Samakhya Chamber of Commerce: తెలంగాణలో మరో ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహణ జరగనుంది. వ్యాపార, పారిశ్రామిక రంగాలలో కాపు యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సమాఖ్య 2026 గ్లోబల్ బిజినెస్ మీట్ నిర్వహించబోతున్నట్లు ‘సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్’ ప్రకటించింది. అక్టోబర్ 13 నుంచి 15వ తేదీ వరకు హైదరాబాద్ వేదికగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు వెల్లడించారు.
ముంబైలోని ఓ ప్రముఖ హోటల్‌లో బృహస్పతి గ్రూప్ నేతృత్వంలో ‘సమాఖ్య 2026 గ్లోబల్ బిజినెస్ మీట్’ సన్నాహక సదస్సు జరగ్గా.. ఈ సదస్సులో గ్లోబల్ బిజినెస్ మీట్‌కు సంబంధించిన పోస్టర్‌ను బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్, మహారాష్ట్ర మంత్రి ప్రతాప్ రావు నాయక్, ఏపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆవిష్కరించారు. ఈ బిజినెస్ మీట్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. వ్యాపారాలకే పరిమితం కాకుండా.. మారుతున్న కాలానికి అనుగుణంగా యువతను సాంకేతిక దిగ్గజాలుగా మార్చడమే లక్ష్యంగా ఈ సదస్సులో ప్రముఖులు, ప్రతినిధులు చర్చించారు. కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక భవిష్యత్ సాంకేతిక రంగాలలో కాపు యువతను భాగస్వామ్యం చేయడంపై ఈ సదస్సు వేదికగా చర్చలు జరిగాయి.
ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ.. 'దేశ ఆర్థికాభివృద్ధిలో అన్ని వర్గాలతో పాటు కాపు సామాజికవర్గం కూడా కీలక పాత్ర పోషించాలి. ఉద్యోగాలకే పరిమితం కాకుండా యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి' అని పిలుపునిచ్చారు. సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పటిష్టమైన కార్యాచరణ అవసరమని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. కాపు కులస్తుల సంక్షేమం, వ్యాపార అభివృద్ధే లక్ష్యంగా 'సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్' చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న కాపు యువతలో అద్భుతమైన వ్యాపార నైపుణ్యాలు ఉన్నాయని.. సరైన వేదిక, సాంకేతిక తోడ్పాటు అందిస్తే వారు గ్లోబల్ మార్కెట్‌లోనూ రాణించగలరని ఎంపీ లక్ష్మణ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
'మారుతున్న కాలానికి అనుగుణంగా యువతను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉంది. సాంప్రదాయ వ్యాపారాలకే పరిమితం కాకుండా నేటి తరం యువతను కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యున్నత భవిష్యత్ సాంకేతిక రంగాలలో భాగస్వామ్యం చేయడంపై ఈ బిజినెస్ మీట్‌లో ప్రత్యేకంగా చర్చించారు. ఇది కాపు యువతకు సరికొత్త బంగారు భవిష్యత్తును ఇస్తుంది' అని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. దేశంలో పారిశ్రామిక రంగాన్ని, చిన్న, మధ్యతరహా వ్యాపారాలను ప్రోత్సహించడానికి ప్రధాని మోదీ అనేక విప్లవాత్మక పథకాలు, రాయితీలను అందిస్తోందని గుర్తుచేశారు. ముద్ర లోన్లు, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా యువతకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని వెల్లడించారు. మహారాష్ట్ర అభివృద్ధిలో ఏపీ భాగస్వామ్యం అద్భుతం అని మహారాష్ట్ర మంత్రి ప్రతాప్ రావు నాయక్ తెలిపారు. దేశాభివృద్ధిలో పారిశ్రామిక వేత్తల భాగస్వామ్యం ఎంతగానో అవసరమని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర అభివృద్ధిలో ఏపీకి చెందిన వ్యక్తుల భాగస్వామ్యం మరువలేనిదని కొనియాడారు.
హైదరాబాద్‌లో జరగనున్న సమాఖ్య 2026 గ్లోబల్ బిజినెస్ మీట్‌కు ముందస్తుగా బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, ముంబైలలో వరుసగా సన్నాహక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాపు కులస్తులకు కార్పొరేట్ స్థాయిలో వ్యాపార, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సృష్టించడమే ధ్యేయంగా తాము నిరంతరం శ్రమిస్తోందని సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు వెల్లడించారు.