Bathukamma 2026 Dates: ఈ నెల 10వ తేదీ నుంచి బతుకమ్మ వేడుకలు.. ఏర్పాట్ల వివరాలు ఇవే..!
Bathukamma 2026 Dates: బతుకమ్మ వేడుకలను ఈ నెల 10 నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నెల 18న సద్దుల బతుకమ్మ సందర్భంగా ట్యాంక్ బండ్‌పై వేలాది మంది మహిళలతో కనీవినీ ఎరుగని రీతిలో ఉత్సవాలు చేపట్టనున్నట్లు సీఎస్ సంజయ్ జాజు వెల్లడించారు. సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఉత్సవాల ఏర్పాట్లు, నగర సుందరీకరణపై ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Bathukamma 2026 Dates: తెలంగాణ సంస్కృతీ ప్రత్యేకత గాంచిన బతుకమ్మ పూల పండగను ఈనెల 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై శనివారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల కార్యదర్శులు, పోలీస్ అధికారులు హాజయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఈ నెల 18వ తేదీన సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని ట్యాంక్ బండ్‌పై వేలాది మంది మహిళలతో సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని అత్యంత వైభంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
18వ తేదీ సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారక కేంద్రం నుంచి వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా వచ్చి ట్యాంక్ బండ్ పైకి చేరుకుంటారని చెప్పారు. వీరితోపాటు వందలాది మంది కళాకారులు తమ కళారూపాలతో ర్యాలీగా వస్తారని వివరించారు. ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసే ప్రత్యేక వేదిక వద్ద జరిగే ఈ బతుకమ్మ ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు హాజరవుతారని అన్నారు.
ఈ బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని పండగ శోభ వచ్చేలా నగరంలోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను ఏర్పాటు చేయడమే కాకుండా పలు జంక్షన్ల కేంద్రాల వద్ద విద్యత్ దీపాలతో అలంకరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. నగరంలోని అన్ని ప్రధాన కార్యాలయాలను కూడా విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. ట్యాంక్ బండ్‌పై బతుకమ్మ ఆడేందుకు సమీపంలోని వాడలు, కాలనీలు, బస్తీల నుండి పెద్ద ఎత్తున మహిళలు వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా, ట్యాంక్ బండ్ చిల్డ్రన్స్ పార్క్‌లో ఉన్న బతుకమ్మ ఘాట్‌తోపాటు నెక్లెస్ రోడ్డులో బతుకమ్మల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల మధ్య ట్యాంకు బండ్‌పై బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నందున ట్రాఫిక్ డైవర్షన్, బారికేడింగ్, కనీస సౌకర్యాల ఏర్పాట్లను చేపట్టాలని తెలిపారు.
అమరవీరుల స్మారక కేంద్రం నుంచి ట్యాంక్ బండ్ వరకు ప్రత్యేకంగా బారికేడింగ్, లైటింగ్ సౌకర్యాలను కల్పించాలని సూచించారు. బతుకమ్మ జరిగే పది రోజుల పాటు రవీంద్ర భారతిలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నందున అక్కడ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని టూరిజం కేంద్రాలు, ప్రముఖ ప్రాంతాల్లోనూ బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలని అన్నారు. బతుకమ్మ ఉత్సవాలను ప్రతిబింబించేలా ఈసారి ప్రత్యేక లోగోను రూపొందిస్తున్నామని వెల్లడించారు. డిసెంబర్‌లో జరుగనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను కూడా ఈ లోగోలో తెలియచేసే విధంగా రూపొందించనున్నట్టు తెలిపారు.