దసరా వేళ RTC ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి షాక్.. అక్టోబర్ 8 వచ్చినా జీతాలు రాలేదట!
Rtc Outsourcing Salary Pending: దసరా, దీపావళి సమయాల్లో కూడా RTC ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి జీతాలు రాలేకపోవడంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా చాలీచలని జీతాలతో నెట్టుకుని వస్తున్న వీరికి అక్టోబర్ 8వ తేదీ వచ్చినా.. జీతాలు పడకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు.
Rtc Outsourcing Salary Pending News: ప్రజా రవాణా వ్యవస్థలో ఎంతో అద్బుతమైన ప్రాత పోషిస్తూ.. RTC బస్సులు నిరంతరం రోడ్లపై తిరిగేలా ఎంతగానో శ్రమిస్తున్న కరీంనగర్ ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల కష్టాలు అస్సలు తప్పడం లేదు.. ప్రతినెలా ఒకటో తేదీనే ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఖాతాల్లో జీతాలు జమ చేస్తామంటూ 3 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ.. ఆచరణలోనే ఆగిపోయింది.. సెప్టెంబర్ నెల అయిపోయి.. అక్టోబర్ 8వ తేదీ వచ్చినా.. ఇంకా జీతాలు ఖాతాల్లో పడకపోవడంతో కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది..
ప్రభుత్వం ప్రకటించిన.. తొలినాళ్లలో మొదటి నెల మాత్రమే 1వ తేదీన వేతనాలు చెల్లించారు.. ఆ తర్వాతి నెలలో ఒకటో తేదీ రాత్రి కొందరికి.. ఇక మరికొంతమందికి రెండో తేదీన వేతనాలు అందాయట.. ఇక ప్రస్తుత నెలకు వచ్చేసరికి ఏకంగా 8వ తేదీ దాటిపోయినా వేతనాల ఊసే లేకుండా పోయింది. అధికారులతో పాటు యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ప్రతినెలా వేతనాల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
అయితే, RTCలో పనులు చేస్తున్న ఔట్‌సోర్సింగ్ కార్మికులకు వచ్చేది అంతంతమాత్రం జీతాలే.. ఆ చాలీచాలని వేతనాలతోనే ఇంటి అద్దెలతో పాటు పిల్లల చదువులు, నిత్యావసర సరుకులు, కుటుంబ పోషణను నెట్టుకుంటూ వస్తున్నారు.. అలాంటిది సమయానికి జీతాలు అందకపోతే.. దసరా సీజన్ రావడంతో.. కుటుంబాలను ఎలా పోషించుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారట.. ఇప్పటికే అప్పులు తెచ్చి పూట గడుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
దసరా, దీపావళి వంటి పెద్ద పండుగలు వస్తున్న సమయంలో.. ఇలా జీతాలు నిలిచిపోవడం కార్మికులను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని పలువురు కార్మికులు తెలుపుతున్నారు. పండుగ ఖర్చుల మాట అటుంచితే.. రోజువారీ అవసరాలకే ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే బస్సులు రోడ్డెక్కేలా..ఎంతో శ్రమించే తమకు జీతాలు వెయ్యకుండా ఇలా ఆపడం అన్యాయం అంటున్నారు..