Kondagattu Anjanna: దాదాపు ఒక కాల చక్రం అంటే 60 ఏళ్ల తర్వాత చేపట్టిన ఈ క్రతువులో భాగంగా ప్రతిరోజు యాగశాలలో హోమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు పండితులు నిర్వహించారు. మూలవిరాట్‌పై చందనాన్ని తొలగించిన అనంతరం సుగంధ ద్రవ్యాలను పూసి.. ఐదు నదీ జలాలు, సముద్రపు నీటితో అభిషేకం చేశారు. అనంతరం మండపంలో దిష్టి కుంభం ఏర్పాటుచేసి అద్దంలో స్వామివారి నిజరూపాన్ని ముందుగా ఆయనకే చూపిన తర్వాత అర్చకులు, భక్తులు దర్శించుకుని పరవశించారు.
41 రోజుల పాటు స్వామివారి నిజరూప దర్శనం..
60 సంవత్సరాల తర్వాత అరుదైన చందనోత్సవం కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం నవంబర్ 16 నుండి 20 వరకు జరిగింది. ఈ వేడుకలో, ఆంజనేయ స్వామి యొక్క అసలు రూపంపై 60 సంవత్సరాలుగా ఉన్న చందనాన్ని తొలగించే వేళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో, ఆంజనేయుడి నిజ రూప దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. 41 రోజుల పాటు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం లభించనుంది. 60 ఏళ్లకు ఒకసారి మాత్రమే నిర్వహించే ఈ విశిష్ట ఆధ్యాత్మిక క్రతువు నవంబర్ 15 నుంచి డిసెంబరు 29 వరకు భక్తులకు వీక్షించే భాగ్యం కలగనుంది.
మహా సంప్రోక్షణ, చందనోత్సవం..
బాల్యంలో ఈ ఉత్సవాన్ని దర్శించుకున్న భక్తులకు జీవిత చర మాంకంలో మాత్రమే తిరిగి చూసే అరుదైన అవకాశం లభిస్తుందనే బలమైన విశ్వాసం వందల ఏళ్లుగా భక్తుల్లో కొనసాగుతోంది. ఈ పవిత్ర ఉత్సవంలో భాగంగా స్వామివారి మూలవిరాట్‌పై ఉన్న చందనం, సింధూరాన్ని వేద మంత్రోచ్ఛా రణల మధ్య సంప్రదాయబద్ధంగా తొలగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులకు 41 రోజుల పాటు స్వామివారి అసలు రూపాన్ని దర్శించుకునే అద్భుత అవకాశం అందుబాటులో వచ్చింది. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత జరుగుతున్న ఈ అరుదైన ఆధ్యాత్మిక ఘట్టాన్ని తిలకించేందుకు తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలే కాకుండా దేశ వ్యాప్తంగా వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.
ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాలు, వాహనాల పూజలు రద్దు..
భక్తులకు ఎలాంటి తీవ్ర ఇబ్బందులు తలెత్తకుండా దర్శన క్యూలైన్లు, తాగునీరు, రవాణా, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు అధికారులు. కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు అంజన్నగా భావించే భక్తులు స్వామివారి నిజరూప దర్శనం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో ఆలయ అధికారులు అందుకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలో జరిగే ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాలు, వాహనాల పూజలు రద్దు చేయనున్నారు.