గ్రాండ్‌గా సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ ఈవెంట్.. విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం..!
Hyderabad: హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లో సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ (కర్నూల్) ఫ్రాటర్నిటీ వార్షిక సమావేశం-2026 ఘనంగా జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి.. కళాశాలకు చెందిన ఐదుగురు ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.5 లక్షల ప్రోత్సాహక నగదు బహుమతిని అందించి సత్కరించారు.
Hyderabad: కర్నూల్‌లోని ప్రముఖ సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ (SJGC) ఫ్రాటర్నిటీ వార్షిక సమావేశం-2026 హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు పూర్వ విద్యార్థులు, ఫ్రాటర్నిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కళాశాల విశిష్ట వారసత్వాన్ని, సాధించిన విజయాలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి.. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా కళాశాలకు చెందిన ఐదుగురు అత్యుత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మకుట డెవలపర్స్’ వ్యవస్థాపకులు, చైర్మన్ జనార్ధన్ కొంపల్లి విద్యార్థులకు మొత్తం రూ.5 లక్షల ఆర్థిక సహకారాన్ని అందజేశారు. ఎంపికైన ఐదుగురు ప్రతిభావంతులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ప్రోత్సాహక నగదును అందించారు.
ఈ సందర్భంగా జనార్ధన్ కొంపల్లి మాట్లాడుతూ.. ఎంతోమంది విద్యార్థుల ఉన్నత లక్ష్యాలను తీర్చిదిద్దడంలో SJGC కీలకపాత్ర పోషించిందన్నారు. ప్రతిభావంతులను గుర్తించడం ద్వారా విద్యాసంస్థ వారసత్వాన్ని కాపాడుకోవడమే కాకుండా.. భావి తరాలు ఉన్నత స్థానాలకు ఎదిగి మళ్లీ తమను తీర్చిదిద్దిన సమాజానికి, విద్యాసంస్థకు తిరిగి తోడ్పడేలా స్ఫూర్తిని నింపవచ్చని అన్నారు.
“SJGC ఎంతోమంది విద్యార్థుల ప్రయాణంలో భాగమైంది. వారు తమ తమ రంగాల్లో గొప్ప విజయాలు సాధించేందుకు దోహదపడింది. వారి విజయాలను గుర్తించడం ద్వారా ఆ వారసత్వాన్ని వేడుకగా జరుపుకోవడంతో పాటు.. తదుపరి తరం మరింత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, తమను తీర్చిదిద్దిన విద్యాసంస్థలకు తిరిగి సహకరించేలా ప్రోత్సహించవచ్చు..” అని అన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులంతా ఒకే వేదికపై కలుసుకుని గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కళాశాలతో తమకున్న బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు.