Karakagudem Maoist History: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుమూల ప్రాంతం కరకగూడెం. ఒకప్పుడు ఈ పేరు చెబితేనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పోలీసు అధికారులు వణికిపోయేవారు. మావోయిస్టుల సాయుధ కదలికలకు ఈ ప్రాంతం ప్రధాన కేంద్రంగా ఉండేది. 1997 జనవరి 9 అర్ధరాత్రి వేళ.. కరకగూడెం చరిత్రలోనే మర్చిపోలేని విషాదం జరిగింది. వందలాది మంది మావోయిస్టులు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్‌పై విరుచుకుపడ్డారు. బాంబులతో స్టేషన్‌ను పేల్చివేసి జరిపిన కాల్పుల్లో 16 మంది పోలీసులు వీరమరణం పొందారు.
దాడి తర్వాత స్టేషన్‌లోని ఆయుధాలను మావోయిస్టులు ఎత్తుకెళ్లడం ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. అంతకుముందు 1992లో రాల్లవాగు దగ్గర జరిగిన మందుపాతర పేలుడులో 10 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస ఘటనలతో కరకగూడెం చుట్టుపక్కల తీవ్ర భయానక వాతావరణం అల్లుకుంది. సాయంత్రం ఐదు దాటితే చాలు.. ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా జనం వణికిపోయే పరిస్థితి ఉండేదని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు.
వరుస ఘటనలతో అప్రమత్తమైన ప్రభుత్వం కరకగూడెంలో భద్రతను పెంచేందుకు గట్టి చర్యలు చేపట్టింది. సాధారణ స్టేషన్ స్థానంలో దాడులను తట్టుకునేలా అత్యంత ఆధునిక 'బుల్లెట్ ప్రూఫ్ పోలీస్ స్టేషన్' నిర్మించింది. అదనపు బలగాల నియామకం, నిఘా వ్యవస్థ బలోపేతం, అడవుల్లో నిరంతర కూంబింగ్ ఆపరేషన్లతో మావోయిస్టుల కదలికలకు చెక్ పెట్టారు. మధ్యలో 2024 సెప్టెంబర్‌లో మోతే సమీపంలో జరిగిన ఎదురుకాల్పులు గతాన్ని గుర్తుచేసినప్పటికీ.. పోలీసులు నిరంతర నిఘాతో పరిస్థితులను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.
శాంతిభద్రతలు అదుపులోకి రావడంతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కరకగూడెం అభివృద్ధి బాట పట్టింది. ప్రజల దశాబ్దాల కల నెరవేరుస్తూ ప్రభుత్వం కరకగూడెంను ప్రత్యేక మండలంగా ప్రకటించింది. మండల కేంద్రంగా మారడంతో ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి. మారుమూల గ్రామాలకు పక్కా రోడ్లు పడ్డాయి. విద్య, వైద్య వసతులు విస్తరించి వ్యాపారాలు ఊపందుకున్నాయి. అడవులకే పరిమితమైన ప్రాంతం.. ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ భద్రతా వలయాలు, అర్ధరాత్రి సైరన్ల శబ్దాలు ఉండే చోట.. ఇప్పుడు సాధారణ జనజీవనం కనిపిస్తోంది. పిల్లలు ప్రశాంతంగా బడులకు వెళ్తున్నారు, వ్యాపారాలు సజావుగా సాగుతున్నాయి. నెత్తుటి జ్ఞాపకాల నుంచి కరకగూడెం కోలుకుని శాంతికి ప్రతీకగా నిలిచింది. హింసను గెలిచి అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న కరకగూడెం.. చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాస్తోంది..!