KBR Park Flyover Project: కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్లపై కీలక నిర్ణయం.. పాత పనులకు బ్రేక్, కొత్త డిజైన్లకు గ్రీన్ సిగ్నల్
KBR Park Flyover Project: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రతిపాదించిన రూ.1,020 కోట్ల ఫ్లైఓవర్ ప్రాజెక్టు పరిధిలో భారీ మార్పులు చేసింది. పూర్తి వివరాలు ఇలా..
KBR Park Flyover Project: హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన ప్రతిష్టాత్మక కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టనున్న ఫ్లైఓవర్ పనుల పరిధిని భారీగా మారుస్తూ.. సుమారు రూ.1,020 కోట్ల వ్యయంతో కూడిన సవరించిన ప్రతిపాదనలకు పరిపాలనా పరమైన ఆమోదం తెలిపింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది.
సవరించిన పనుల వివరాలు ఇలా..
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి ముఫకంజా కాలేజీ వరకు నూతన ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
బంజారాహిల్స్ రోడ్ నంబర్–1కు అనుసంధానంగా ప్రత్యేక కనెక్టింగ్ ర్యాంప్‌ను ఏర్పాటు చేయనున్నారు.
కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, ముగ్ధ జంక్షన్, రోడ్ నంబర్–45, ఫిల్మ్‌నగర్, మహారాజా అగ్రసేన్ జంక్షన్లతో పాటు క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ పరిసరాల్లో చేపట్టే పనుల డిజైన్లు, పరిధిని సవరించారు.
ఈ ప్రతిపాదనలు రద్దు..
పంజాగుట్ట స్మశాన వాటిక, ఎన్‌ఎఫ్‌సీఎల్ (NFCL) జంక్షన్లలో గ్రేడ్ సెపరేటర్ల పనులను రద్దు చేశారు.
పంజాగుట్ట స్మశాన వాటిక జంక్షన్ వద్ద ప్రతిపాదించిన 3-లేన్ యూని-డైరెక్షనల్ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని రద్దు చేశారు.
ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్‌లో 2-లేన్ యూని-డైరెక్షనల్ ఫ్లైఓవర్‌తో పాటు, బంజారాహిల్స్ పరిధిలోని 2-లేన్ యూని-డైరెక్షనల్ అండర్‌పాస్ పనులను కూడా పూర్తిగా పక్కన పెట్టారు.
ప్రాజెక్టు కాంట్రాక్ట్ కేటాయింపుల్లోనూ ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ పనులను ప్రముఖ నిర్మాణ సంస్థ 'మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్' (MEIL)కు అప్పగించేందుకు అనుమతి మంజూరు చేసింది. గతంలో 'కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్' (KNR)కు జారీ చేసిన లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ (LOA)ను రద్దు చేస్తూ.. టెండర్ సమయంలో వారు చెల్లించిన డిపాజిట్లను తిరిగి చెల్లించాలని ఆదేశించింది. సవరించిన డిజైన్ల ప్రకారం ప్యాకేజీ–1, ప్యాకేజీ–2 పనులను వేగవంతం చేయాలని.. ప్రాజెక్ట్ పనుల పర్యవేక్షణ కోసం సబ్‌స్టిట్యూటింగ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ల (PMC) సేవలను యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.