SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

VC Sajjanar: గుండెనిండా మధుర జ్ఞాపకాలతో ఇక సెలవు.. సజ్జనార్‌ భావోద్వేగ సందేశం

VC Sajjanar Say Good Bye To Hyderabad City Police Commissioner: నగర పోలీస్‌ కమిషనర్‌గా తన ప్రయాణం ముగియడంతో ఈ సందర్భంగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వీసీ సజ్జనార్ భావోద్వేగానికి లోనయ్యారు. గుండెనిండా మధుర జ్ఞాపకాలతో హైదరాబాద్ సీపీగా ఇక సెలవు అని ప్రకటించారు. ఈ సందర్భంగా తన పదవీకాలంలో చేసిన పనులు గుర్తుచేసుకున్నారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 13, 2026, 12:53 AM IST | Updated: Nov 13, 2026, 12:55 AM IST
Image Credit: Source: VC Sajjanar Twitter
Join

VC Sajjanar Transfer: విశ్వనగరమైన హైదరాబాద్‌కు పోలీస్‌ కమిషనర్‌గా విశేష సేవలు అందించిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వీసీ సజ్జనార్‌ బదిలీ అయ్యారు. పోలీస్‌ కమిషనర్‌గా ప్రభుత్వం వేరొక అధికారిని నియమించడంతో కమిషనర్‌గా సజ్జనార్‌ చివరి రోజు గడిపారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ పదవికి గుడ్‌బై చెబుతూ కీలక ప్రకటన చేశారు.

'ఏడాది కాలం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక అపురూపమైన ప్రయాణం. చారిత్రక హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సేవ చేసే అవకాశాన్ని కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్న మహేష్ భగవత్‌కు శుభాకాంక్షలు' అని వీసీ సజ్జనార్‌ తెలిపారు. ఏడాది కాలంలో హైదరాబాద్‌ నగర ప్రజలు తనపై, పోలీస్ వ్యవస్థపై చూపిన ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి అని.. తాము చేపట్టిన ప్రతి సంస్కరణనూ తమ సొంత కార్యక్రమంగా భావించి ఎంతగానో ఆదరించిన ప్రజలకు ఈ సందర్భంగా సజ్జనార్‌ ధన్యవాదాలు తెలిపారు.

'మత సామరస్యానికి ప్రతీక మన హైదరాబాద్. ప్రజలంతా కలిసిమెలిసి శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రతి పండుగను ఘనంగా చేసుకున్న తీరు నా మనసును ఎంతగానో కదిలించింది. ప్రజల క్షేమమే పరమావధిగా అనేక అడుగులు వేశాం. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్ ద్వారా ఉక్కుపాదం మోపాం. పెద్ద ఎత్తున కల్తీ ఆహారాన్ని సీజ్ చేసి నిందితులను కటకటాల వెనక్కి నెట్టే ప్రయత్నం చేశాం' అని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సజ్జనార్‌ గుర్తు చేసుకున్నారు.

'సైబర్ నేరాల కట్టడి కేవలం పోలీసులతోనే కాదని గుర్తించి.. ప్రజల్లో చైతన్యం తెస్తూనే బ్యాంకులు, ఇతర విభాగాలను సమన్వయం చేస్తూ దేశవ్యాప్తంగా ‘ఆపరేషన్ ఆక్టోపస్’కు శ్రీకారం చుట్టాం. దీనిపై కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోం సెక్రటరీ ప్రత్యేకంగా స్పందించి మన హైదరాబాద్ సిటీ పోలీస్ ఇచ్చిన సలహాలను స్వీకరించి ప్రశంసించడం అందరికీ దక్కిన గౌరవం' అని సజ్జనార్‌ ప్రకటించారు. బాధితులకు సత్వర న్యాయం చేకూరేలా కేసుల దర్యాప్తు కోసం 'ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్’ను ప్రారంభించి విజయవంతంగా ముందుకు తీసుకెళ్లామని వెల్లడించారు.

భావితరాల బిడ్డల్లో పోలీసులపై భయం పోయి, సమాజంపై ఒక ఉన్నతమైన స్ఫూర్తి కలగాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో ‘డే విత్ సీపీ’ కార్యక్రమం చేపట్టడం. అది నాకు ఎంతో ఆత్మసంతృప్తిని మిగిల్చింది' అని సజ్జనార్‌ గుర్తుచేసుకున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఇతర అధికారుల సహకారంతో విజయవంతంగా అమలు చేసి ట్రాఫిక్ సమస్యలకు ఉపశమనం కలిగించామని సజ్జనార్‌ తెలిపారు. మన ఇంట్లోని ఆడబిడ్డల రక్షణను బాధ్యతగా భావించి మహిళల భద్రత కోసం ‘స్పందన’ వాహనాలను అందుబాటులోకి తెచ్చామని

'ఈ విజయాలన్నింటి వెనుక పోలీస్ కుటుంబం పడిన కష్టం దాగుంది. ఉత్తమ పనితీరు కనబరిచిన సిబ్బందిని గుర్తించే ‘ఎక్స్‌ట్రా మైల్’, వారి ఆరోగ్య రక్షణ కోసం ‘గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్’ వంటి కార్యక్రమాలు వారి త్యాగాలకు మేమిచ్చిన చిరు కానుకలు' అని మాజీ నగర కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. పండుగైనా, పబ్బమైనా తమ సొంత కుటుంబాలను పక్కనపెట్టి రోడ్లపై నిలబడి అహర్నిశలు శ్రమించిన హోంగార్డుల నుంచి అడిషనల్ సీపీల వరకు అందరికీ సజ్జనార్‌ ధన్యవాదాలు తెలిపారు. రాత్రింబవళ్లు చెమటోడ్చే పోలీస్ సిబ్బంది, వారి కుటుంబాలు ఎల్లప్పుడూ క్షేమంగా, ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. హైదరాబాద్ ప్రజలందరూ సురక్షితంగా, సంతోషంగా, భద్రంగా ఉండాలని ఆకాంక్షించారు. గుండెనిండా మధుర జ్ఞాపకాలతో హైదరాబాద్ సీపీగా ఇక సెలవు తీసుకుంటున్నట్లు సజ్జనార్‌ చెప్పారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ZEENEWS TRENDING STORIES