SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

హైదరాబాద్ ప్రయాణికుల ఎదురుచూపులు.. వందేభారత్ స్లీపర్ రైలు ఎప్పుడు..?

Vande Bharat Sleeper Trains: వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు దేశవ్యాప్తంగా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ ఏడాది జనవరిలో హౌరా–గువహతి మార్గంలో మొదలైన తొలి స్లీపర్ సర్వీసు సూపర్ హిట్ కావడంతో రైల్వే శాఖ మరిన్ని కీలక రూట్లలో వీటిని విస్తరిస్తోంది. హైదరాబాద్‌ నుంచి కూడా వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Written By Ashok Krindinti
Published: Nov 12, 2026, 07:28 PM IST | Updated: Nov 12, 2026, 07:30 PM IST
Image Credit: Vande Bharat Sleeper Trains (Source: File)
Join

Vande Bharat Sleeper Trains: హైదరాబాద్ నగరం నుంచి వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభం కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి విశాఖపట్నం, తిరుపతి, యశ్వంత్‌పూర్, నాగ్‌పూర్ నగరాలకు వందే భారత్ చైర్‌కార్ రైళ్లు నడుస్తున్నాయి. పగటిపూట ప్రయాణాలకు ఇవి ఎంతో అనుకూలంగా ఉన్నా.. సుదూర ప్రాంతాలకు వెళ్లే వృద్ధులు, కుటుంబాలకు గంటల తరబడి కూర్చొని ప్రయాణించడం కొంత భారంగా మారుతోంది. దీంతో హైదరాబాద్ నుంచి వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభించాలని ప్రయాణికుల నుంచి డిమాండ్స్ వస్తున్నాయి. రాత్రివేళల్లో విశ్రాంతి తీసుకుంటూ.. తెల్లారేసరికి గమ్య స్థానానికి చేరుకునేలా హైదరాబాద్ నుంచి వందే భారత్ స్లీపర్ సర్వీసులను ప్రారంభించాలని ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు కోరుతున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, ముంబై, చెన్నై, విశాఖపట్నం, తిరుపతి నగరాలకు స్లీపర్ రైళ్లు నడిపితే.. ప్రయాణికులకు సమయం ఆదా అవ్వడంతో పాటు రాత్రి ప్రయాణాలు ఎంతో సౌకర్యవంతంగా మారనున్నాయి.

సంప్రదాయ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పోలిస్తే వందే భారత్ స్లీపర్ రైళ్లు అత్యంత వేగంగా, ఆధునిక హంగులతో రూపొందాయి. గంటకు గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం ఈ రైలు సొంతం. ట్రయల్ రన్‌లో అంతటి వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు కూడా రైలులో ఉంచిన గ్లాసులోని నీరు కనీసం కదలకుండా స్థిరంగా నిలవడం దీని అద్భుత సాంకేతికతకు నిదర్శనం. పూర్తిగా 16 ఏసీ కోచ్‌లతో కూడిన ఈ రైలులో ఆటోమేటిక్ డోర్లు, ఉచిత వై-ఫై, ఆధునిక బయో-వాక్యూమ్ టాయిలెట్లు ఉన్నాయి.

ఫస్ట్ ఏసీ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా వేడి నీటి షవర్ సదుపాయం కల్పించారు. అప్పర్ బెర్త్‌లకు సులభంగా ఎక్కేందుకు వీలుగా మెట్ల నిర్మాణాన్ని సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. ప్రమాదాల నివారణకు స్వదేశీ 'కవచ్' వ్యవస్థ, అగ్నిమాపక అలారాలు, ప్రతి బోగీలో సీసీ టీవీ నిఘా ఏర్పాటు చేశారు. టికెట్ల విషయానికొస్తే.. ఈ రైళ్లలో తత్కాల్, ఆర్‌ఏసీ లేదా వెయిటింగ్ లిస్ట్ విధానం ఉండదు. కేవలం కన్ఫర్మ్ టికెట్లు ఉన్నవారికి మాత్రమే ప్రయాణ అనుమతి ఉంటుంది. టికెట్ ధరలు కూడా స్థిరంగా ఉంటాయి.

దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని.. రానున్న రోజుల్లో 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే హైదరాబాద్ నుంచి ఏయే మార్గాల్లో తొలుత ఈ సర్వీసులను కేటాయిస్తారు..? ఎప్పటి నుంచి పట్టాలెక్కుతాయి..? అనే అంశంపై రైల్వే బోర్డు నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ట్రాక్ సామర్థ్యం, ప్రయాణికుల రద్దీ, కోచ్‌ల లభ్యతను బట్టి త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES