KBR Project Small changes: భాగ్యనగరంలో జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో తిరిగే పబ్లిక్‌కు కేబీఆర్ పార్క్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి నిత్యం వేలాది మంది ఇక్కడ వాకింగ్, వ్యాయామాలు, కసరత్తుల కోసం ఉదయం ఇక్కడ బారులు తీరుతుంటారు.దీంతో ఇక్కడ నిత్యం ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది. తాజాగా ఇక్కడ ప్రభుత్వం ఏడు ఫ్లై ఓవర్లు, ఏడు అండర్ పాస్‌లు నిర్మించాలనే ఆలోచనలో ఉంది. దీని కోసం కొన్ని రోజులుగా వన్ వే అమలు చేశారు. తాజాగా ఈ విధానంతో రద్దీ తగ్గడంతో అధికారులు ఈ ఏరియాలో నిర్మించ తలపెట్టిన పనుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. తాజాగా రూ. 715.16 కోట్లతో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజీ వరకు స్టీల్ బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించారు.
నిర్మించాలనుకున్న ఫ్లై ఓవర్స్ రద్దు..
దీంతో పాటు బంజారాహిల్స్ నుంచి ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ వద్ద 2-లేన్ ఏకదిశ ఫ్లైఓవర్, టీవీ9 జంక్షన్ వద్ద 2-లేన్ ఏకదిశ అండర్‌పాస్, 3-లేన్ వన్ వే ఫ్లైఓవర్ నిర్మాణ పనులను రద్దు చేయాలని స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన కేఎన్‌ఆర్ కన్స్రక్షన్స్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్‌ను రద్దు చేయాలని నిర్ణయించారు. అలాగే, టెండర్ ప్రక్రియలో ఏజెన్సీ చెల్లించిన డిపాజిట్లను తిరిగి ఇవ్వాలని నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ, స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో 11 అంశాలకు ఆమోదం లభించింది.
జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్, ముగ్ధ జంక్షన్ వద్ద స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణంగా ఉన్న ప్యాకేజీ–1 పరిధిని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్ నుంచి ముగ్ధ జంక్షన్ వరకు స్టీల్ ఫ్లైఓవర్‌గా మార్చాలని కమిటీ నిర్ణయించింది. రూ. 580 కోట్లు మంజూరైన ప్రాజెక్టు వ్యయ పరిమితిలోనే పనులు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చారు. తాజాగా సవరించిన ప్రతిపాదనలు 365.85 కోట్లుగా నిర్ణయించారు. రోడ్డు నంబర్–45 జంక్షన్, ఫిల్మ్‌నగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వద్ద స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణంగా ఉన్న పనుల పరిధి, స్థలాన్ని మార్చాలని నిర్ణయించారు.
కొత్త అలైన్‌మెంట్ ఇదే..
ఇకపై ముగ్ధ జంక్షన్ నుంచి ముఫకంజా కాలేజీ వరకు, బంజారాహిల్స్ రోడ్డు నంబర్–1కు అనుసంధానించే ర్యాంపుతో స్టీల్ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. 510 కోట్ల రూపాయలు మంజూరైన ప్రాజెక్టు వ్యయ పరిమితిలో పనులు చేపట్టనున్నారు. సవరించిన వ్యయం 349.31 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ఈ రెండు ప్యాకేజీల్లో మార్పులు చేసి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్ నుంచి ముఫకంజా కాలేజీ వరకు, బంజారాహిల్స్ రోడ్డు నంబర్–1కు అనుసంధానించే ర్యాంపుతో స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ప్రస్తుత మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్‌కు ప్యాకేజీ–1, 2 కింద అప్పగించాలని కమిటీ నిర్ణయించింది. ఈ మార్పులకు సంబంధించిన అనుమతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు.
నగరంలో వివిధ పనులకు జీహెచ్ఎంసీ ఆమోదం..
అలాగే అబిడ్స్ మున్సిపల్ కాంప్లెక్స్‌లోని పార్కింగ్ స్థలం లీజును మరో ఏడాది పొడిగించేందుకు, కేశవగిరిలో కొత్త చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ నిర్మాణానికి వేయి చదరపు అడుగుల జీహెచ్‌ఎంసీ స్థలాన్ని కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. ఆరాంఘర్–జూపార్క్ మార్గంలో 6-లేన్ గ్రేడ్ సెపరేటర్ నిర్మాణానికి రూ. 799.74 కోట్లతో సవరించిన పరిపాలనా అనుమతి ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఒవైసీ హాస్పిటల్, బహదూర్‌పురా జంక్షన్ల వద్ద మల్టీలెవల్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి 161 కోట్ల రూపాయలతో సవరించిన పరిపాలనా అనుమతికి ఆమోదం తెలిపారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్–25 పార్కు, హైకింగ్ ట్రైల్ పార్కులను సీఎస్‌ఆర్ కింద మూడేళ్లపాటు మెగా ఇంజినీరింగ్ కంపెనీ ద్వారా నిర్వహించేందుకు ఎంఓయూ కుదుర్చుకునే ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది.
ఎంఎంసీ పరిధిలో పలు పనులకు ఆమోదం..
ఎంఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం తార్నాకలోని ఎంఎంసీ కార్యాలయంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ, స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో 17 అంశాలకు ఆమోదం లభించింది. చెరువుల పునరుద్ధరణ, డ్రైనేజీ, వ్యర్థాల నిర్వహణ, రోడ్ల అభివృద్ధి, పర్యావరణం, ప్రజా సౌకర్యాలకు సంబంధించిన ప్రతిపాదనలను కమిటీ ఆమోదించింది. కుంట్లూర్ ట్యాంక్ నుంచి పసుమాముల చెరువు వరకు డ్రైన్ల పునర్నిర్మాణం, నాసిన్ చెరువు నుంచి కొమటివాని కుంట వరకు స్టార్మ్‌వాటర్ డ్రెయిన్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. చింతల్ చెరువు అభివృద్ధికి రూ. 20 కోట్లు, రాంపల్లి చెరువు అభివృద్ధికి రూ. 40 కోట్లు మంజూరు చేసింది. పటేల్‌నగర్ ఎస్టీపీ నుంచి డీ-మార్ట్ వరకు 36 మీటర్ల రహదారి అభివృద్ధికి రూ. 97.50 కోట్లతో పరిపాలనా అనుమతికి ఆమోదం తెలిపింది.
నాగారంలో ఏబీసీ, సీ అండ్ డీ వేస్ట్, ఎస్‌సీపీటీ, బీటీ ప్లాంట్ల కాంపౌండ్ వాల్‌కు 4.95 కోట్ల రూపాయలు, యూజీడీ పనులకు రూ. 2.95 కోట్లు, సైనిక్‌పురి డాగ్ పార్క్‌కు రూ. 2.85 కోట్లు మంజూరు చేయడానికి ఆమోదం తెలిపింది. అలాగే బయోడైవర్సిటీ మేనేజ్‌మెంట్ కమిటీ ఏర్పాటు, ఫతుల్లాగూడ సీ అండ్ డీ ప్రాసెసింగ్ ఫెసిలిటీ సప్లిమెంటరీ ఒప్పందం, పెట్ గ్రూమింగ్ పాడ్స్ పైలట్ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చింది. కంట్రోల్ రూమ్ నిర్వహణ, ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితి పెంపు, ప్రభుత్వ భూమి కేటాయింపు, లీగల్ అసిస్టెంట్ల నియామకం, లైట్‌హౌస్ కార్యక్రమానికి స్థలం కేటాయింపు, బండబావిలో అవుట్‌డోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపింది. ఇలా మొత్తం 17 అంశాలకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.