Hyderabad Godavari Water Supply: హైదరాబాద్ మహా నగరంలో రాబోయే వేసవిలో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జలమండలి ముందస్తు చర్యలను వేగవంతం చేస్తోంది. రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితుల కారణంగా సింగూరు - మంజీరా జలవనరుల్లోని నీటి లభ్యత తగ్గే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని గోదావరి నీటిని ప్రత్యామ్నాయంగా వినియోగించుకునే ప్రణాళికను జలమండలి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు చేపట్టిన పైప్‌లైన్ అనుసంధాన పనులు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి.
మల్లన్న సాగర్ నుంచి ఘన్‌పూర్ మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (ఎంబీఆర్) వరకు గోదావరి జలాలను తరలించేందుకు 1600 మిల్లీమీటర్ల వ్యాసం ఉన్న పైప్‌లైన్‌ను అనుసంధానిస్తున్నారు. మిషన్ భగీరథ, హైదరాబాద్ జలమండలి అధికారులు సంయుక్తంగా ఈ పనులను చేపడుతున్నారు. మిగిలిన పనులను రెండు రోజుల్లో పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
రాష్ట్ర జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి, మిషన్ భగీరథ ఇంజినీర్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డి ఇటీవలే గోదావరి జలాల తరలింపు పనుల పురోగతిని పరిశీలించారు. పైప్‌లైన్ అనుసంధార ప్రక్రియ, సాంకేతిక అంశాలపై అధికారులతో ఇప్పుటికే చర్చలు జరిపారు. మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి నీటి తరలింపును పరీక్షించేందుకు సిద్ధం కావాలని సూచించారు.
అయితే ఈ ప్రాజెక్ట్ పనుల్లో కొంత ఆలస్యం చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో సుమారు 150 మీటర్ల మేర పైప్‌లైన్ వేయాల్సిన మార్గంలో భారీ రాతిపొరలు ఎదురవ్వడం వల్ల వాటిని తొలగించేందుకు మరికొంత అదనపు సమయం పట్టింది. తొలుత ఈ నెల 15 నాటికి పనులు పూర్తి చేయాలని ప్రణాళిక రచించినప్పటికీ.. అడ్డంకుల కారణంగా గడువు పొడిగించాల్సి వచ్చింది. ఘన్‌పూర్ ఎంబీఆర్ వద్ద పైప్‌లైన్ జంక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిన అనుసంధాన పనులు ముగిసిన వెంటనే ట్రయల్ రన్ ప్రారంభించనున్నారు. ,
గోదావరి జలాల తరలింపులో భాగంగా ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు 40 ఎంజీడీల అదనపు గోదావరి నీటిని హైదరాబాద్‌కు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సింగూరు-మంజీరా నీటిపై ఆదారపడే ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడితే, దాదాపుగా 50 శాతం లోటును ఈ అదనపు నీటి సరఫరాతో భర్తీ చేయాలని అధికారులు యోచిస్తున్నారు. పనులు పూర్తై నీటి సరఫరా ప్రారంభమైతే వేసవిలో హైదరాబాద్ నగర ప్రజలకు కొంతమేర ఉపశమనం లభిస్తుంది.