అక్టోబర్ 2న నగరంలో వైన్ షాపులు, మటన్ మార్కెట్లు బంద్.. GHMC ఆదేశాలు ఇవే!
హైదరాబాద్ నగర నివాసులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక. రాబోయే అక్టోబర్ 2వ తేదీన నగరంలోని మాంసం దుకాణాలు, వైన్ షాపులు పూర్తిగా బంద్ ఉండబోతున్నాయి. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని మాంసం, మద్యం విక్రయ కేంద్రాలను మూసివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలను తెలుసుకుందాం.
ముక్క లేనిదే ముద్ద దిగని వారికి.. చుక్క లేనిదే నిద్ర పట్టని వారికి భారీ షాక్ అని చెప్పవచ్చు. అక్టోబర్ 2వ తేదీన నగరంలో వైన్ షాపులతో పాటు మాంసం విక్రయించే దుకాణాలు కూడా మూసివేసి ఉంటాయి. అక్టోబర్ 2వ తేదీన జరుపుకునే మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ రెండు రకాల షాపులను బంద్ చేయాలని నిర్ణయించారు. గొర్రెలు, మేకలు పశువుల వధ శాలలతోపాటు అన్ని రకాల మాంసం దుకాణాలను కూడా మూసివేయాలని జీహెచ్‌ఎంసీ ఆదేశాలు ఇచ్చింది. మున్సిపల్ కమిటీ తీసుకున్న ఒక ప్రత్యేక తీర్మానం మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు విడుదలైన నేపథ్యంలో, మున్సిపల్ అధికారులు కూడా ఈ ప్రక్రియలో పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. అంతేకాకుండా, అక్టోబర్ 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కూడా మాంసం,వైన్ షాపులు బంద్ అయ్యే అవకాశం ఉంది.
సాధారణంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన చికెన్ ఇతర మాంసం షాపులు సెలవులో ఉంటే, అదే రోజు మధ్యాహ్నం నుండి మద్యం దుకాణాలు కూడా బంద్ చేస్తారు. ప్రధానంగా గాంధీ జయంతి ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ కీలకమైన నిర్ణయాన్ని అధికారులు తీసుకున్నారు. జీహెచ్ఎంసీ ఆదేశాల ప్రకారం నగరంలోని చికెన్ షాపులు, మటన్ షాపులు, మద్యం విక్రయించే షాపులు అన్నీ మూసివేసి ఉండాలి. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారిక సర్క్యులర్‌ను కూడా విడుదల చేసింది.
అంతేకాకుండా, జారీ చేసిన ఈ ఆదేశాలను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా అమలు చేయాలని జీహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి. కర్ణన్ సూచించారు. దీనిని సమర్థవంతంగా అమలు చేయడానికి పోలీస్ కమిషనర్లను కూడా కోరారు. పోలీస్ శాఖ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ షాపులను మూసివేసేలా చూడాలని సూచించారు.
ఇటీవల జరిగిన వినాయక నిమజ్జనం సమయంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేదా గొడవలు చోటు చేసుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో వైన్ షాపులను బంద్ చేశారు. అదే విధంగా, అహింసావాది అయిన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా, అహింసకు ప్రాధాన్యత ఇచ్చే ఈ ప్రత్యేక రోజున పలు ప్రాంతాల్లో మాంసం విక్రయాలను నిలిపివేయాలని నిర్ణయించారు. ఇది కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం కాకుండా, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా అక్టోబర్ రెండో తేదీన మద్యం షాపులతో పాటు మాంసం దుకాణాలు కూడా బంద్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం జిహెచ్ఎంసి సిపిఆర్ఓ కార్యాలయం ద్వారా ఈ అధికారిక సర్క్యులర్ విడుదల అయింది.