KBR పార్కు ప్రాజెక్టు రద్దు.. గుంతల పూడ్చివేత.. ఎలివేటెడ్ కారిడార్ పై దృష్టి..
KBR Project: హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్‌పాస్‌లు, స్టీల్ బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన పాత ప్రణాళిక రద్దు కావడంతో తవ్విన గుంతలను పూడ్చుతున్నారు. అగ్రసేన్ మహారాజ్ జంక్షన్ వద్ద అండర్‌పాస్‌ల కోసం తవ్విన రెండు భారీ గుంతలను ట్రాక్టర్లు, ట్రక్కుల ద్వారా మట్టిని తరలించి పూడ్చివేస్తున్నారు.
KBR Project Updates: కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రభుత్వం తలపెట్టిన 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌ల ప్రతిపాదనను ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో ఈ ప్రాంతంలో వీటి నిర్మాణాల కోసం వన్ వే అమలు చేసిన ప్రభుత్వ అధికారులు.. అక్కడ ట్రాఫిక్ గణనీయంగా తగ్గడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం అమలు చేస్తోన్న వన్ వే సక్సెస్ కావడంతో ప్లాన్ బి అమల్లోకి తీసుకొచ్చారు. ఇప్పటికే కేబీఆర్ పార్క్ చుట్టు గుంతలను పూర్తిగా పూడ్చి రోడ్డుకు సమాంతరంగా ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇతర ప్రాంతాల్లో అండర్‌పాస్‌ల కోసం తవ్విన గుంతలను కూడా దశలవారీగా పూడ్చేస్తున్నారు.
4 కిలోమీటర్ల మేర 6 లేన్ల బై డైరెక్షన్‌లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం..
కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి గతంలో రూ. 1,090 కోట్ల అంచనా వ్యయంతో 7 స్టీల్ బ్రిడ్జిలు, 7 అండర్‌పాస్‌ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. అయితే పార్క్ చుట్టూ వన్‌వే విధానం అమలు చేయగా ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో ఆ ప్రణాళికను పునఃపరిశీలించారు. దీంతో పాత ప్రతిపాదనను రద్దు చేసి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంపై దృష్టి సారిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని ముఫఖం జా కాలేజ్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల బై డైరెక్షనల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందుకోసం సుమారు రూ. 751 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వన్ వేతో తగ్గిన ట్రాఫిక్ సమస్య.. ప్రాజెక్టులో కీలక మార్పులు.
పాత ప్రణాళికలో ఏడు అండర్‌పాస్‌లు, ఏడు స్టీల్ బ్రిడ్జిలతో పాటు భూసేకరణకే సుమారు రూ. 1,040 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. కొత్త ప్రతిపాదనలో భూసేకరణ వ్యయం రూ.300 కోట్లలోపే ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే పార్క్ హయత్, కేబీఆర్ మెయిన్ గేట్ వద్ద నిర్మించిన పిల్లర్లను కొత్త ఎలివేటెడ్ కారిడార్‌లో వినియోగించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేబీఆర్ పార్క్ చుట్టే చేపట్టే పనులను GHMC కమిషనర్ ఆర్.వి. కర్ణన్ పరిశీలించారు.