SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ ఆయుధాల చోరీలో కీలక మలుపు..

Bollarum Madras Regiment army arms theft Case: బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ బెల్లా ఫామ్‌ నిబంధనలను ఉల్లంఘించి ఆయుధాల చోరీకి పాల్పడిన కేసులో మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పోలీసులు సంచలనాత్మక విషయాలను వెల్లడించారు. మల్కాజిగిరి పోలీసులు, ఎస్‌ఓటీ, టాస్క్ ఫోర్స్ , ఇంటెలిజెన్స్ విభాగాల సంయుక్త దర్యాప్తులో ఈ కేసు గుట్టురట్టయ్యింది.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 04, 2026, 12:44 PM IST | Updated: Oct 04, 2026, 12:47 PM IST
Image Credit: Army Madras Regiment Case (File/Source)
Join

Army Arms Theft Case: బొల్లారంలోని ఆర్మీ మద్రాస్ రెజిమెంట్  కేసులోని ప్రధాన నిందితుడు మల్లేష్‌ను సెప్టెంబర్ 11న అదుపులోకి తీసుకుని, అతడు గన్నీ బ్యాగుల్లో దాచిన తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి తెలిపారు. 10 రోజుల పోలీసు కస్టడీ విచారణలో మల్లేష్ నేరచరిత్ర, చోరీ వెనుక ఉన్న పక్కా ప్రణాళిక బయటపడిందని ఆమె వివరించారు.

2025 వరకు మేఘాలయ, జమ్మూ, ఊటీ ప్రాంతాల్లో పనిచేసిన మల్లేష్‌, అక్కడి నుంచి మద్రాస్ రెజిమెంట్‌కు బదిలీ అయ్యాడు. గతంలోనూ ఇతనిపై నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో రెండు దొంగతనం కేసులు నమోదు కాగా, మొదటి నుంచీ నేరపూరిత మనస్తత్వం కలిగి ఉన్నాడని అధికారులు స్పష్టం చేశారు. ఆర్మీ రిటైర్మెంట్ తర్వాత ఫ్లాట్ కొనుగోలు, సొంత ఇల్లు నిర్మాణం చేపట్టడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఖర్చయిపోవడంతో, ఎలాగైనా త్వరితగతిన ధనవంతుడు కావాలనే ఉద్దేశంతో ఆయుధాల దొంగతనానికి ఒడిగట్టాడు. 2022లోనే కలకత్తాలో సివిలియన్ అయిన బీర్బల్ షా ద్వారా అక్రమ ఆయుధ వ్యాపారి అవల్ దెయ్‌తో పరిచయం పెంచుకుని కంట్రీమేడ్ తపంచాను కొనుగోలు చేసినట్లు తేలింది.

ఆయుధాల చోరీకి ముందే స్కెచ్..

ఆయుధాల చోరీకి మల్లేష్, మల్లికార్జున, నిరంజన్‌‌లు కలిసి ముందే స్కెచ్ వేశారు. బ్యాంకుల్లో దొంగతనం ఎలా చేయాలో తెలిపే వీడియోలను మల్లికార్జున మల్లేష్‌‌కి పంపగా, వాటి ఆధారంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. గతంలో మద్రాస్ రెజిమెంట్‌లో పనిచేసిన అనుభవంతో, అక్కడ విధులు నిర్వర్తిస్తున్న కోట్ ఇన్-ఛార్జ్ వినోద్, ప్రవీణ్, శేషులకు డబ్బుల ఆశ చూపి తన వైపు తిప్పుకున్నాడు. జూలై 14 నుంచి ఆగస్టు 27 వరకు మల్లేష్, వినోద్‌లు ఒకే లొకేషన్‌లో ఉన్నట్లు పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించారు. కోట్ ఇన్-ఛార్జ్ వినోద్ సీసీ కెమెరాల పనితీరు, సెంట్రీ డ్యూటీ వేళలు తెలుసుకుని రెగ్యులర్ సమయం కంటే ముందే విజిటింగ్ చేసేవాడు.

ప్లాన్ ప్రకారం స్కూటీపై లోపలికి వెళ్లిన మల్లేష్ ఐరన్ రాడ్‌తో తాళాలు పగలగొట్టి ఆయుధాలను చోరీ చేశాడు. చోరీ పూర్తయిన వెంటనే ప్రవీణ్‌కు కామ్ హోగయా అని మెసేజ్ పంపి, ఆ తర్వాత వాట్సాప్ కాల్స్, మెసేజ్ హిస్టరీ మొత్తాన్ని డిలీట్ చేశాడు. సమాచారం ఇచ్చినందుకుగానూ వినోద్‌కి ఒక ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో లక్ష నగదును మల్లేష్ అందించాడు. ఆ తర్వాత అనుమానం రాకుండా వినోదే ఒక పిస్టల్ పోయిందని ఫిర్యాదు చేయడంతో పోలీసులకు అసలు అనుమానం బలపడింది.

బాధ్యులపై కఠిన చర్యలు..

ఈ ఆయుధాల చోరీ కేసులో ఎలాంటి ఉగ్రకోణం లేదని సీపీ సుమతి స్పష్టం చేశారు. కేసులో భాగస్వామి అయిన శేషు పాకిస్తాన్‌కు చెందిన కొన్ని సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అవుతున్నట్లు గుర్తించామని, దానిపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. చోరీ జరిగిన సమయంలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల సీసీ కెమెరాలు పనిచేయడం లేదని అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న అక్రమ ఆయుధ వ్యాపారి అవల్ దెయ్‌పై దేశవ్యాప్తంగా పలు కేసులు ఉన్నాయని, బీర్బల్ షాకు కూడా మల్లేష్ ఆర్మీ ఆయుధాలు తీసుకువస్తాడనే విషయం ముందే తెలుసని విచారణలో తేలింది. అన్ని రకాల సాంకేతిక, భౌతిక ఆధారాలను సేకరించామని, ముఠాలోని మిగిలిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ వెల్లడించారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES