SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఇందిరమ్మ జీవిత బీమా పథకంపై ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ..

Indiramma Kutumba Jeevitha Bheema:తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదుపై టర్న్మ్స అండ్ కండిషన్స్ జారీ చేసింది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న జీవిత బీమా, ఇతర బీమా పథకాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 21, 2026, 11:11 IST | Updated: Nov 21, 2026, 12:16 IST
Image Credit: Indiramma Bheema Terms & Conditions (Source/AI)
Join

Telangana Government Announce New Policy: ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఇస్తున్న పథకాల పరిధిలోకి రాని కుటుంబాలను మాత్రమే కొత్త పథకంలో నమోదు చేయాలని ఆదేశించింది. ఈ పథకం కింద బీమా పొందిన వ్యక్తి మరణిస్తే వారి నామినీలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనుంది.  కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. శుక్రవారం విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం.. బీమా చేయించుకోవాలనుకునే వ్యక్తి స్వయంగా నమోదు శిబిరానికి హాజరై తన నామినీల వివరాలు అందించాలి. అనారోగ్యం లేదా దివ్యాంగత్వం కారణంగా శిబిరానికి రాలేని వారి కోసం ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. శిబిరం ఇం‌ఛార్జి వారి ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించి నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి.

ప్రతి కుటుంబం నుంచి 18–59 ఏళ్ల మధ్య వయసున్న ఒక్కరికే  బీమా..

ఈ పథకం కింద ప్రతి కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే బీమా సదుపాయం కల్పిస్తారు. కుటుంబ పెద్ద లేదా కుటుంబ పోషణకు ప్రధానంగా ఆదాయం సమకూర్చే వ్యక్తిని బీమా పరిధిలోకి తీసుకుంటారు. నమోదుకు నిర్ణయించిన వయోపరిమితి 18 నుంచి 59 ఏళ్లు. వయసు నిర్ధారణకు ఆధార్‌ కార్డును ప్రామాణికంగా తీసుకుంటారు. ఆధార్‌లో కేవలం పుట్టిన సంవత్సరం మాత్రమే నమోదై ఉంటే జులై 1వ తేదీని జన్మదినంగా పరిగణిస్తారు. పుట్టిన తేదీలో తప్పులు ఉంటే ముందుగా ఆధార్‌ వివరాలను సరిచేసుకున్న తర్వాతే బీమాకు దరఖాస్తు చేసుకోవాలి. నమోదు ప్రక్రియ మొత్తం ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక వెబ్‌సైట్‌, మొబైల్‌ అప్లికేషన్ల ద్వారా మాత్రమే జరుగుతుంది. ఓటీపీ ఆధారిత ధ్రువీకరణ తప్పనిసరి. దరఖాస్తుదారులు ఆధార్‌, ఆహార భద్రత కార్డుల ప్రతులతో పాటు తమ మొబైల్‌ నంబరును అందించాలి.

బీమా పొందిన వ్యక్తి మరణిస్తే నామినీలకు 5 లక్షలు అందజేత ..

నమోదు సమయంలో రేషన్‌ కార్డుల్లోని వివరాలను పౌరసరఫరాల శాఖ డేటాతో సరిపోల్చి కుటుంబ సభ్యుల సమాచారాన్ని ధ్రువీకరిస్తారు. అనంతరం బీమా పొందే వ్యక్తి నామినీల వివరాలను నమోదు చేస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలను ఎంపిక చేసుకుంటే రూ.5 లక్షల బీమా మొత్తాన్ని వారికి ఏ నిష్పత్తిలో పంపిణీ చేయాలో ముందుగానే తెలియజేయాలి. నామినీ మైనర్‌ అయితే అతని తరఫున బీమా క్లెయిమ్‌ స్వీకరించేందుకు మేజర్‌ అయిన వ్యక్తి లేదా సంరక్షకుడి వివరాలను నమోదు చేయాలి. బీమా పొందే వ్యక్తి కంటే ముందే నామినీ మరణించినా.. నామినేషన్‌ మార్చుకోవాలనుకున్నా నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది.

రేషన్‌ కార్డు నంబరే దరఖాస్తు సంఖ్య..
ఈ పథకంలో రేషన్‌ కార్డు నంబరునే దరఖాస్తు సంఖ్యగా.. ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా ఉపయోగిస్తారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన రేషన్‌ కార్డులు ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. లబ్ధిదారుల వివరాల ధ్రువీకరణను సంబంధిత కుటుంబం స్వస్థల జిల్లాలోనే నిర్వహిస్తారు. రేషన్‌ కార్డులకు ఈ-కేవైసీ ఇంకా పూర్తికాని కుటుంబాలు ముందుగా ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. తద్వారా అర్హులైన కుటుంబాలను గుర్తించడంతో పాటు నమోదు సమయంలో తప్పులు, అనర్హతలకు అవకాశం లేకుండా చూడాలని భావిస్తోంది.

రూ. 5 లక్షల జీవిత బీమా.. 
బీమా కవరేజీ ప్రారంభమైన తేదీ నుంచి సంబంధిత పాలసీ సంవత్సరం ముగిసే వరకు రక్షణ కొనసాగుతుంది. ఈ మధ్యకాలంలో బీమా పొందిన వ్యక్తి 59 ఏళ్ల గరిష్ఠ వయోపరిమితిని దాటినా.. అప్పటికే ప్రారంభమైన పాలసీ యేడాది ముగిసే వరకు బీమా వర్తిస్తుంది. పథకం అమలులో పారదర్శకత, సమన్వయం కోసం జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. నమోదు శిబిరాల నిర్వహణ నుంచి మొత్తం ప్రక్రియను కలెక్టర్లు పర్యవేక్షించాలి. అదనపు కలెక్టర్‌ లేదా మరో సీనియర్‌ అధికారిని జిల్లా స్థాయి నోడల్‌ అధికారిగా నియమించాలి. ప్రతి మండలం, పురపాలికకు జిల్లా స్థాయి అధికారిని సమన్వయ అధికారిగా.. ప్రతి గ్రామ పంచాయతీ, వార్డుకు తహసీల్దార్‌, ఎంపీడీవో లేదా డిప్యూటీ మున్సిపల్‌ కమిషనర్‌ను సమన్వయ బాధ్యతల్లో నియమించాలి. ప్రభుత్వ తాజా మార్గదర్శకాలతో అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా భరోసా అందించే దిశగా నమోదు ప్రక్రియకు స్పష్టత లభించింది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES