SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

హైదరాబాద్‌‌లో అమల్లోకి వచ్చిన ‘క్యూర్’ చట్టం.. ఇంతకీ ఏమిటా చట్టం..!!

Telangana CURE Act: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త చట్టాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో సమీకృత పాలనా వ్యవస్థను ఏర్పాటు చేసింది. అక్టోబరు 2 గాంధీ జయంతి సందర్భంగా కొత్త చట్టం అమల్లోకి తెచ్చింది. ఈ చట్టంతో హైడ్రాకు సర్వాధికారాలు, పన్ను చెల్లింపు విధానంలో సమూల మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఇంతకీ ఏమిటా కొత్త చట్టం.. ? దీని వల్ల సామాన్య ప్రజలకు ఏం ఒరగనుంది.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 05, 2026, 12:12 PM IST | Updated: Oct 05, 2026, 12:34 PM IST
Image Credit: Hyderabad Region CURE Region (File Pic/Source)
Join

CURE Act Implemented in Hyderabad Regions: ఇప్పటిదాకా హైదరాబాద్ లో అమలవుతున్న సుమారు 70 ఏళ్ల నాటి  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి ఇక కాలం చెల్లింది. ఇక నుంచి కొత్తగా హైదరాబాద్ నగర శివారులో ఉన్న ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న
2,053 చదరపు కిలోమీటర్ల పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిని క్యూర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా ఒకే సమగ్ర పాలనా వ్యవస్థ కిందకు తీసుకురావడం కొత్త చట్ట ప్రధాన ఉద్ధేశం.

కోర్ అర్భన్ రీజియన్ ఎకానమీ..

తెలంగాణలో మహానగర పరిధిలో అమలవుతున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం స్థానంలో కొత్తగా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ చట్టం అమల్లోకి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పోరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌గా మూడు కార్పొరేషన్లుగా విభజించారు. పౌరసంస్థలు, పౌరసేవలు, పన్ను చెల్లింపు విధానంలో సమూల మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. కొత్త చట్టం ఐదు భాగాలుగా, 9 షెడ్యూళ్లు, 43 ఛాప్టర్లతో 319 సెక్షన్లతో రూపకల్పన చేశారు.  

హైదరాబాద్ లో అమల్లోకి వచ్చిన సరికొత్త చట్టం క్యూర్..
ఇప్పటిదాకా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్‌గిరి జిల్లా నగరు శివారు ప్రాంతాలను విలీనం చేసి విస్తరించిన తర్వాత మూడు కార్పొరేషన్లుగా విభజించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లను సమన్వయం చేసి సరికొత్త పాలనా విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. మూడు కార్పొరేషన్ల పరిధిలో సమన్వయం కోసం  క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ , యూటిలిటీ కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేశారు.

మూడు కార్పోరేషన్ల పరిధిలో సరికొత్త చట్టం..
హైదరాబాద్ విస్తరణకు అనుగుణంగా మూడు కార్పొరేషన్ల మధ్య సమన్వయంతో కూడిన సమగ్ర పాలనతో సరి కొత్త చట్టం నగర ప్రజలకు విశిష్ట సేవలు అందించబోతోంది. భవన నిర్మాణ అనుమతులు, ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్సుల వంటి అంశాల్లో ఏకరీతి విధానాన్ని తీసుకురావడమే ప్రధాన ఉద్ధేశమని అధికారులు తెలిపారు. విలీన ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఉన్న పాలనా, పన్నుల విధానాల్లోని తేడాలను తగ్గించేలా కొత్త వ్యవస్థను రూపొందించారు. కొత్తగా అమల్లోకి వచ్చిన కొత్త చట్టంతో పన్నులు మరింత పెరుగుతాయని, నగర పౌరులు, పరిసరాల్లో విలీన గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

వార్షిక అద్దెతో గాకుండా స్థల విలువ ఆధారంగా పన్ను విధానం..

ఇప్పటిదాకా ఇంటికి చెల్లిస్తున్న వార్షిక అద్దె ప్రాతిపదికన ఆస్తిపన్ను విలువను లెక్కగట్టే వారు.. కొత్త చట్టం ప్రకారం విలువ ఆధారంగా పన్ను లెక్కగడుతారు. ప్రాపర్టీ ట్యాక్ చెల్లింపు విధానంలో ప్రతి పన్ను చెల్లింపుదారులకు ఆధార్ కార్డు నంబరు తరహాలో విశిష్ట సంఖ్యను కేటాయిస్తారు. అదే నంబరుకు ఆస్తిపన్ను, నీటిబిల్లు, సీవరేజ్, శానిటేషన్, చెత్తసేకరణ ఛార్జీలతో ఒకే బిల్లుగా అందించే డిజిటల్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ తరహాలో బిల్లు వసూళ్ల వచ్చే 2027-28 ఆర్థిక సంవత్సరం ఆరంభంనుంచి అమలు చేస్తారు. కొత్తగా నిర్మించి ఇంకా పన్ను అంచనా వేయని ఆస్తులకు విలువ ఆధారిత పన్ను విధానం వెంటనే వర్తించనుంది. కొత్త విధానం అమలులోకి వచ్చిన తర్వాత పన్ను పెరుగుదల ఒక్కసారిగా భారం కాకుండా ఏటా 10 శాతానికి మించకుండా పరిమితం చేసే నిబంధనను చట్టంలో పొందుపరిచారు.

గ్లోబల్ సిటీగా హైదరాబాద్..

గ్లోబల్ సిటీగా  హైదరాబాద్ నగరం గుర్తింపు పొందే విధంగా  నైట్ ఎకానమీ పెంపుదలకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. హైదరాబాద్ నగర పరిసరాల్లో నిర్మిస్తున్న కమర్షియల్ కాంప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్‌లో మహిళల కోసం తప్పనిసరిగా తాగునీరు, ప్రత్యేక మహిళా టాయిలెట్లు వంటి మౌలిక వసతులు కల్పించడాన్ని చట్టంలో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు.

హైడ్రాకు ప్రత్యేక అధికారులు.. 
కొత్త పాలనా వ్యవస్థలో హైడ్రాకు స్పష్టమైన, చట్టపరమైన అధికారాలు కల్పించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులు, నీటి కుంటలు వంటి జల వనరులను పరిరక్షించేందుకు, అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు, మున్సిపల్ పార్కు స్థలాలు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను కబ్జాకోరల్లోంచి సంరక్షిస్తున్న హైడ్రాకు సర్వాధికారాలను అప్పగించి చట్టబద్ధత కల్పించారు. మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో  కొత్త చట్టంతో సమగ్ర పాలన, సత్వర సేవలను సింగిల్ విండోద్వారా నగర ప్రజలు పొందే వెసులు బాటు కల్పించారు.

మూడు కార్పొరేషన్లో భూముల ధరలు పెరగడంతోపాటు, పన్ను వసూళ్లతో రీజియన్ ఎకానమీ మరింత వృద్ధి సాధిస్తుందనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. క్యూర్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత జరగబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో మూడు కార్పొరేషన్లకు కొత్త పాలక వర్గాలను ఎన్నుకోబోతున్నారు. కొత్త పాలక వర్గాలు.. కొత్త చట్టం అమలు నగర ప్రజానీకాని ఎలాంటి సేవలు అందిస్తాయోనని ఆసక్తికర చర్చ సాగుతోంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES