేసుకునే సదర్‌ పండుగను ఇకపై తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రతి ఏటా ఉత్సవాల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం అవుతుందని తెలిపారు. మరింత వైభవంగా సదర్‌ ఉత్సవాలు జరగాలని ఆకాంక్షించారు. ‎పశుసంపద అభివృద్ధితోనే వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని పేర్కొన్నారు. 
‎
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద ప్రభుత్వం ఆధ్వర్యంలో ‎సదర్ సమ్మేళనం నిర్వహించగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రసంగం చేశారు. '‎సదర్ ఉత్సవాలు ఏటా మరింత వైభవంగా.. దినదినాభివృద్ధి చెందాలి. ఈ ఉత్సవాల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుంది' అని తెలిపారు. ‎వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు పశుసంపద కీలకమని.. పశుసంపదను గౌరవించి, అభివృద్ధి చేసుకున్నప్పుడే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సదర్ ఉత్సవాలకు రాష్ట్ర పండుగ హోదా కల్పించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తుచేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 నవంబర్ 1వ తేదీ నుంచి సదర్ ఉత్సవాలను అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్‌కే పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ సదర్‌ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఏటా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు ‎అంజన్ కుమార్ యాదవ్‌పై ప్రశంసలు కురిపించారు. యువజన కాంగ్రెస్ నాయకుడిగా, నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో అంజన్‌ కుమార్‌ యాదవ్‌ ప్రజలకు సేవలందించారని వెల్లడించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించి ప్రజలతో మమేకమై పనిచేశారని తెలిపారు. సదర్ ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడంతోపాటు పశుసంపద అభివృద్ధికి అంజన్‌ కుమార్‌ యాదవ్‌ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
‎
‎రాష్ట్రంలో పశుసంపదను పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పశుసంపద అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నామని.. సదర్ ఉత్సవాల్లో పాల్గొంటున్న కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి ఈ కార్యక్రమాలు దోహదపడాలని ఆకాంక్షించారు. భారతీయ చరిత్రలోనూ పశుసంపదకు ఎంతో ప్రాధాన్యత ఉందని చెబుతూ మహాభారతంలోని గోగ్రహణ ఘట్టాన్ని భట్టి విక్రమార్క ప్రస్తావించారు. పశుసంపద ఒక రాజ్యానికి.. దేశానికి ఎంత ముఖ్యమో ఆ ఘట్టం తెలియజేస్తుందని చెప్పారు. వ్యవసాయమే మన ఆర్థిక వ్యవస్థకు మూలమని.. వ్యవసాయాన్ని బలోపేతం చేసే పశుసంపదను పరిరక్షించి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పేర్కొన్నారు. ‎సదర్ ఉత్సవాలు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయని, వాటి ప్రాధాన్యతను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సద్‌ ఉత్సవాలు భవిష్యత్తులో మరింత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని పునరుద్ఘాటించారు.

యాదవుల ఐక్యతకు చిహ్నం సదర్: తలసాని శ్రీనివాస్ యాదవ్
ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద నిర్వహించిన సదర్ సమ్మేళనంలో బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని కీలక ప్రసంగం చేశారు. 'ఏడాది పొడవునా  పాడిపరిశ్రమ పనులలో యాదవులు దీపావళి మరుసటి రోజు ఘనంగా సదర్‌ను నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఒకప్పుడు హైదరాబాద్ నగరానికే పరిమితమైన సదర్‌ను ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చేసుకోవడం సంతోషించే విషయం. రామాయణం, మహాభారతం ఏ చరిత్ర చూసిన యాదవులు లేనిదే లేదు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మొదటగా తెరిచేది యాదవుడే. సంఖ్యా పరంగా ఎంతో బలమైన సామాజిక వర్గంగా ఉన్న యాదవులు అంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది' అని తెలిపారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES