25 ఏళ్లుగా పరిహారం కోసం ఎదురుచూపులు.. బాధిత రైతుల ఆందోళన!
Jagtial News: 25 ఏళ్లు అవుతున్న రైల్వే స్టేషన్ నిర్మాణంలో భాగంగా రైతుల నుంచి సేకరించిన భూములకు అధికారు ఇంకా నష్టపరిహారం చెల్లించలేకపోవడంతో వారు రోడ్డెక్కారు. అంతేకాకుండా వారికి న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు.
Jagtial News: భూమిని నమ్ముకుని బతికే అన్నదాతలకు 25 సంవత్సరాలు గడిచిన ఎలాంటి న్యాయం దక్కకపోవడంతో వారంతా ఓ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం భూములిచ్చి.. దశాబ్దాలుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్న బాధిత రైతులు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కారు. జగిత్యాల జిల్లాలోని లింగంపేట రైల్వే స్టేషన్ భూసేకరణ బాధిత రైతులు శుక్రవారం స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
దాదాపు 25 ఏళ్ల క్రితం లింగంపేట రైల్వే స్టేషన్ నిర్మాణ పనుల కోసం అధికారులు రైతుల నుంచి దాదాపు 100 ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించారట.. అయితే, తమ జీవనాధారమైన భూములను ప్రాజెక్టు కోసం ఇచ్చేసినప్పటికీ.. అప్పటి నుంచి ఇప్పటివరకు తమకు రావాల్సిన నష్టపరిహారాన్ని పూర్తిగా చెల్లించకుండా అధికారులు తిప్పుకుంటున్నారని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి న్యాయపోరాటం చేసిన తర్వాత.. సుప్రీంకోర్టు సైతం రైతులకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది.. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. స్థానిక అధికారులు పరిహారం చెల్లించడంలో తీవ్ర అలసత్వం చేస్తున్నారని బాధిత రైతులు మండిపడ్డారు.
పరిహారం చెల్లింపులో జరుగుతున్న జాప్యంపై న్యాయస్థానం స్పందించి.. RDO కార్యాలయ సామగ్రిని జప్తు చేయాలని గతంలో ఆదేశాలు జారీ చేసినట్లు కూడా తెలుస్తోంది.. అయితే, కోర్టు ఉత్తర్వుల అమలు నేపథ్యంలో అధికారుల తీరు తీవ్ర వివాదాస్పదంగా మారుతూ వస్తోంది.. కోర్టు సిబ్బంది లేదా బాధితులు వచ్చే అవకాశం ఉందని ముందస్తు సమాచారం అందుకున్న రెవెన్యూ సిబ్బంది.. హడావుడిగా కార్యాలయంలోని ఫర్నిచర్‌తో పాటు కంప్యూటర్లు, విలువైన సామగ్రిని వేరే ప్రదేశానికి తరలించినట్లు సమాచారం.. కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సింది పోయి.. కార్యాలయ సామాన్లు దాచడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.
కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు.. అధికారుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము మా హక్కుల కోసం పోరాడుతున్న రైతులమే కానీ ఉగ్రవాదులం కాదని.. మా భూములు లాక్కుని 25 ఏళ్లు తిప్పుకోవడం ఏంటి? అని కన్నీరుమున్నీరవుతున్నారు. తమను దొంగల్లా చూడటం మానుకుని.. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం.. తక్షణమే నష్టపరిహారానికి సంబంధించిన నిధులు విడుదల చేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని, జిల్లా ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.