Karimnagar Collectorate: 'కలెక్టరేట్ భవనం పేదవాడికి ఒక నమ్మకం కల్పించాలి. పేదల సమస్యల చిక్కుముడులు విప్పడానికి ఈ కార్యాలయం ఉపయోగపడాలి' అని సూచించారు. 'సంక్షేమ పథకాలు పేదలకు చేరవేసే ప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులే.. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కార్యాలయ నిర్మాణం పూర్తి చేశాం . సహాయం కోసం నిస్సహాయంగా వచ్చే వారిలో మన కుటుంబ సభ్యులను చూడండి' అని ఉద్యోగులకు ముఖ్యమంత్రి సూచనలు చేశారు. అప్పుడే సహాయం కోసం వచ్చే వారికి నూటికి నూరు శాతం న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభించిన అనంతరం కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. 'మా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నాం. మీ సహకారంతో వీలైనంత మేరకు మీ సమస్యలను పరిష్కరిస్తున్నాం. మనం ప్రజలకు సేవలు అందిస్తూనే సమస్యలను పరిష్కరించుకుందాం. అప్పుడే ప్రజలకు మనపై విశ్వాసం బలపడుతుంది. మీరంతా కష్టపడితేనే పేదలకు న్యాయం జరుగుతుంది' అని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రికైనా, ప్రధానమంత్రికైనా మంచి పేరు రావాలంటే ఉద్యోగుల సహకారంతోనేని చెప్పారు.
'ప్రజలకు సేవలు అందించే మీకు మౌలిక వసతులు కల్పించాలని ఈ భవన సముదాయ నిర్మాణం పూర్తి చేశాం. కేంద్రంతో ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ముందుకు వెళతాం' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 'రూ.వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు నిర్మించినా కేంద్రం అనుమతులు ఇవ్వకపోతే ప్రయోజనం ఉండదని.. కానీ కొందరు మా పర్యటనలను లెక్కలేస్తున్నారు. సమస్యలు పరిష్కరించుకునేందుకు ఎన్నిసార్లైనా కేంద్రాన్ని కలవాల్సిందే' అని తెలిపారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆరు నెలల్లోనే 170 ఎకరాలు డిఫెన్స్ భూములను రాష్ట్ర అభివృద్ధి కోసం బదలాయించేలా చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. బేగంపేట రన్ వే కింద నుంచి రోడ్డు వేసుకునేందుకు అనుమతులు సాధించామని తెలిపారు. సిద్ధాంతాలు వేరైనా అభివృద్ధి కోసం ఒకరికొకరం సహకరించుకుంటామని.. మరోసారి జిల్లా అభివృద్ధిపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. అంతకుముందు కరీంనగర్ నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు ఉన్నారు.