Hyderabad Water: నీటి ఎద్దడి వేళ హైదరాబాద్ ప్రజలకు కొత్త యాప్.. నీళ్లు వృథా చేస్తే 'పానీ యాప్'లో ఫిర్యాదు
PAANI App Launch For Water Warriors In Hyderabad: నీళ్లు అందించలేమని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడంతో హైదరాబాద్ ప్రజలకు నీటి అవసరాలపై జలమండలి కీలక నిర్ణయం తీసుకుంది. నీటి వృథా అరికట్టేందుకు కొత్తగా ఒక యాప్‌ను తీసుకువచ్చింది. ఆ యాప్ ద్వారా నీటి ఎద్దడి నివారించవచ్చని పేర్కొంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Hyderabad Water Crisis: ఎల్‌నినో.. వర్షాభావ పరిస్థితుల్లో ఏర్పడబోతున్న నీటి ఎద్దడిపై జలమండలి కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ ప్రజలు నీటి వినియోగంపై కీలక సూచనలు చేసింది. నీటి వృథాను తగ్గించుకోవాలని.. అనవసరంగా నీటిని వినియోగించుకోరాదని సూచించింది. ఈ క్రమంలో నీటి వృథాను అరికట్టేందుకు సరికొత్త కార్యక్రమం చేపట్టింది. నీటి వృథా ఫిర్యాదుల కోసం ఒక యాప్‌ను తీసుకువచ్చింది. జలమండలి తీసుకువచ్చిన 'పానీ యాప్' వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో గురువారం PAANI మొబైల్ యాప్ (వాటర్ వారియర్స్ ) జలమండలి ఎండీ అశోక్ రెడ్డితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. నీటిని సంరక్షించుకోవడానికి PAANI యాప్ (వాటర్ వారియర్స్) తీసుకువచ్చామని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీటి సంరక్షణ అత్యంత ముఖ్యం అని ప్రకటించారు. 'నీరు మనందరి ఉమ్మడి సంపద. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి కుటుంబం తమ నీటి వినియోగాన్ని కనీసం 20 శాతం తగ్గించుకోవాలి' అని ప్రజలకు సూచించారు.
'తాగునీటి వృథా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జలమండలి పానీ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. పరిసరాల్లో జరిగే నీటి వృథాను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకురావడంలో ప్రజలను భాగస్వాములను చేయడమే దీని లక్ష్యం. ఆసక్తి ఉన్న పౌరులు ప్రభుత్వ గుర్తింపు పత్రంతో జలమండలి వెబ్‌సైట్‌లో 'Save Water Volunteer'గా నమోదు చేసుకోవచ్చు. అనంతరం గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకుని నీటి దుర్వినియోగంపై ఫిర్యాదులు చేయవచ్చు' అని జలమండలి అధికారులు వెల్లడించారు.
'ప్రతి ఫిర్యాదుపై ఎస్‌ఎంఎస్ ఆధారిత ధ్రువీకరణ ఉంటుంది. ఫిర్యాదు చేసిన వాలంటీర్ వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఉల్లంఘనలు జరిగితే నోటీసులు ఇవ్వడంతో పాటు నిబంధనల ప్రకారం జరిమానాలు విధిస్తారు' అని జలమండలి అధికారులు తెలిపారు. నీటి సంరక్షణలో చురుగ్గా పనిచేసే ఉత్తమ వాలంటీర్లకు ప్రభుత్వం సత్కరిస్తుందని ప్రకటించారు. నీటి సంరక్షణకు ప్రతి కాలనీ, అపార్ట్‌మెంట్ నుంచి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు.
'తాగునీటిని వాహనాలు కడగడం, ఫ్లోరింగ్ శుభ్రం చేయడానికి వాడకూడదు. ట్యాంకులు పొంగిపొర్లకుండా చూడటం, లీకేజీలను అరికట్టడం మరియు ఇంకుడు గుంతలు, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి' అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తాగునీటిపై ఒత్తిడిని తగ్గించడానికి నిర్మాణాలు, పరిశ్రమలు, పార్కులు, గార్డెనింగ్ వంటి పనులకు ఎస్‌టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని వినియోగించుకోవాలని చెప్పారు. నీటి సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రజా ఉద్యమంగా మారాలి. ప్రతి పౌరుడూ ఒక 'వాటర్ వారియర్'గా మారాలని పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
'ప్రతి ఇంట్లో 20 శాతం నీటి పొదుపు - ప్రతి పౌరుడు ఒక వాటర్ వారియర్. ఎక్కడైనా నీటి దుర్వినియం జరిగితే ఒక ఫోటో సెండ్ చేయగానే వారికి ఆటోమేటిక్ గా పెనాల్టీ పడుతుంది. ప్రజలే స్వచ్ఛందంగా నీటిని పొదుపుగా వాడుకోవాలి.. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి' అని పొన్నం ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. 'వెయ్యి ఇళ్లు ఉండే ఒక గ్రామాన్ని తీసుకునే చెరువు బావులు ప్రకృతి సిద్ధమైన వ్యవస్థ ఉంటుంది. పట్టణంలో భూగర్భ జలాలు పెంచుకోవడానికి వాటర్ హార్వెస్టింగ్ చేయడం, ఎస్‌టీపీలు పెంచడం సరైన విధంగా జరగడం లేదు. గ్రామాల స్థాయిలో ఉండే గేటెడ్ కమ్యూనిటీస్ లో కూడా వాటర్ హార్వెస్టింగ్ చేయాల్సిందే' అని స్పష్టం చేశారు.
'ఎల్లంపల్లి నుంచి నీళ్లు హైదరాబాద్ తెస్తున్నాం. నీళ్లు అవసరమైన మేర వాడాలి. అంతకుమించి వాడవద్దు. నీటి దుర్వినియోం కాకుండా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని నీటి పొదుపుపై బాధ్యత ఉండాలి' అని పొన్నం ప్రభాకర్ సూచించారు. 'ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. నీటి ఇంకుడుగుంతలు తప్పనిసరిగా ఉండాలి. గ్రామాల్లో ఇంటింటికి ఇంకుడు గుంత ,పొలానికి ఫారం కుంట ,ఊరుకో ఊరు కుంట ద్వారా పోతున్నాం. హైదరాబాద్ లోని అన్ని కార్యాలయాలలో,ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఇంకుడు గుంతలు చేసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు చేశాం' అని మంత్రి తెలిపారు.