తెలంగాణలో బతుకమ్మ సంబురం..ఏ రోజు ఏ బతుకమ్మ? ఏ నైవేద్యం సమర్పించాలి? పూర్తి వివరాలివే.!!
Bathukamma 2026: తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబురాలు షురూ అయ్యాయి. దసరా వేడుకలకు ముందే ఆరంభమయ్యే బతుకమ్మ ఉత్సవాలు.. తెలంగాణ ఆత్మగౌరవానికి, అస్థిత్వానికి, ప్రకృత్యారాధనకు ప్రతిరూపంగా నిలుస్తాయి. ఈ ఏడాది కూడా బతుకమ్మ, దసరా సంబురాల కోసం తెలంగాణ పల్లెలు, పట్టణాలు అంగరంగ వైభవంగా సిద్థమవుతున్నాయి.
Bathukamma 2026: తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబురాలు షురూ అయ్యాయి. దసరా వేడుకలకు ముందే ఆరంభమయ్యే బతుకమ్మ ఉత్సవాలు.. తెలంగాణ ఆత్మగౌరవానికి, అస్థిత్వానికి, ప్రకృత్యారాధనకు ప్రతిరూపంగా నిలుస్తాయి. ఈ ఏడాది కూడా బతుకమ్మ, దసరా సంబురాల కోసం తెలంగాణ పల్లెలు, పట్టణాలు అంగరంగ వైభవంగా సిద్థమవుతున్నాయి. మహాఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మతో ఆరంభమయ్యే ఈ ఉత్సవాలు 9 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగుతాయి. చివరి రోజు సద్ధుల బతుకమ్మగా ఎంతో కోలాహలంగా ముగుస్తాయి. ఈ 9 రోజులపాటు తెలంగాణ వీధులన్నీ ఆడపడుచుల ఆటపాటలు..వాకిళ్లలో ముగ్గులతో..గళ్లి గళ్లీనా బతుకమ్మ పాటలతో పండగ శోభను సంతరించుకుంటాయి.
కాగా ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు బతుకమ్మ సంబురాలు కొనసాగనున్నాయి. మహాలయ అమావాస్య సందర్భంగా శనివారం సాయంత్రం ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు ప్రారంభమవుతాయి. బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మను రోజుకో పేరుతో పిలుస్తుంటారు. అలాగే ప్రతిరోజూ బతుకమ్మ ఆడటం పూర్తయిన తర్వాత నైవేద్యాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ ఉత్సవాల్లో మహిళలు ప్రకృతిసిద్ధంగా లభించే రకరకాల పువ్వులను పూజించడం విశేషం. ముఖ్యంగా తంగేడు, గునుగు, బంతి, చామంతి, గులాబీ, కట్లపూలు, తామర, రుద్రాక్ష, గన్నేరు వంటి సహజమైన పూలను ఎంతో భక్తిశ్రద్ధలతో సేకరిస్తారు. వీటిని అట్టలు లేదా రాగి తాంబాలాల్లో క్రమపద్ధతిలో పేరుస్తూ బతుకమ్మను తయారు చేస్తారు. సాయంత్రం వేళల్లో అందరూ ఒకచోట చేరి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆడిపాడతారు.
కేవలం పూలతోనే దైవాన్ని ఆరాధించి, ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే ఇటువంటి ప్రత్యేకమైన సాంస్కృతిక వేడుక ప్రపంచంలోనే మరెక్కడా కానరాదు. ప్రకృతిని దైవంగా భావించే ఈ సంప్రదాయం తెలంగాణ సంస్కృతికి ఒక అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే బతుకమ్మను ఏ రోజు ఏ పేరుతో పిలుస్తారు.. ఆ రోజు సమర్పించే నైవేద్యాలు ఏంటి.. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
తొలిరోజు ( అక్టోబర్ 10వ తేదీ)
తొలిరోజు బతుకమ్మను మహాలయ అమావాస్య లేదా భాద్రపద అమావాస్యతో ప్రారంభిస్తారు. తొలిరోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మని పిలుస్తుంటారు. ఈ రోజు బియ్యం పిండి, నువ్వులు కలిపిన నైవేద్యం తయారు చేసి బతుకమ్మకు సమర్పిస్తారు.
2వ రోజు: అటుకుల బతుకమ్మ (అక్టోబర్ 11)
ఆశ్వయుజ మాసంలో వచ్చే పాడ్యమి తిథినాడు రెండవ రోజు బతుకమ్మను వేడుకగా జరుపుకుంటారు. ఈ రోజు కొలిచే బతుకమ్మను అటుకుల బతుకమ్మ అని పిలుస్తారు. అమ్మవారికి చప్పిడి పప్పు, బెల్లం, అటుకులను కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.
3వ రోజు: ముద్దపప్పు బతుకమ్మ (అక్టోబర్ 12)
విదియ తిథి నాడు మూడవ రోజు ఉత్సవం సాగుతుంది. ఈ రోజు అమ్మవారిని ముద్దపప్పు బతుకమ్మ గా ఆరాధిస్తారు. ఈ సందర్భంగా ముద్దపప్పు, బెల్లం, పాలు కలిపి చేసిన రుచికరమైన ప్రసాదాన్ని నివేదిస్తారు.
4వ రోజు: నాన బియ్యం బతుకమ్మ (అక్టోబర్ 13)
నాలుగో రోజు బతుకమ్మను నాన బియ్యం బతుకమ్మ అంటారు. ఈ రోజు తంగేడు, గునుగు పూలను నాలుగు వరసలు లేదా పొరలుగా అమర్చి బతుకమ్మను అందంగా పేరుస్తారు. నానబెట్టిన బియ్యం, బెల్లం, పాలు కలిపి అమ్మవారికి నైవేద్యంగా అర్పిస్తారు.
5వ రోజు: అట్ల బతుకమ్మ (అక్టోబర్ 14)
ఐదవ రోజు జరుపుకునే వేడుకను అట్ల బతుకమ్మగా వ్యవహరిస్తారు. గోధుమ పిండి లేదా బియ్యం పిండితో తయారు చేసిన అట్లను అమ్మవారికి ప్రసాదంగా సమర్పించడం ఈ రోజు ప్రత్యేకత.
6వ రోజు: అలిగిన బతుకమ్మ (అక్టోబర్ 15)
ఆశ్వయుజ పంచమి నాడు వచ్చే ఆరవ రోజును అలిగిన బతుకమ్మ అని పిలుస్తారు. పౌరాణిక నమ్మకాల ప్రకారం ఈ రోజు అమ్మవారు అలక వహిస్తుంది. అందువల్ల ఈ రోజు బతుకమ్మను పేరుచుట కానీ, ఆడటం కానీ చేయరు. ఎలాంటి నైవేద్యం కూడా సమర్పించరు.
7వ రోజు: వేపకాయల బతుకమ్మ (అక్టోబర్ 16)
ఏడవ రోజు వేడుకను వేపకాయల బతుకమ్మగా కొలుస్తారు. బియ్యం పిండిని వేపకాయల ఆకారంలో చిన్న ముద్దలుగా తయారు చేసి.. వాటిని నైవేద్యంగా సమర్పించడం ఇక్కడ ఆనవాయితీ.
8వ రోజు: వెన్నముద్ద బతుకమ్మ (అక్టోబర్ 17)
ఎనిమిదవ రోజు కొలిచే బతుకమ్మను వెన్నముద్ద బతుకమ్మ అంటారు. ఈ రోజు నువ్వులు, వెన్నముద్ద, బెల్లం కలిపి తయారు చేసిన ప్రసాదాన్ని గౌరమ్మకు నివేదిస్తారు.
9వ రోజు: సద్దుల బతుకమ్మ - మహా వేడుక (అక్టోబర్ 18)
ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైన తుది రోజును సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మ గా పిలుస్తారు. ఆశ్వయుజ దుర్గాష్టమి నాడు ఈ వేడుక అత్యంత శోభాయమానంగా జరుగుతుంది. ఈ రోజు ప్రతీ ఇంట్లో తల్లి బతుకమ్మతో పాటు పిల్ల బతుకమ్మను కూడా పేర్చి, నూతన వస్త్రాలు ధరించి ఆడపడుచులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.
ఈ రోజు అమ్మవారికి 5 రకాల ప్రసాదాలు (సద్దులు) సమర్పిస్తారు:
*పెరుగన్నం
*చింతపండు పులిహోర
*నిమ్మకాయ అన్నం
*కొబ్బరన్నం
*నువ్వులన్నం
సాయంత్రం వేళల్లో ఊరి చెరువులు, కాలువల వద్ద బతుకమ్మలను నిమజ్జనం చేసి, మహిళలు ఒకరికొకరు వాయనాలు ఇచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకోవడంతో ఈ 9 రోజుల పండుగ సంబురాలు ముగుస్తాయి.