SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

చావలేక బతుకుతున్నా సార్.. బండి సంజయ్‌ను కన్నీటితో వేడుకున్న మాజీ సర్పంచ్.. అసలేం జరిగింది?

Karimnagar News: నక్సల్స్‌ సమయంలో పోలీసులకు ఇన్ఫార్మర్‌గా మారినందుకు ఓ మాజీ సర్పంచ్ ఇప్పటికీ అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నారు. నక్సల్స్‌ పెట్టిన చిత్రహింసలకు కదలలేని పరిస్థితుల్లో ఉన్న ఆయకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భరోసా ఇచ్చారు..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 17, 2026, 13:23 IST | Updated: Nov 17, 2026, 13:24 IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Karimnagar News: దేశం కోసం, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులకు సమాచారం అందించిన పాపానికి ఓ మాజీ సర్పంచ్ గత 33 ఏళ్లుగా నరకయాతన అనుభవిస్తూ వస్తున్నారు.. నక్సల్స్ తూటాలకు బలై.. కనీసం మంచం మీద నుంచి కూడా కదలలేని దీనస్థితిలో ఉన్న ఆయన.. తనకు న్యాయం చేయాలంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను ఆశ్రయించారు. ప్రస్తుతం కరీంనగర్ MP కార్యాలయం వద్ద జరిగిన ఈ హృదయవిదారక ఘటన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది..

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం నందారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి గతంలో గ్రామ సర్పంచ్‌గా పనిచేశారట... ఆ సమయంలో నక్సల్స్ కదలికలపై పోలీసులకు ఇన్ఫార్మర్‌గా సమాచారం అందించేవారట.. ఈ విషయం తెలుసుకున్న మావోయిస్టులు ఆయన్ను కిడ్నాప్ చేసి.. చేతులు కట్టేసి అత్యంత పాశవికంగా చిత్రహింసలకు గురిచేశారట.. అనంతరం ఆయన్ను చంపేయాలనే ఉద్దేశంతో కాల్పులు జరిపారట.. ఆ దాడిలో శ్రీనివాస్ రెడ్డి నడుము విరిగిపోయింది.. అప్పటి నుంచి నడుము కింది భాగం పూర్తిగా చచ్చుబడిపోయి.. స్పర్శ కోల్పోయారు.

గత 33 ఏళ్లుగా మంచానికే పరిమితమైన శ్రీనివాస్ రెడ్డి.. తన భార్య సహాయంతో ఒక ఆటోలో కరీంనగర్‌లోని MP కార్యాలయానికి చేరుకున్నారు.. శరీరం సహకరించక ఆటోలో నుంచి కిందకు దిగలేని నిస్సహాయ స్థితిలో ఆయన ఉన్నారు.. ఈ విషయాన్ని గమనించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్వయంగా తన కార్యాలయం నుంచి బయటకు నడుచుకుంటూ.. ఆటో వద్దకు వెళ్లారు. ఆటోలో కూర్చున్న శ్రీనివాస్ రెడ్డిని ఆప్యాయంగా పలకరించి.. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా.. శ్రీనివాస్ రెడ్డి తను పడుతున్న ఇబ్బందిని తలుచుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు.  సార్.. అప్పట్లో నక్సల్స్ కాల్చిన తూటా ఇప్పటికీ నా శరీరంలోనే ఉండిపోయింది.. కనీసం మలమూత్ర విసర్జన కూడా చేసుకోలేని.. దుస్థితిలో చావలేక బతుకుతున్నాను.. జీవితాంతం మందులు వాడాల్సిందేనని వైద్యులు చెప్పారు. ఆర్థికంగా మా కుటుంబం పూర్తిగా చితికిపోయింది.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. తన పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. బతికున్నంత కాలం ఉచితంగా మందులు అందించేలా చూడాలని విన్నవించారు.. అలాగే, ఎంఎస్సీ, బీఈడీ పూర్తి చేసిన తన కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించి కుటుంబాన్ని ఆదుకోవాలని వినతిపత్రం అందజేశారు..

మాజీ సర్పంచ్ సమస్యలను ఓపికగా విన్న.. కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా చలించిపోయారట.. వ్యవస్థ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన శ్రీనివాస్ రెడ్డికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.. ఈ విషయాన్ని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. ఆయనకు రావాల్సిన వైద్య సాయంతో పాటు కుమార్తె ఉద్యోగ విషయంలోనూ న్యాయం జరిగేలా కృషి చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారట..

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES