Ganesh Immersion: తొలిరోజు ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనం రెండవ రోజు పూర్తిగా ముగించేందుకు పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. గణేశ్ విగ్రహాల నిమజ్జనాన్ని త్వరిత గతిన పూర్తి చేసేందుకు పోలీస్, ట్రాఫిక్ సిబ్బంది నిరంతరం విధులు నిర్వహిస్తున్నారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ప్రధాన నిమజ్జన మార్గాల్లో శనివారం కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, పీవీ స్టాచ్యూ, ఇందిరా గాంధీ రోటరీ పరిసరాల్లో సాధారణ వాహనాలకు అనుమతి లేదని సజ్జనార్ సృష్టం చేశారు. నిమజ్జనాలు ప్రశాంతంగా పూర్తయ్యేలా ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు.
వాహనదారులకు నో ఎంట్రీ..
అత్యవసరమైతే తప్ప సాధారణ వాహనదారులు ఈ మార్గాల్లో ప్రయాణించవద్దని సజ్జనార్ సూచించారు. వీలైతే తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడొద్దని సూచించారు. ట్రాఫిక్ పోలీసులు జారీ చేసే అధికారిక అడ్వైజరీలు, సూచనలను ప్రజలు ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. నిమజ్జనోత్సవం ప్రశాంతంగా పూర్తయ్యే విధంగా పోలీసు యంత్రాంగానికి ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని సీపీ కోరారు.
ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన సీపీ..
శాంతియుత నిమజ్జనోత్సవానికి సహకరిస్తున్న నగర ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన హైదరాబాద్ సీపీ, ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, లిబర్టీ, మోజంజాహీ మార్కెట్ ప్రాంతాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారన్నారు. భక్తుల రద్దీతో వాహనాల రాకపోకలు మందగించి నిమజ్జన ప్రక్రియ కొంత ఆలస్యమైందని వెల్లడించారు. నిమజ్జన శోభాయాత్ర నేటి సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల భక్తులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
బైక్ పై క్షేత్రస్థాయిలో పర్యటించిన సీపీ..
గణేశ్ నిమజ్జన శోభాయాత్ర సాగే ప్రధాన మార్గాలను సీపీ స్వయంగా బైక్‌పై పర్యటించి పరిశీలించారు. నగరంలో శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగేలా చూడటంలో భాగంగా క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు ఆయన ద్విచక్రవాహనంపై ఈ తనిఖీ చేపట్టారు. యాత్ర సాగుతున్న ప్రధాన కూడళ్లు మోజంజాహి మార్కెట్, బషీర్‌బాగ్, లిబర్టీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.
శోభాయాత్ర సాఫీగా సాగేలా ఏర్పాట్లు..
శోభాయాత్ర ఎక్కడా ఆగకుండా ముందుకు సాగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట నిఘా ఉంచాలని, శోభాయాత్రకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని పోలీస్ అధికారులకు సూచించారు. విధుల్లో ఉన్న సిబ్బంది అంతా సమన్వయంతో ఉంటూ, నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.