Paddy Price Today: ఖరీఫ్ సీజన్ వచ్చిందంటే రాష్ట్రవ్యాప్తంగా అందరికంటే ముందుగా వరినాట్లు పడేది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే. అందుకే ఇతర జిల్లాలతో పోలిస్తే నెలరోజుల ముందే ఇక్కడ పంట కోతలు షురూ అవుతాయి. వారం రోజుల కిందటే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంట కొతల సందడి మొదలైంది. ఓవైపు కోతలు సాగుతుండగానే, మరోవైపు ప్రైవేటు వ్యాపారులు రైతుల కల్లాల బాట పట్టారు. ఈసారి ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరి సాగు తీవ్రంగా పడిపోయింది. గతేడాది ఖరీఫ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 67.30 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, ఈ సీజన్ నాటికి అది 55.89 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అంటే గతంతో పోలిస్తే పంట విస్తీర్ణం దాదాపు 17 శాతం తగ్గింది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో సాగు నీరు లేక వరి విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది.
రాష్ట్రంలోని మిగతా జిల్లాల పరిస్థితి ఎలా ఉన్నా...ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాత్రం వరి సాగు సాధారణ విస్తీర్ణంలో 98 శాతానికి చేరింది. టైంకి కురిసిన వర్షాలు, నిజాంసాగర్ ప్రాజెక్టుతో పాటు స్థానిక చెరువుల్లోకి నీరు చేరడంతో రైతులు పైర్లు ఎండకుండా కాపాడుకున్నారు. ఫలితంగా నిజామాబాద్ జిల్లాలో 4.30 లక్షల ఎకరాలు, కామారెడ్డి జిల్లాలో 3.20 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. ఈసారి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు 15 లక్షల క్వింటాళ్ల వడ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
దిగుబడి ఆశాజనకంగా ఉండటంతో పాటు, బయట మార్కెట్‌లో ధాన్యానికి భారీగా డిమాండ్ ఏర్పడింది. సాధారణంగా ధాన్యం ఆరబెట్టి, తూకం తగ్గకుండా చూసుకోవడం రైతులకు పెద్ద సవాలుగా మారేది. కానీ ఈసారి తూకం తగ్గుతుందనే బాధ లేకుండా, కోసిన పచ్చి ధాన్యానికే క్వింటాకు 3,000 పైచిలుకు ధర పలుకుతోంది. ప్రైవేటు వ్యాపారులు పోటీపడి మరీ కల్లాల్లోనే నగదు చెల్లించి వడ్లను లారీల్లో తరలిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం 'ఎ' గ్రేడ్ రకం సన్నాలకు క్వింటాకు 2,461 లభిస్తుంది. దీనికి ప్రభుత్వం ఇచ్చే 500 బోనస్ కలిపినా రైతుకు 2,961 మాత్రమే వస్తుంది. కానీ ప్రైవేట్ మార్కెట్‌లో ప్రస్తుతం సన్న వడ్లకు ఏకంగా 3,000 ధర లభిస్తోంది. మరో వారం రోజుల్లో బీపీటీ రకాలు కూడా చేతికి రానున్నాయి. వీటి ధర క్వింటాకు 3,500 వరకు పలికే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
మిర్యాలగూడ, నెల్లూరు నుంచి వచ్చిన మిల్లు వ్యాపారులు రైతుల దగ్గర నేరుగా కొనుగోళ్లు జరుపుతున్నారు. జూన్ నెలలోనే నాట్లు వేసిన రైతులు ఇప్పటికే కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని విక్రయించారు. 50 బస్తాల సన్నరకం పచ్చి ధాన్యాన్ని క్వింటాకు 3,025 చొప్పున అమ్ముకున్నామని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 7 ఎకరాల్లో సాగు చేసిన రైతులకు 37 క్వింటాళ్ల దిగుబడి రాగా, వ్యాపారులు భారీగా ధర చెల్లించి పచ్చి ధాన్యాన్నే కొనుగోలు చేశారు. ఈ ఏడాది సన్న రకాలకు సగటున క్వింటాకు 3,000 నుంచి 3,500 వరకు ధర లభించే అవకాశం ఉండటంతో రైతాంగంలో ఉత్సాహం నెలకొంది. అయితే వ్యాపారులు కల్లాల్లోనే పోటీపడి అధిక ధరలకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండటంతో....రానున్న రోజుల్లో బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు మరింత ప్రియమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.